అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను ‘సిద్ధం’ సభలతో సన్నద్ధం చేసిన వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టో రూపకల్పనపై చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 4 లోక్‌సభ స్థానాల పరిధిలో ఇప్పటికే సిద్ధం సభలు నిర్వహించిన నేపథ్యంలో మిగతా 21 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రజలతో మమేకమవుతూ పార్టీ శ్రేణులను, అభిమానులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు ఈనెల 27న ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్ మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చెప్పారు. చెప్పిన వాటితోపాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేయడంతో జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగింది. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలతో ఇది ప్రస్ఫుటితమైంది. బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా మేనిఫెస్టోను ప్రకటించనుండటంతో జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అన్న నమ్మకం ప్రజల హృదయాల్లో నాటుకుపోయింది. పాలనకు దిక్సూచిగా.. ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి హామీలు గుప్పిస్తూ మేనిఫెస్టో విడుదల చేయడం.. గద్దెనెక్కాక ఐదేళ్ల పాటు సాగదీసి దిగిపోయే వేళ మళ్లీ ఓటర్లను ఆకట్టుకోవడానికి అరకొరగా హామీలు అమలు చేయడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి కూడా మాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో రెండే రెండు పేజీలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే సీఎం కార్యాలయంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మేనిఫెస్టో బోర్డులు ఏర్పాటు చేసి దానికి పవిత్రతను ఆపాదించారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలు చేశారు. ఐదేళ్లలో మొత్తమ్మీద 99 శాతం హామీలను నెరవేర్చారు. ఏపీ లో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. నాన్‌డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపితే నవరత్నాలు ద్వారా రూ.4.49 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని పేదలకు గత 58 నెలల్లో సీఎం జగన్ చేకూర్చారు. దీన్ని సద్వినియోగం చేసుకుని పేదరికం నుంచి గట్టెక్కుతున్నారు. ఏపీలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. విప్లవాత్మక మార్పులు.. వికేంద్రీకరణతో సుపరిపాలన అందిస్తూనే విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేసి ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. విద్యాకానుక కింద పాఠశాలలు ప్రారంభమైన రోజే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్‌లు, బ్యాగ్, యూనిఫామ్‌లు, బూట్లు విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు మధ్యాహ్నం పౌష్టికాహారాన్ని అందిస్తూ చిక్కీని కూడా అందచేస్తున్నారు. విద్యాదీవెన పథకం ద్వారా ఎంత ఫీజు ఉంటే అంతా రీయింబర్స్ చేస్తుండగా వసతి దీవెన కింద వసతి ఖర్చులు చెల్లిస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ శిక్షణ ఇచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉన్నతోద్యోగాలు పొందేలా దోహదం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉండగా గత 58 నెలల్లో ఏకంగా 2.13 లక్షల ఉద్యోగాలను సీఎం జగన్ భర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స పరిధిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు నాడు–నేడు కింద ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి చేర్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలను చేరువ చేశారు. తీర ప్రాంతాల్లో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్నారు. సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవ స్థీకరణ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. సీఎం జగన్ సుపరిపాలన, సంస్కరణలతో సాకారమైన మార్పులు ప్రతి చోటా కళ్లకు కట్టినట్లు కన్పిస్తుంది. ఆ మార్పులు కొనసాగుతూ ఏపీ ప్రగతిపథంలో దూసుకెళ్లేలా పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేలా మేనిఫెస్టోను సీఎం జగన్ రూపొందిస్తారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ‘సూపర్ సిక్స్’ను పట్టించుకోని ప్రజలు.. జనసేన, బీజేపీ పొత్తు కుదరక ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో గతేడాది మే 28న ప్రకటించిన మిని మేనిఫెస్టోను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జనసేన, బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు పదే పదే చెబుతున్నా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. చెప్పిన మాటపై చంద్రబాబు నిలబడడు.. మోసం చేస్తాడనే భావన ప్రజల్లో బలీయంగా నాటుకుపోవడమే అందుకు కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో రైతు రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని, అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీలు ఇస్తూ తన ఫోటోతోపాటు పవన్, ప్రధాని మోదీ ఫోటోలు ముద్రించిన లేఖపై చంద్రబాబు సంతకం చేసి టీడీపీ కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటికీ పంపారు. వాటితో కలిపి 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అందులో 10 శాతం కూడా అమలు చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి జట్టు కట్టగా సూపర్ సిక్స్ అంటూ మిని మేనిఫెస్టోపై చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ విశ్వసించడం లేదు.