కోడెల కుట్ర బ‌ట్ట‌బ‌య‌లు

ఆయనే చొక్కా చించుకుని డ్రామా ఆడారు
 
కోడెల అరాచకాలను ఏకరువు పెట్టిన గ్రామస్తులు

రెండు గంటలపాటు పోలింగ్‌ నిలిపేశారు

పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు రావాలని కోరడంతో హైడ్రామా

ఆయనపై ఎవరూ దాడి చేయలేదు

గుంటూరు: పోలింగ్‌ రోజున ఓట్లు వేయనివ్వకుండా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామస్తులు తెలిపారు. మంగళవారం సత్తెనపల్లి వచ్చిన వైయ‌స్ఆర్‌ సీపీ నిజ నిర్థారణ కమిటీకి ఆరోజు చోటుచేసుకున్న ఘటనలను వివరించారు. ఈనెల 11న గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో ప్రశాంతంగా పోలింగ్‌ సాగుతోందని, ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు ఇనిమెట్ల గ్రామంలోని 160వ పోలింగ్‌ బూత్‌లోకి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రవేశించారని చెప్పారు. పోలింగ్‌ సరళి పరిశీలించి ఫోన్‌ మాట్లాడిన ఆయన, తిరిగి బూత్‌లోకి వచ్చి కూర్చుని ఏజెంట్లను బయటకు వెళ్లమని బెదిరించారని వివరించారు. ఆయనతో పాటు నరసరావుపేట, రాజుపాలేనికి చెందిన టీడీపీ నాయకులు కూడా బూత్‌లోకి ప్రవేశించగా.. గన్‌మెన్లు తలుపులు వేసేశారన్నారు. పోలింగ్‌ అధికారులపై కోడెల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉరిమి చూశారన్నారు. ఎంతసేపు బ్రతిమలాడినా ఆయన బయటకు రాలేదన్నారు.

రిగ్గింగ్‌ అవుతోందని నినాదాలు చేశాం
ఏజెంట్లను బయటకు పంపడం, పోలింగ్‌ బూత్‌ తలుపులు వేయడంతో లోపల రిగ్గింగ్‌ జరుగుతోందని భావించి నినాదాలు చేశామని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు లోపలకు వెళ్లి కోడెలను బ్రతిమలాడినా రాకుండా తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ లోపలే ఉన్నారన్నారు. సుమారు గంటసేపు బూత్‌లోనే బైఠాయించారని, చివరకు పోలీసులు బలవంతంగా ఆయనను బయటకు తీసుకొచ్చారని వివరించారు. ఆయన చొక్కా ఎవరూ చింపలేదని, ఆయనే చించుకుని.. దిగువ గుండీని పైకి పెట్టుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేశారన్నారు. సుమారు 2 గంటలపాటు ఎండలో నిలబడిన గ్రామస్తులు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని, పథకం ప్రకారం ఏదీ జరగలేదని చెప్పారు. పోలింగ్‌ బూత్‌లోని సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెంట్లు, గ్రామస్తులు ఏమన్నారంటే..

భయబ్రాంతులకు గురిచేశారు
స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు 160వ పోలింగ్‌ బూత్‌లోకి వచ్చి బయటకు వెళ్లకుండా బైఠాయించారు. గన్‌మెన్లు తలుపులు వేశారు. బ్రతిమాలినా వెళ్లలేదు. ఏజెంట్లను, పోలింగ్‌ అధికారులను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో లోపల కోడెల రిగ్గింగ్‌ చేస్తున్నారని, బాంబులు తెచ్చి ఉంటారని భావించిన గ్రామస్తులు కోడెల డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.
– ఆంజనేయులు, బూత్‌ ఏజెంట్, ఇనిమెట్ల

ఆయన తీరువల్లే ఆందోళన
పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతుండగా ఒక్కసారిగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్‌ సరళి తెలుసుకుని వెళ్లాల్సిన ఆయన ఎవరికి ఓట్లు వేస్తున్నారో చూస్తానంటూ కోపంగా మాట్లాడారు. ఏజెంట్లను భయపెట్టారు. బయటకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. ప్రశ్నించిన పోలింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
– మస్తాన్‌వలి, ఏజెంట్, ఇనిమెట్ల

చేజర్లలో దాడులకు పాల్పడ్డారు
ఓటమి పాలవుతామని టీడీపీ వాళ్లకు ఎన్నికల రోజు తెలిసింది. పోటెత్తుతున్న ఓటర్లను చూసి తట్టుకోలేక గొడవలు సృష్టించారు. నకరికల్లు మండలం చేజర్లలో ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. వారిపై పోలీసులు నిష్పక్షపాతంగా కేసులు నమోదు చేయాలి.
– భవనం రాఘవరెడ్డి, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు, నకరికల్లు

రౌడీషీటర్లకు పోలింగ్‌ బూత్‌లో పనేంటి?
ఇనిమెట్ల 160వ పోలింగ్‌ బూత్‌లోకి కోడెలతోపాటు నరసరావుపేటకు చెందిన రౌడీషీటర్లు, రాజుపాలెంకు చెందిన టీడీపీ నాయకులు వెళ్లారు. రౌడీషీటర్లకు పోలింగ్‌ బూత్‌లో పనేంటి? కోడెలకు నేరచరిత్ర ఉంది. గతంలో రిగ్గింగ్‌లకు పాల్పడ్డారు. తమ ఓట్లు రిగ్గింగ్‌ చేస్తున్నారని గ్రామస్తులు భయపడ్డారు. కోడెల పోలింగ్‌ అధికారిని దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఓట్లు దొంగిలించడం ఏంటని మహిళలు ప్రశ్నించారు. ఆయనకు ఆయనే దుస్తులు చించుకుని హైడ్రామా జరిపారు. రెండు గంటలపాటు పోలింగ్‌ నిలిచిపోయింది. ఎస్పీ వచ్చి హామీ ఇవ్వడంతో పోలింగ్‌ జరిగింది.
–వేపూరి శ్రీనివాసరావు,వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు, రాజుపాలెం  

Back to Top