ఏలూరు : జన బలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేసూ్తనే.. మరోవైపు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తర కోస్తా (ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు)లోని 50 నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు, అభిమానులు తరలిరానున్నారు. గోదావరి జిల్లాల రాజకీయ చరిత్రలో ఈ సభ అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ కానుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. లక్షలాది మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రాక నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సభా ప్రాంగణం, ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారు. యుద్ధ ప్రాతిపదికన సభా వేదిక, హెలిప్యాడ్ నిర్మాణం, గ్యాలరీలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీరు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆరి్డనేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్యచౌదరి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, వడ్డీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ డి.మేరి ప్రశాంతి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.