అమరావతి: ఇప్పుడు దేశమంతా ఒకే పాట పాడుతోంది. అది రైతుపాట. పల్లెల్ని పలకరించాలని తహతహలాడిపోతోంది. పల్లెగొప్పదనం ఇప్పుడే తెలిసినట్టుగా పాలకులు మాట్లాడుతున్నారు. పదిహేను, పదహారు సంవత్సరాల క్రితమే వైయస్సార్ రైతు గురించి ఆలోచించారు. వారిలో ఒకరిగా కలిసిపోయి వారి బాధలు విన్నారు. చూశారు. రైతు రాజ్యంలోనే సమాజాభివృద్ధి వుంటుందని గట్టిగా తలపోశారు. తాను విశాలాంధ్రకు ముఖ్యమంత్రి కాగానే ఆ దిశలోనే అడుగులు వేశారు. నాడు రాజశేఖరుడంటే రైతు గురించి ఆలోచించే నాయకుడు. రైతుల సంక్షేమం గురించి నిరంతరం తాపత్రయపడే ప్రజానాయకుడు. రైతుప్రపంచంలో వైయస్సార్ చేపట్టిన పథకాలను అప్పుడు దేశమంతా శ్లాఘించింది. అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. కానీ ఆచరణలో మాత్రం వైయస్సార్ దరిదాపుల్లోకి ఎవరూ రాలేకపోయారు. రైతుతో వైయస్సార్‌ది విడదీయరానిబంధం. వైయస్సార్ పుట్టినరోజు జులై 8 న ఆంధ్రప్రదేశ్ రైతుదినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. కేవలం పండుగరోజు ప్రకటించి, ఆర్భాటాలు చేయదలచుకోలేదు. రైతుల సంక్షేమం కోసం నవరత్న పథకాల్లో ఎంతో ప్రాధాన్యత నిచ్చింది. అందులో భాగంగా ఈ మొదటి పండుగరోజున రైతింట కన్నీటికి తావు లేకుండా చేయాలన్న చేయాలన్న తపనతో వైయస్సార్ ప్రమాదభీమాను అమలులోకి తెచ్చింది. రైతులకు సున్నావడ్డీకే రుణాలు మొదలయ్యాయి. వీటితో పాటు రైతు సంక్షేమం కోసం వైయస్ తలపెట్టిన ప్రతి పథకాన్ని పూర్తి చేస్తానని ప్రతిన పట్టింది. వైయస్సార్ తనయుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి పల్లెల ప్రగతికోసం, రైతు సంక్షేమం కోసం ...కేవలం నెలరోజుల్లోనే చేపట్టిన కార్యక్రమాలు ఇప్పుడు పల్లెలకు పెద్ద వెన్నుదన్ను. అంతే కాదు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న ముఖ్యమంత్రి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఒక దీక్షలా పని చేసుకుపోతారనడంలో సందేహం లేదు. ఇక రైతులకు అన్నీ మంచి రోజులే. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న వైయస్సార్ కలను, తనయుడు జగన్ సాకారం చేస్తారని పల్లెపల్లె పరవశించుపోతున్న ఈ శుభవేళ...జయహో రైతన్న అని సగర్వంగా చాటుదాం.