ఎంపీ మిధున్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం

చంద్రబాబు కక్ష రాజకీయాలకు ఇది పరాకాష్ట

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన

ఈ తరహా చర్యలు ఎల్లకాలం సాగవు

ఇలాంటి వాటితో పార్టీని కట్టడి చేయలేరు

ప్రజల్లో మా పార్టీ మరింత బలపడుతోంది

వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేతల స్పష్టీకరణ

తాడేప‌ల్లి: లిక్కర్‌ స్కామ్‌ పేరుతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత పీవీ మిధున్‌రెడ్డిని రోజంతా విచారించి, రాత్రి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జునతో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్‌రెడ్డి పత్రికా ప్రకటన.

    ‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష రాజకీయాలు చేస్తున్న సీఎం చంద్రబాబు చర్యల్లో ఇది పరాకాష్ట. మా పార్టీ లోక్‌సభ పక్ష నేత పీవీ మిధున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఇలాంటి కక్ష రాజకీయాలు ఎల్లకాలం సాగవు. ఇలాంటి వాటితో మా పార్టీని కట్టడి చేయాలనుకోవడం అవివేకం. ప్రజా సమస్యలపై మా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. అందుకే మా పార్టీ మరింత బలపడుతోంది. దీన్ని చూసి భయపడుతున్న సీఎం చంద్రబాబు, ఇలా అక్రమ అరెస్టులు కొనసాగిస్తున్నారు’.
    ‘వాస్తవానికి 2014–19 మధ్య అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు మద్యం విక్రయాల్లో అనేక అక్రమాలు చేశారు. ఆ కేసులో ఏ–2గా ఉన్న ఆయన, బెయిల్‌పై బయట ఉంటూ.. దాన్ని కనుమరుగు చేసేందుకు గత మా ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో అవినీతి చేశారంటూ లేని స్కామ్‌ సృష్టించి (ఫ్యాబ్రికేటెడ్‌ కేస్‌) అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఎక్కడా ఆధారాలు లేకపోయినా, కేవలం స్టేట్‌మెంట్లు ఇప్పిస్తూ, వాటి ఆధారంగా కేసులు నమోదు చేస్తూ, అరెస్టులు చేస్తున్నారు. ఆ దిశలో ఇప్పటికే పార్టీలో కీలకమైన వ్యక్తులు, నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. ఇప్పుడు ఎంపీ మిధున్‌రెడ్డిని కూడా ఆ విధంగానే అక్రమంగా అరెస్టు చేశారు’.
    ‘ఇది కచ్చితంగా కక్షపూరిత రాజకీయం. గత మా ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీని పారదర్శకంగా అమలు చేశాం. ఎక్కడా అవినీతిని తావు లేకుండా ప్రభుత్వమే స్వయంగా మద్యం షాప్‌లు నిర్వహించింది. మద్యం షాప్‌లు తగ్గించడమే కాకుండా, పర్మిట్‌రూమ్‌లు, బెల్టుషాప్‌లు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇంకా మద్యం విక్రయ వేళలు కూడా తగ్గించడం వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. అయినా మద్యం విక్రయాల్లో స్కామ్‌ జరిగిందంటూ అభూత కల్పనలు, ఎల్లో మీడియాలో విషపూరిత ప్రచారంతో మా పార్టీ వారిపై వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు’.
    ‘ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవు. ఇది వాస్తవం. ప్రజా సంక్షేమం, వారి అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడి పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు, ఇప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న వైయ‌స్ఆర్‌సీపీ.. ప్రజల్లో మరింతగా ఎదుగుతోంది. అందుకే చంద్రబాబు తన కుట్రలకు ఎప్పటికైనా ఫలితం అనుభవించక తప్పదు. కక్ష సాధింపు చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రజల పక్షాన నిలబడడంలో ఎప్పుడూ, ఎక్కడా వెనకడుగు వేయబోము’.

Back to Top