నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే మీ ముందుకు..

మా బతుకులు మారాయి 
మాది వ్యవసాయ కుటుంబం. కర్నూలు జిల్లా ఆలూరులో మాకున్న మూడెకరాల భూమిలో మా ఆయన జ్ఞాన చంద్రబాబు రాజ్‌ వ్యవసాయం చేస్తుంటారు. వర్షాధారం కావడంతో కరువు వస్తే ఆదాయం రాకపోగా పెట్టుబడులు కూడా కోల్పోవాల్సి వచ్చేది. దానివల్ల చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడేవాళ్లం. మా అబ్బాయి హర్షవర్ధన్‌ 8వ తరగతి, సాయిసుప్రజ ఇంటర్‌ చదువుతోంది. మేం పడే బాధలు పిల్లల పడకూడదని చాలీచాలని ఆదాయంతోనైనా ఇద్దరినీ కష్టపడి చదివిస్తున్నాం.

నేను గృహిణిగా ఉంటూ, తీరిక సమయాల్లో ఇంట్లోనే టైలరింగ్‌ చేస్తుంటాను. తద్వారా కుటుంబానికి ఆసరాగా నిలిచాను. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు వైఎస్సార్‌ ఆసరా పథకం కింద ఇప్పటివరకూ రూ. 12,500లు వచ్చిది. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున నా ఖాతాలో జమయ్యాయి. వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఏటా రూ. 13,500 వస్తోంది. వీటిద్వారా మా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయాయి.

టైలరింగ్‌లో మరో మెట్టు ఎదిగేందుకు రూ. 1.50లక్షల డ్వాక్రా రుణం, రూ. 6.50లక్షల బ్యాంకు రుణం తీసుకుని మగ్గం, ఎంబ్రాయిడర్‌ మెషిన్‌ కొనుగోలు చేశాను. సరికొత్త డిజైన్లతో గౌన్లు, డ్రస్సులు, జాకెట్లు, చీరలకు ఫాల్స్‌ వంటివి చేస్తున్నా. బంధువులు, స్నేహితులు నా పనికి మెచ్చుకుని, ప్రోత్సహిస్తున్నారు. మా అత్తగారు రామలక్ష్మి సహకారం అందిస్తున్నారు. నా ఆదాయం నెలకు 6 నుంచి 7 వేల రూపాయలకు పెరిగింది. నెల నెలా వస్తున్న ఆదాయంతో బ్యాంకు రుణం కూడా తీరుస్తున్నారు. ఇప్పుడు మేము హాయిగా జీవిస్తున్నాం. – కుమ్మర రమాదేవి, ఆలూరు, కర్నూలు జిల్లా 

నిరుపేదకు ప్రాణభిక్ష పెట్టారు 
నేను పేద రైతును. బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం గ్రామంలో ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకు బండి లాగుతున్నాను. నాలుగు నెలల క్రితం నాకు గుండె బరువుగా ఉండడం, తిమ్మిర్లు, నొప్పిగా అనిపించింది. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీని సంప్రదించగా ఆయన గుంటూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. అక్కడ వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి బైపాస్‌ సర్జరీ చేయాలన్నారు. రెండు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అసలే పేద కుటుంబం కావడంతో అంత మొత్తం భరించలేమని చెప్పాం.

అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మాకు శ్రీరామరక్షగా నిలిచింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేసి వైద్యులు నాకు పునర్జన్మ ప్రసాదించారు. ఆరోగ్యశ్రీ నన్ను బతికించింది. ఆపరేషన్‌ అనంతరం ఆరోగ్య ఆసరాగా రూ. 5 వేలు నా ఖాతాలో వేశారు. వృద్ధాప్య పింఛను కూడా మా వలంటీర్‌ క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటోతేదీ వేకువజామునే ఇంటి వద్దకు వచ్చి ఇస్తున్నారు. రైతు భరోసా సొమ్ము కూడా అందుతుండడంతో సాగుకు అప్పు చేయాల్సిన దుస్థితి తప్పింది. నా మనవరాలికి కూడా మూడేళ్లుగా అమ్మ ఒడి వస్తుండడంతో వారి చదువులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతోంది. నాలాంటి పేదవారికి ప్రభుత్వ పథకాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి.  – కంచర్ల హరిబాబు, కొప్పరపాలెం, బల్లికురవ 

కాళ్లు కదపకుండా ఇంటివద్దే వ్యాపారం 
మా కుటుంబమంతా పూర్వకాలం నుంచి సైకిల్‌పై బట్టల మూటలు పెట్టుకుని గ్రామాల్లో విక్రయిస్తూ జీవనం సాగించేది. మా ఆయన కూడా ఆ వృత్తినే కొనసాగించారు. నాలుగేళ్లుగా మా ఆయన వయసు రీత్యా గ్రామాల్లో తిరిగేందుకు ఆరోగ్యం సహకరించక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. మాకు బట్టల వ్యాపారం తప్ప మరే పనీ చేత కాకపోవడంతో ఎలా బతకాలా అని మదనపడ్డాం.

ఇంతలో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక వైఎస్సార్‌ ఆసరా (డ్వాక్రా రుణమాఫీ) కింద రూ. 13వేల వంతున మూడేళ్లకు రూ. 39వేలు, వైఎస్సార్‌ చేయూత కింద ఏడాదికి రూ. 18,750లు వంతున మూడేళ్లకు రూ. 56,250లు అందింది. ఆ మొత్తంతో ఇంటివద్దే రెండేళ్లక్రితం బట్టల దుకాణం పెట్టుకున్నాం. జగనన్నతోడు పథకంలో ఏడాదికి పదివేల చొప్పన రూ.30 వేలు వచ్చిది. దానిని కూడా వ్యాపారానికి పెట్టుబడిగా వాడుకున్నాం. ఇప్పుడు మా వ్యాపారం బాగుంది. నా ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి పంపించాను. మేము నిలదొక్కుకునేందుకు సాయపడిన ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. – పొన్నగంటి నాగమణి, వరహాపురం, చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా  

Back to Top