సీఎం వైయ‌స్‌ జగన్‌ చొరవ.. 

నెరవేరిన 25 ఏళ్ల కల

ఎంపీడీవోలకు పాతికేళ్లకు ప్రమోషన్లు

ఒకేసారి 237 మందికి పదోన్నతి

12 మందికి డిప్యూటీ సీఈవోలుగా, డీఎల్‌డీవో హోదాలో 225 మంది  

మొత్తం ఎంపీడీవోల్లో మూడోవంతు మందికి పదోన్నతులు  

దశాబ్దాల సమస్య సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో పరిష్కారం

అమరావతి: ఉద్యోగంలో చేరిన దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎంపీడీవోలకు పదోన్నతులు లభించాయి. 12 మంది జెడ్పీ డిప్యూటీ సీఈవోలుగా, మరో 225 మంది డీఎల్‌డీవో స్థాయి హోదాలో ఒకేసారి 237 మంది ఎంపీడీవోలు గురువారం పదోన్నతుల పత్రాలను స్వీకరించారు. పదోన్నతులు పొందిన ఎంపీడీవోలలో నలుగురు జడ్పీ సీఈవో హోదాలో, మరో నలుగురు డీపీవోలుగా, 13 మంది డిప్యూటీ సీఈవోలుగా, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయంలో 11 మంది, మరో ఆరుగురు డీఆర్‌డీఏలలో నియమితులయ్యారు.
 
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం  ఏర్పాటు చేసిన డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులుగా (డీఎల్‌డీవో) 44 మంది నియమితులు కాగా 118 మందిని జిల్లాల్లోని డ్వామా కార్యాలయ పరిధిలో వివిధ హోదాల్లో నియమించారు. ఇతర శాఖలో 37 మందిని నియమించారు. రాష్ట్రంలో మొత్తం ఎంపీడీవోలలో మూడో వంతు మంది ఒకే విడతలో పదోన్నతులు పొందడంతో కిందిస్థాయిలో దాదాపు 1,000 మందికి పదోన్నతులు దక్కుతాయని పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగులలో హర్షం వ్యక్తమవుతోంది.

దీర్ఘకాల సమస్యకు పరిష్కారం 
పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీవోలు 312 మంది దాకా ఉండగా అందుకు అవకాశం ఉన్న పోస్టులు 13 మాత్రమే ఉండడంతో పాటు సీనియారిటీ  జాబితా తయారీలో వివాదాల కారణంగా పాతికేళ్లుగా ఎంపీడీవోలకు పదోన్నతుల అంశం అపరిష్కృతంగా మిగిలింది. మండలాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఎంపీడీవోల నియామకం, సర్వీసు రూల్స్‌పై విధివిధానాలు ఖరారు కాకపోవడంతో ఒకేసారి పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వాలు దీనిపై చొరవ చూపకపోవడంతో సమస్య మరుగున పడింది.

ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనిపై దృష్టి సారించి తొలుత ఐఏఎస్‌ అధికారులతో కమిటీని నియమించారు. అయితే ఇక్కడ కొలిక్కిరాకపోవడంతో సీఎం జగన్‌ ఈ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఈక్రమంలో వీలైనంత మంది ఎంపీడీవోలకు ఒకేసారి పదన్నోతులు కల్పించేందుకు ప్రత్యేకంగా 200 పోస్టులను గుర్తించారు. ఎంపీడీవోల పదోన్నతుల కోసమే పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో 51 డీఎల్‌డీవో పోస్టులు కొత్తగా మంజూరు చేస్తూ 2020లో ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి తోడు 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్‌ రూపంలో ప్రత్యేకంగా ఎంపీడీవోలకు మాత్రమే పదోన్నతులకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం 2022 జనవరి 17వ తేదీన మరో ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం వైయ‌స్ జగన్‌కు ధన్యవాదాలు
‘గత 25 ఏళ్లుగా ఎంపీడీవోలు ఒక్క పదోన్నతికి కూడా నోచుకోని కారణంగా పంచాయతీరాజ్‌ శాఖలోని 12 క్యాడర్లకు చెందిన వేలాది మంది ఉద్యోగులపై ఆ ప్రభావం పడింది. ఉద్యోగుల మనోవేదనను అర్ధం చేసుకొని రికార్డు సంఖ్యలో 237 మందికి ఒకేసారి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సీఎం జగన్‌కు ఎంపీడీవోల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ కోన శశిధర్, ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు  తెలియజేస్తున్నాం’ 
–వై.బ్రహ్మయ్య (ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు), జీవీ నారాయణరెడ్డి (ప్రధాన కార్యదర్శి), కె.శ్రీనివాసరెడ్డి (ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌), డి.వెంకట్రావు (గౌరవాధ్యక్షుడు), కెఎన్‌వీ ప్రసాదరావు( కన్వీనర్‌), జీవీ సూర్యనారాయణ,ప్రతాప్‌రెడ్డి (ఉపాధ్యక్షుడు) 

Back to Top