తాడేపల్లి: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓటమి టీడీపీ, జనసేన కూటమికి చెంపదెబ్బ లాంటిదని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ,జనసేన కూటమి పార్టీలకు చావుదెబ్బ తగిలింది. ఎల్లవేళలా మోసం పనిచేయదని తేలిపోయింది. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు గట్టి గుణపాఠం చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేశారు. చంద్రబాబుగారు చేసిన మోసాలను తిప్పికొడుతూ ఇవాళ గట్టి తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖపట్నం.. మూడు జిల్లాల నుంచి టీచర్లు పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం చేసింది.