కర్నూలు: కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన విజయవంతమైంది. ఈ గర్జనకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన సభ సోమవారం నిర్వహించారు. ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు రాయలసీమ గర్జన సభలో పాల్గొని వారి ప్రసంగాలతో స్ఫూర్తి నింపారు. కర్నూలు న్యాయ రాజధాని కోసం సీమ వాసులు గళం విప్పారు. శ్రీబాగ్ ఒప్పంద ప్రాకరం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాయలసీమ గర్జనకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హాఫీజ్‌ఖాన్, శిల్పా చక్రపాణిరెడ్డి, తొగూరు ఆర్థర్, ఎమ్మెల్సీ ఇక్బాల్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు హాజరై ప్రసంగించారు. మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర: మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు: మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదని ఆయన ధ్వజమెత్తారు. కర్నూలు గర్జన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం వైయస్ జగన్ ముందుకెళ్తున్నారని చెప్పారు. ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతివ్వాలని కోరారు. కర్నూలులో ఎన్నో సినిమాల షూటింగులు జరుగుతున్నాయని... సినీ పరిశ్రమకు, కర్నూలుకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. అందుకే కర్నూలులో హైకోర్టుకు సినీ పరిశ్రమ మద్దతును ఇవ్వాలని కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలపాలన్నారు. చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ: మంత్రి బుగ్గన చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మాకు రతనాల సీమ అని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందా? లేదా? అని మంత్రి నిలదీశారు. కర్నూలులో జరుగుతున్న రాయలసీమ గర్జన సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా చెప్పాలన్నారు. కరువు కారణంగా కాళేబరాలు కూడా పూడ్చిపెట్టిన ప్రాంతం రాయలసీమ అన్నారు. ఒక్క మగాడు సీఎం వైయస్ జగన్ హైకోర్టు కర్నూలుకు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. హంద్రీనీవాకు మొదట చంద్రబాబు రూ.13 కోట్లు ఇస్తే వైయస్ఆర్ రూ.4 వేల కోట్లు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రజలకు చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్ష అని..చంద్రబాబు, ఆయన బంధువులు అభివృద్ధి చెందాలనేది మాత్రమే టీడీపీ ఆకాంక్ష అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. మేధావులు అధ్యయనం చేసి వాళ్లు సూచించిన మేరకు సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ది చెప్పేందుకే ఈ రాయలసీమ గర్జన నిర్వహిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని, కుప్పాన్ని సీఎం వైయస్ జగన్ అన్ని విధాలా అభివృద్ది చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం వైయస్ జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. మూడు రాజధానులు తీసుకురావాలని సీఎం వైయస్ జగన్ పట్టుదలతో ఉన్నారని.. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం మాత్రమే కర్నూలులో హైకోర్టు తీసుకురాగలదన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కర్నూలులో నిర్వహించిన రాయలసీమ గర్జన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రం విడిపోకముందు మన రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే చేశారు. మన నాయకుడు సీఎం వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని తీసుకువచ్చారు. అందులో భాగంగానే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని మనం కోరుతున్నాం. అమరావతిలో కూడా రాజధాని ఉంటుందని, పరిపాలన రాజధాని విశాఖలో ఉంటుందని, ఆ విధంగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం వైయస్ జగన్ భావిస్తున్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు ఇవ్వడం సబబే. గతంలో ఇక్కడ ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మళ్లీ ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాల్సిందే. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా పరిగణించాలి. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారు. కర్నూలులో జరిగిన గర్జన చాలా గొప్పగా జరిగింది. ఈ ప్రభుత్వం మాత్రమే కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేయగలదు. చంద్రబాబు వస్తే మళ్లీ అమరావతిలోనే రాజధాని పెడతారు. ఆ ప్రాంతంపై కూడా చంద్రబాబుకు పూర్తి ప్రేమ లేదు. ఆయన బంధుగణం, మిత్రగణం, ఆ పార్టీ నాయకులు కొన్న వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు అక్కడ రాజధాని పెట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. చీపుర్లు, చెప్పులతో తరిమి తరిమి కొట్టండి: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పే టీడీపీ, జనసేన నాయకులు మీ గడప వద్దకు వస్తే ఆడవాళ్లు చీపుర్లు, మగవాళ్లు చెప్పులు పట్టుకొని తరిమి తరిమి కొట్టాలని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా పిలుపునిచ్చారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం వైయస్ జగన్ ముందకెళ్తున్నారని చెప్పారు. ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలులో నిర్వహించిన రాయలసీమ గర్జన కార్యక్రమంలో అంజాద్‌బాషా మాట్లాడారు. వికేంద్రీకరణకు మద్దతుగాఇవాళ కర్నూలు నగరంలో రాయలసీమ గర్జనకు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ వికేంద్రీకరణ, మూడుప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఆలోచనలో భాగంగా సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం. అనేక దశాబ్ధాలుగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఆనాడు పెద్దలందరూ కూర్చొని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రాజధాని ఇవ్వాలని, లేనిపక్షంలో ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు. అప్పటి ఒప్పందం మూలనపడితే..సీఎం వైయస్ జగన్ తెరపైకి తీసుకువచ్చారు. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయాలనే ఆలోచనతో సీఎం వైయస్ జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని, వైజాగ్‌లో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేయాలని మూడు ప్రాంతాలకు సమన్యాయంతో ముందుకు వెళ్తున్నారు. అన్యాయం జరిగిన ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రజలతో, టీడీపీ నాయకులతో ఒకే రాజధాని, ఒకే ప్రాంతం అభివృద్ధి అంటూ నినాదాలు చేయించడం, ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తూ అవహేళనగా మాట్లాడటం ఎంత వరకు న్యాయం. ఇది ఉద్యమం..ఉద్యమం ఆరంభమైంది. కచ్చితంగా జేఏసీకి మద్దతుగా నిలుస్తూ వైయస్‌ఆర్‌సీపీకి సపోర్టు చేస్తుంది. అందరం కలిసికట్టుగా కృషి చేస్తూ న్యాయ రాజధానిని సాధిద్ధామని పిలుపునిచ్చారు. 29 గ్రామాలు అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తుంటే..వైయస్ జగన్ 26 జిల్లాలు అభివృద్ధి చేయాలని అడుగులు ముందుకు వేస్తున్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వైయస్ జగన్ కృషి చేస్తున్నారు. మీరందరూ కూడా వైయస్ జగన్‌కు, ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని చెబుతున్న నాయకులు మీ గడపకు వస్తే ఏం చేస్తారు. మహిళలు చీపుర్లు పట్టుకోవాలి. మగవాళ్లు చెప్పులు పట్టుకుని తరిమితరిమి కొట్టాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిలుపునిచ్చారు. రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకే ఉంది: బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకే ఉందని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. కర్నూలు గర్జనలో బైరెడ్డి మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు భూములిచ్చిన అమరావతివారిది త్యాగమయితే...శ్రీశైలం ప్రాజెక్టు కోసం 55 వేల ఎకరాల భూములిచ్చిన మాది త్యాగం కాదా ? అని ప్రశ్నించారు. మా ప్రాంత అభివృద్ధి కోసం..మా ప్రాంతానికి గుర్తింపు కోసం రాజధానిని కోరుతున్నామని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులకు ఎంతో త్యాగం చేశారని గుర్తు చేశారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమ అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారని, అందరం సీఎం వైయస్ జగన్‌కు మద్దతుగా ఉందామని, కర్నూలుకు న్యాయ రాజధానిని సాధించుకుందామని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. సీమకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ : మంత్రి ఉషాశ్రీ చరణ్ రాయల సీమకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని మంత్రి ఉషశ్రీ చరణ్ కొనియాడారు. రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని మంత్రి విమర్శించారు. కర్నూలు గర్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా రాయలసీమ ప్రాంతానికి ఎవరూ చేయని పనిని సీఎం వైయస్ జగన్ చేశారని అన్నారు. అమరావతి ఏకైక రాజధానికి తాము ఒప్పుకునేది లేదన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేవరకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి తాము మోసపోయేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రతిపక్ష నేత చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ వైయస్ఆర్‌సీపీ పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శించారు. కర్నూలు లో తలపెట్టిన రాయలసీమ గర్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..చంద్రబాబులాంటి ప్రతిపక్షనేతలు ఉండటం దురదృష్టకరమన్నారు. వికెంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ఆమె కోరారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కచ్చితంగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.