మా పవనన్ననే ప్రశ్నిస్తావా?.. 

33 వేల మంది మహిళల అదృశ్యం ఎక్కడంటూ పవన్‌ను ప్రశ్నించడమే నేరం

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై జనసేన శ్రేణుల దాడి 

పవన్‌ కళ్యాణ్‌నే విమర్శిస్తావా అంటూ ఇంట్లో బీభత్సం

50 మందికి పైగా దాడిచేసి ఇల్లు ధ్వంసం.. తిరిగి బాధితుడిపైనే ఫిర్యాదు

పోలీసుల సమక్షంలోనే బలవంతంగా క్షమాపణలు చెప్పించిన వైనం 

దాడికి పాల్పడ్డ వారికి కొమ్ముకాస్తే పరిణామాలు తీవ్రం..

డీఎస్పీకి వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హెచ్చరిక

మచిలీపట్నం: సుగాలి ప్రీతి ఉదంతం.. 33వేల మందికి పైగా మహిళలు అదృశ్యం తదితర అంశాలపై గతంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త ఒకరు ఓ మీడియా ఛానెల్‌లో విమర్శించినందుకు జనసేన మూకలు అతనిపై దాడి చేయడమేకాక అతని దుకాణాన్ని ధ్వంసం చేసిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. పైగా అతనిని మోకాళ్లపై కూర్చోబెట్టి బలవంతంగా క్షమా­పణలు చెప్పించి, అతనిపైనే ఫిర్యాదు చేశారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన వివరాలివీ.. 

బందరు మండలం మంగినపూడి గ్రామానికి చెందిన గిరి వైయ‌స్ఆర్‌సీపీలో క్రీయాశీల కార్యకర్త. ఇటీవల ఆయన ఓ మీడియా చానెల్‌లో మాట్లాడుతూ.. సుగాలి ప్రీతి ఘటన జరిగింది ఎప్పుడు.. ఆ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరో పవన్‌కళ్యాణ్‌ తెలుసుకోవాలంటూ విమర్శలు చేశారు. నిజానికి అది టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని.. కానీ, బాధిత కుటుంబానికి న్యాయం చేసింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, మహిళల అదృ­శ్యంపై డిప్యూటీ సీఎం హోదాలో ఏం చేశారని ప్రశి్నస్తూ పవన్‌ విధానాలను ప్రశి్నంచారు.

ఈ వీడియో వైరల్‌ అవడంతో జనసేన నాయకుడు కొరియర్‌ శ్రీనుతోపాటు దాదాపు యాభై మందికి పైగా గురువారం రాత్రి 10.30 ప్రాంతంలో గిరి ఇంటిపై మూకుమ్మడిగా దాడిచేశారు. ఇంట్లోని వస్తువులతో పాటు అతని దుకాణాన్ని ధ్వంసం చేశారు. అతనిపైనా విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. అంతేగాక.. గిరిని మోకాలిపై కూర్చోబెట్టి జనసేన నాయకులకు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. అలాగే, దెబ్బలు తిన్న గిరిపైనే బందరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి కేసు పెట్టించేందుకు బరితెగించారు.  

జనసేన నేతలపై పేర్ని నాని మండిపాటు.. 
ఈ విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి పేర్ని నాని జనసేన నాయకులపై మండిపడ్డారు. అకారణంగా, అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించాలని చూసినా.. దాడికి పాల్పడిన జనసేన నాయకులకు పోలీసులు కొమ్ముకాయాలని చూసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బందరు డీఎస్పీ సీహెచ్‌ రాజాను కలిసి హెచ్చరించారు.

తమ పార్టీ కార్యకర్తకు న్యాయం జరగకుంటే ఎంత దూరమైనా వెళ్తానన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్‌ సీఐ ఏసుబాబు, ఎస్‌ఐ సత్యనారాయణ మంగినపూడి గ్రామానికి చేరుకుని వివరాలు నమోదుచేసుకున్నారు. మరోవైపు.. డీఎస్పీ కార్యాలయానికి పేర్ని నాని వచ్చారని తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు.   

Back to Top