అమరావతి: రాష్ట్రంలో తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు, కొత్త సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘టైమ్స్ నౌ’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 51.10 శాతం ఓట్లను సాధించి 25కిగానూ 25 లోక్‌సభ స్థానాలనూ దక్కించుకోవడం ద్వారా వైయస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చింది. ఫ్యాన్ తుపాన్‌లో టీడీపీ, జనసేన, ఎన్డీయే, ఇతర పక్షాలు గల్లంతు కావడం ఖాయమని స్పష్టం చేసింది. అవినీతి కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో టీడీపీ 36.40 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు ఫలించలేదని, టీడీపీ ఒక్క లోక్‌సభ స్థానంలోనూ విజయం సాధించే అవకాశం లేదని.. ఒక ఎంపీ స్థానంలో మాత్రమే ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 10.1 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటుందని, ఒక్క లోక్‌సభ స్థానంలో కూడా కనీసం పోటీని ఇవ్వలేదని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో బీజేపీ 1.30 శాతం ఓట్లకు పరిమితం కాగా సీపీఐ, సీపీఎం సహా వామపక్షాలు 1.10 శాతం ఓట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది. అధికార పార్టీకి మరింత పెరిగిన ఆదరణ దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల అభిప్రాయంపై టైమ్స్ నౌ సంస్థ తాజాగా విస్తృతంగా సర్వే చేసింది. సర్వేకు సంబంధించిన ఫలితాలను సోమవారం రాత్రి టైమ్స్ నౌ చానల్ ప్రసారం చేసింది. విశ్లేషకులతో చర్చ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన వైయస్ఆర్‌సీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 24–25 ఎంపీ స్థానాల్లో విజయభేరీ మోగిస్తుందని సర్వేలో వెల్లడైందని వ్యాఖ్యాత పద్మజాజోషి వెల్లడించారు. గత 52 నెలలుగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వైయస్ఆర్‌సీపీకి ప్రజాదరణ మరింత పెరిగిందని విశ్లేషించారు. అందుకే అధికార పార్టీ 22 లోక్‌సభ స్థానాల నుంచి 25 ఎంపీ సీట్లలో క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని విజయం సాధించే స్థాయికి చేరుకుందని తెలిపారు.