విద్యా వ్య‌వస్థ‌లో పెను విప్ల‌వం..జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌

నేడు జగనన్న విద్యా దీవెన రెండో విడ‌త 

ఈ ఏడాది రెండో విడతగా రూ.693.81 కోట్ల చెల్లింపు

దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

 అమరావతి: కోవిడ్‌–19 ఆర్థిక కష్టాల్లోనూ చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో,  బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు.

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తూ ఇప్పటి వరకు రూ.26,677.82 కోట్లు వెచ్చించింది. తద్వారా 1,62,75,373 మందికి లబ్ధి కలిగింది. దీనికి తోడు నాడు–నేడు పథకం కింద ప్రీప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్‌వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా ఏటా మరో రూ.1,800 కోట్ల వ్యయం చేస్తోంది.

అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,774.60 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ.4,207.85 కోట్లు జమ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటి విడతగా రూ.671.45 కోట్లు అందజేసింది. నేడు రెండో విడతగా దాదాపు రూ.693.81 కోట్లు ఇస్తోంది. మొత్తంగా రూ.5,573.11 కోట్లు. కాగా, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కొరకు ఇస్తోంది.  

Back to Top