అంద‌రి నోటా ఒక్క‌టే మాట‌..ఏపీ నీడ్స్ జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలలో గెలుపు ఎవరిదో మరోసారి స్పష్టం అయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని తేలిపోయింది. టైమ్స్ నౌ తాజా సర్వే ప్రకారం దాదాపు మొత్తం లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీకి రానున్నాయి. ఏపీలో 25 లోక్ సభ సీట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇవి మొత్తం కాని, లేదా ఒక సీటు తక్కువగా కాని వైసీపీ గెలుచుకుంటుందని ఆ సర్వే వెల్లడించిందంటే రాజకీయ పరిస్థితి ఎంత క్లియర్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సంగతిని గమనించే ఎల్లో మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి ,టివి-5 వంటివి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పైన, వైసీపీ ప్రభుత్వంపైన దాడిని తీవ్రతరం చేశాయి. తాము ఎన్ని వ్యతిరేక కధనాలు సృష్టిస్తున్నా ప్రజలలో మార్పు రావడం లేదన్నదే వారి ఏడుపు. 

✍️టైమ్స్ నౌ సర్వే పై ఇక అబద్దపు ప్రచారం చేస్తారు. ఇంతకుముందు కూడా పలు సర్వేలు కూడా వైసీపీకి అనుకూలంగానే వచ్చాయి. వాటన్నిటిని వక్రీకరించే యత్నం చేశారు. విపక్ష తెలుగుదేశం, జనసేన వంటివి చేశాయి అంటే అర్దం చేసుకోవచ్చు. వారికి రాజకీయంగా నష్టం కలుగుతుందని వారు ఆందోళన చెందుతారు. కాని ఈనాడు తదితర మీడియా సంస్థలు మరీ ఎక్కువగా గగ్గోలు పెడుతుంటాయి.కొంతకాలం క్రితం ఇండియా టివి ఏపీకి సంబంధించి సర్వే చేయకపోయినా, ఏదో కాకతాళీయంగా పదిహేను సీట్లు, టీడీపీ అన్న పదాలు వాడింది తడవుగా ఎల్లో మీడియా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రెచ్చిపోయి మాట్లాడారు. ఇంకేముంది అధికారం వచ్చేసిందన్నంత చందంగా సంబర పడ్డారు. తాజాగా వచ్చిన సర్వేతో వారికి మతి పోయి ఉండాలి. అందుకే ఈనాడు, జ్యోతి వంటి మీడియా ఈ వార్తను అసలు కవర్ చేసినట్లే కనిపించలేదు.

✍️కేంద్రంలో మళ్లీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని కూడా ఈ సర్వే చెప్పింది. టైమ్స్ నౌ సర్వే కి కొంత విలువ ఉంటుంది. దానికి కారణం ఆ సర్వే లు చాలావరకు వాస్తవం అని నిరూపితం అయ్యాయి కనుక. ఉదాహరణకు టైమ్స్ నౌ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ కు 41 స్థానాలు వస్తాయని లెక్కగట్టింది. ఆ పార్టీకి 39 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కు 65 స్థానాలు రావచ్చని చెబితే 64 వచ్చాయి. రాజస్తాన్ లో భారతీయ జనతా పార్టీకి  114 నుంచి 124 వరకు సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే వెల్లడిస్తే 115 సీట్లతో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు 68-78 సీట్లు వస్తాయని చెబితే 69 వచ్చాయి. అంతేకాదు 2019 లో వైసీపీకి 20 లోక్ సభ సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే తెలిపితే, 22 సీట్లను సాధించింది. అంటే ఈ సంస్థ శాస్త్రీయ పద్దతులలో , క్షేత్ర స్థాయిలో జాగ్రత్తగా సర్వేలు చేస్తోందని అనుకోవాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని ఈ సర్వే చెబుతోంది.

✍️ఓట్ల శాతం చూస్తే వైసీపీకి యధాప్రకారం 50 ఓట్లు వస్తాయని, టీడీపీకి ముప్పైఏడు శాతం , జనసేనకు పది శాతం ఓట్లు వస్తాయని అభిప్రాయపడింది. అంటే గత శాసనసభ ఎన్నికలలో కంటే టీడీపీకి ఓట్ల శాతం తగ్గుతుందని తేలింది. జనసేనకు కొద్దిగా పెరిగినా అవి అంతగా ఉపయోగపడడం లేదు. చంద్రబాబు కుమారుడు లోకేష్ నాయకత్వ సమర్ధతపై జనంలో అనుమానాలు ఉన్నాయని కూడా ఈ సర్వే నిర్వాహకులు వ్యాఖ్యానించడం విశేషం. లోక్ సభ సీట్లు ఈ స్థాయిలో వస్తాయని తేలిందంటే, అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని అర్ధం అవుతుంది.ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ అంతకుముందు ఎన్నికలలో తెచ్చుకున్న ఓట్ల శాతాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని అంటే, ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని అర్దం అన్నమాట.జగన్ నిత్యం చెబుతన్నట్లు 175కి 175 అన్న చందంగానే పరిస్థితి ఉందని లోక్ సభ ఎన్నికల సర్వే చెబుతోందని అనుకోవచ్చు.  

✍️శాసనసభ ఎన్నికలలో పరిస్థితి ఇంచుమించుగా అలాగే  ఉండవచ్చు.  జగన్ అధికారంలోకి  రావడం పక్కా అన్నమాట. దీనికి  జగన్ సమర్ధ నాయకత్వం కారణమని వేరే చెప్పనవసరం లేదు. తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా ప్రజలలో చెబితే చేస్తాడు అన్న భావన తెచ్చుకోగలిగారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ,అభివృద్ది  కార్యక్రమాలు, పాలనా సంస్కరణలు వంటివి చేపట్టడం కూడా ఈ సానుకూలతకు కారణం అని చెప్పాలి.ఎక్కడైనా ఎమ్మెల్యేలపై కొంత అసంతృప్తి ఉంటే ఉండవచ్చు కాని, దాదాపు అన్ని చోట్ల ముఖ్యమంత్రి జగన్ పై పాజిటివ్ అభిప్రాయం ఉండడం విశేషం. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేలతో పాటు ఆయన తీరుపై కూడా నెగిటివ్ ఏర్పడింది. రుణమాఫీ మొదలు 400 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోగా మాట మార్చారన్న భావన ఏర్పడడంతో అప్పట్లో టీడీపీని 23 శాసనసభ  సీట్లకే పరిమితం చేశారు.

✍️ఆయా సందర్భాలలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలలో అసహనానికి దారితీశాయి. జగన్ విషయంలో అలా కాదు. ఆయన ఎక్కడా హామీలు నెరవేర్చడం లో వెనక్కి తగ్గడం లేదు. బహిరంగ సభలలో తప్ప అదేపనిగా ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. విపక్షాల విమర్శలన్నిటికి ఆ సభలలోనే సమాధానం ఇస్తున్నారు. తన టూర్లలో ప్రజలను కలుస్తున్నారు. ఎవరైనా తమ బాధలు చెప్పుకుంటే విని వాటికి అప్పటికప్పుడే పరిష్కారం చూస్తున్నారు. అంతేకాక పేదలు, బలహీనవర్గాల పట్ల ఇంతగా శ్రద్ద చూపిన ప్రభుత్వం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అందువల్లే ధైర్యంగా సామాజిక సాధికార యాత్రల పేరుతో బస్ యాత్రలు చేయించి ఆ వర్గాలలో తనకు ఎంత బలం ఉందో తెలియచేయగలుగుతున్నారు.

✍️ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పూర్తిగా జగన్‌ను సొంతం చేసుకున్నాయి. అందుకే దానిని ఎలా చెడగొట్టాలా అని ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఆ వర్గాలకు ఏదో అన్యాయం జరుగుతోందంటూ తప్పుడు ప్రచారానికి దిగుతోంది. అయినా జనం నమ్మడం లేదు. మరో వైపు అసెంబ్లీ నియోజకవర్గాలలో అవసరమైన మార్పులు, చేర్పులు చేపడుతూ రాజకీయ వ్యూహాలలో దూసుకుపోతున్నారు.  ఒకవేళ చంద్రబాబు మాదిరి జగన్ కూడా తాను ఇచ్చిన నవరత్నాల హామీలు చేయకుండా ఉన్నట్లయితే ,ఎప్పుడో అన్ పాపులర్ అయి ఉండేవారు. ఆయన ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి నెలకొనేది. అప్పుడు ఎల్లోమీడియా ఏమి రాసినా నమ్మేపరిస్థితి ఉండేది. అలా  కాకుండా ముఖ్యమంత్రి  చెప్పింది చేశారు అన్న పేరు తెచ్చుకొని బలహీనవర్గాలలో బలమైన ముద్ర వేసుకోగలిగారు. పలు చోట్ల ఎమ్మెల్యేల గ్రాఫ్ కన్నా జగన్ గ్రాఫ్ చాలా ఎక్కువగా ఉందన్నది కూడా వాస్తవం.

✍️అమ్మ ఒడి, చేయూత, వృద్దుల పెన్షన్ లు పెంచడం, ఇళ్ల వద్దే అందించడం, చేయూత, కాపు నేస్తం, చేనేత నేస్తం...ఇలా అనేక స్కీములను అమలు చేసిన ఘనత జగన్‌ది. వాటికి తోడు వలంటీర్లు, గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఇంటికే డాక్టర్ లను పంపడం, తాజాగా 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింప చేయడం తదితర అనేక స్కీములను అమలు చేస్తున్న ఘనత ఆయనది. అభివృద్ది విషయానికి వస్తే తీరప్రాంతంలో నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, పారిశ్రామిక కారిడార్లు మొదలైనవాటిని అభివృద్ది చేస్తున్నారు. పలాస వద్ద కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తో పాటు 700 కోట్లతో పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల గ్రామలకు సురక్షిత నీరు ఇచ్చిన ఘనత కూడా జగన్ సొంతం. ఇన్నిరకాలుగా ప్రజల తరపున ఆయన పని చేస్తున్నారే కనుకే, ఏమి చేయాలో దిక్కుతోచక తెలుగుదేశం పార్టీ ఎవరితోపొత్తు పెట్టుకోవాలా అని తంటాలు పడుతోంది. చివరికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పొత్తు పెట్టుకున్నా లాభం లేదని ఈ సర్వే తేల్చేసిందని అనుకోవాలి. దీనిని బట్టే జనం కూడా ఏపీ నీడ్స్ జగన్ అని అంటున్నారన్న విషయం అర్ధం అవుతుంది.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Back to Top