కొత్త జిల్లాలు..ఊరూవాడల్లో సంబరాలు

సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతలు

మ‌హానేత విగ్ర‌హాల‌కు పాలాభిషేకాలు

అమ‌రావ‌తి: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలు రెట్టింపు అవడంపై రాష్ట్ర‌వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుచేస్తూ సీఎం వైయ‌స్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో ఊరూవాడ‌ల్లో సంబరాలు చేసుకుంటున్నారు. వాడవాడలా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. దశాబ్దాల కల నెరవేరినందుకు ప్రజలు సీఎం వైయ‌స్‌ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. 

► విశాఖపట్నం జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడంతో కొత్త జిల్లాలైన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్త పాలనా యంత్రాంగం కొలువుదీరింది. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.   ఏజెన్సీలోని మండలాల్ని కలుపుతూ పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటుచేయడంతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో హుషారుగా ప్రదర్శనలు నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు.

► శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా పలాస రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై ఇచ్ఛాపురంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఆ నియోజకవర్గ వైయ‌స్సార్‌సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌లు  ర్యాలీ నిర్వహించి సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించాయి.  

► ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలు ఏర్పాటుతో ప్రజలు కేరింతలు కొట్టారు. పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న కోనసీమ జిల్లా కల నెరవేరడంతో కోనసీమ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాల భవనాలు అందంగా అలంకరించారు. జాతీయ జెండాలు ఎగరవేశారు. మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక కాకినాడ జిల్లా కేంద్రం ఆవిష్కరణ సందర్భంగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా బొమ్మూరులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నిడదవోలు నుంచి గోదావరి వంతెన మీదుగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌ వరకు మోటర్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. 

► పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో నూతన జిల్లా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ నిర్వహించారు. తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నేతృత్వంలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎలీజా, దూలం నాగేశ్వరరావు, మేకా ప్రతాప్‌ అప్పారావు, ఏలూరు మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పాల్గొన్నారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.   

► ఉమ్మడి కృష్ణా జిల్లాను కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలుగా మార్చడంతో మచిలీపట్నం, విజయవాడ కలెక్టరేట్‌లలో సందడి వాతావరణం జరిగింది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడిన కృష్ణాజిల్లాకు కలెక్టర్‌గా రంజిత్‌ బాషా, విజయవాడ కేంద్రంగా ఏర్పడిన ఎన్టీఆర్‌ జిల్లాకు కలెక్టర్‌గా ఢిల్లీరావు బాధ్యతలు స్వీకరించారు. పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ భారీ ర్యాలీలు జరిగాయి. విజయవాడ ఈస్ట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ సీఎం జగన్‌ చిత్రపటానికి పూలతో అభిషేకం చేశారు. 

► ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీగా సభలు నిర్వహించారు. గుంటూరు లాడ్జి సెంటర్‌ నుంచి శంకర్‌ విలాస్‌ వరకు అభినందన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్‌ ముస్తఫా, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, మిర్చి యార్డ్‌ చైర్మన్‌ ఏసురత్నం, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. 

► ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం సోమవారం జనసంద్రమైంది. కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుచేయడంతో పెద్దఎత్తున సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్‌ నినాదాలతో పట్టణమంతా మార్మోగింది. ఒంగోలు పట్టణంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 

► సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి వెంకటాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, పార్టీ శ్రేణుల నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. సీఎం చిత్రపటానికి కాకాణి క్షీరాభిషేకం చేశారు.  

► ఉమ్మడి వైయ‌స్సార్‌ కడప జిల్లాలో అన్నమయ్య జిల్లా ఆవిర్భావం సందర్భంగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో సోమవారం సంబరాలు మిన్నంటాయి. ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల వేషధారణలు, బాణాసంచా, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, కీలు గుర్రాలతో ర్యాలీ హోరెత్తింది. గడికోట, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియాఖానమ్, కలెక్టర్‌ గిరీషా, జేసీ తమీమ్‌ అన్సారియా, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజులు ఊరేగింపుగా పాల్గొన్నారు. పెద్దఎత్తున అన్నదానం చేశారు.  

► గత పాలకులు సాధించలేనిది మూడేళ్లలో జగనన్న సాయంతో సాధించామని తిరుపతి జిల్లాలో ఏర్పాటైన శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. శ్రీకాళహస్తి ప్రజల కల నెరవేరిందన్నారు. అంతకుముందు.. పార్టీ మహిళా నేత బియ్యపు పవిత్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ‘థ్యాంక్యూ సీఎం సర్‌’ అంటూ ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. 

► ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. నూతన జిల్లా ప్రారంభోత్సవంలో మంత్రి శంకరనారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పీవీ సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్‌ బసంత్‌కుమార్, ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు, బాబా భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం సార్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పుట్టపర్తి వీధులన్నీ సందడిగా మారాయి. మడకశిర, కదిరిలోనూ సంబరాలు చేసుకున్నారు.  

► నంద్యాల జిల్లా ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్, ప్రభుత్వ విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు ఇసాక్‌బాషా, భగీరథరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తొగురు ఆర్థర్, గంగుల బిజేంద్రనాథరెడ్డి, ఎస్పీ రఘువీరారెడ్డి, జేసీ నారపురెడ్డి మౌర్య తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top