పాల‌కుడా..ప్ర‌జా సేవ‌కుడా వ‌ర్ధిల్లు

   ‘చెదరని చిరునవ్వే ఆయుధం.. పోరాడే గుణమే ఆయ‌న‌ బలం.. మాట తప్పని నైజం .. మ‌హానేత వైయ‌స్  రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశయాలే వారసత్వం.. ప్రజల ముఖాల్లో ఎల్ల‌ప్పుడూ సంతోషం క‌నిపించాల‌నే త‌ప‌న‌తో సంక్షేమ పాల‌న అందిస్తున్న నాయ‌కుడు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆయురారోగ్యాల‌తో నిండు నూరేళ్లు వ‌ర్ధిల్లాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో ముఖ్య‌మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జ‌న‌నేత జ‌న్మ‌దినం ఈ నెల 21వ తేదీని పుర‌స్క‌రించుకొని రాష్ట్రంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రెండున్న‌రేళ్ల పాల‌న‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి పాల‌న చిర‌కాలం ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం..

మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు వైయస్‌ జగన్‌. అందుకే రాష్ట్ర ప్రజలు జననేత వెంట నడుస్తున్నారు. జగన్‌కు జై కొడుతున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంకల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తే అప్ప‌ట్లో అదికార పార్టీకి చెమ‌ట‌లు ప‌ట్టాయి. వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక అభివృద్ధి, సంక్షేమం రెండుక‌ళ్లుగా పాల‌న సాగిస్తుంటే ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేత‌ల‌కు దిక్కుతోచ‌డం లేదు. 

ఏపీ సర్కారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది.  ఇంతటి కష్ట సమయంలోనూ వైయ‌స్ జగన్ ఇచ్చిన మాట మాత్రం తప్పడం లేదు. తాను గతంలో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం రాజీ పడటం లేదు.  ఇందుకు  ఉదాహరణగా వంద‌కు పైగా సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, విప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌లు, చ‌ట్టాలే స‌జీవ సాక్ష్యం.  సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో,ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు రెండున్న‌రేళ్ల పాల‌న‌లోనే దాదాపు 96 శాతం అమ‌లు చేసి జ‌న‌రంజ‌క పాల‌న అందిస్తున్నారు.  

సంక్షేమం, అభివృద్ధే గీటురాయిగా...
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు...వ్యయం చేస్తోందని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విశ్లేషించింది. 2019 – 20 నుంచి వరుసగా పరిశీలిస్తే ..అభివృద్ధి  వ్యయం ఏటా పెరుగుతోందని  ఆర్బీఐ నివేదికతో స్పష్టమవుతోంది.  అభివృద్ధి వ్యయం 2020–21తో పోల్చితే....2021–22లో ఏకంగా 33.5 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. సామాజిక రంగాల వ్యయం కూడా భారీగా పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. 
బడ్జెట్‌ కేటాయింపులు, వ్యయాలపై...
ఆర్బీఐ విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. ఇక 2019–20 నుంచి ఉద్యోగుల జీతభత్యాలు బాగా పెరిగాయని...
అలాగే గతంలో చేసిన అప్పులకు ...వడ్డీ చెల్లింపులూ అధికమయ్యాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లగా ప్రజారోగ్యం...
కుటుంబ సంక్షేమంపై వ్యయం పెరిగిందని తెలిపింది.  

పెరిగిన జీతభత్యాల పద్దు
వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  
27 శాతం మధ్యంతర భృతి పెంచారు. వైద్య ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున శాశ్వత ఉద్యోగాలను కల్పించడంతో పాటు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు.  చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న చిరు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచారు. దీంతో జీత భత్యాల పద్దు భారీగా పెరిగింది.

గత సర్కారు హయాంలో ...
2018–19లో ఉద్యోగుల జీతభత్యాల పద్దు...రూ.32,743.40 కోట్లు ఉండగా...2021–22లో అది రూ.50,662.20 కోట్లకు చేరిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి. ఆహారం నిల్వ తదితర రంగాల వ్యయం.. 2019–20లో మొత్తం బడ్జెట్‌లో 45.4 శాతం ఉండగా...2021–22లో 49.4 శాతానికి పెరిగింది.

ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై ...
గత మూడు సంవత్సరాలుగా బడ్జెట్‌లో వ్యయం పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది.  2019–20లో బడ్జెట్‌లో ఈ రంగంపై 4.3 శాతం వ్యయం చేయగా 2020–21లో 5.2 శాతం వ్యయం చేసినట్లు తెలిపింది. 2021–22లో 6.1 శాతం మేర కేటాయింపులు చేసినట్లు వెల్లడించింది.

అభివృద్ధికే ఎక్కువ వ్యయం
ప్రధాన ఆర్థిక సూచికల ప్రకారం చూస్తే  మూడు ఆర్ధిక సంవత్సరాల్లో అభివృద్ధియేతర వ్యయం కన్నా అభివృద్ధికే ఎక్కువ వ్యయం చేస్తున్నట్లు ఆర్‌బీఐ అధ్యయన నివేదిక వెల్ల‌డించింది.

చ‌దువుల్లో ఏపీ టాప్ 
రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో మన ఏపీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో వెనుకబడి ఉన్న రాష్ట్రం ఇప్పుడు క్రమేణా అనేక రాష్ట్రాలను అధిగమిస్తూ అగ్రస్థానం వైపు దూసుకెళ్తోంది. ముఖ్యంగా పాఠశాల విద్యలో తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ విడుదల చేసిన ‘స్టేట్‌ ఆఫ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ ఇన్‌ ఇండియా’ నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బిబేక్‌ దేబ్రాయ్ ఇటీవ‌ల‌ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం..
ఫౌండేషన్‌ విద్య అందుబాటు అంశంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. చిన్న రాష్ట్రాల కేటగిరీలోని వివిధ అభివృద్ధి సూచికల్లో ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇతర అభివృద్ధి సూచికల విషయంలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు మాత్రమే సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ఇతరులకు రోల్‌ మోడల్‌గా నిలుస్తాయి. కానీ, కొన్ని సమయాల్లో సవాళ్లను పరిష్కరించేటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేర్చుకోవాలి.
చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేర్చుకోవచ్చు’ అని పేర్కొంది. దీంతోపాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ), ప్రాథమిక విద్యను అందుబాటులో ఉంచడం అనే అంశంలో రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించింది. ఈ విషయంలో ఏపీ అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్, గుజరాత్, బీహార్‌ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది.   
అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌, విద్యా  దీవెన‌, జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, జ‌గ‌న‌న్న విద్యా కానుక‌, నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం చ‌దువులు, సీబీఎస్ఈ వంటి విప్ల‌వాత్మ‌క మార్పుల‌తో దేశంలోనే ఏపీ ఆద‌ర్శంగా నిలిచింది.   

పల్లెకు ప్రాణనాడి 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ 
104 అంబులెన్స్ సేవ‌లు ప‌ల్లెకు ప్రాణ‌నాడిగా మారింది.  104 సంచార వాహనాలతో వ్యయ ప్రయాసలకు విముక్తి ల‌భించింది. ప్రతి నెలా సొంతూరిలోనే   వైద్యసేవలు అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి 656 MMUలు వెళ్తున్నాయి. ఈ ఏడాదిన్నరలో  గ్రామీణ వైద్యం రూపురేఖలు మారింది. గత జూలై నుంచి 1.03 కోట్ల మందికి వైద్య సేవలు అందించారు. మంచానికే పరిమితమైన 8.54 లక్షల మందికి ఇంటి వద్దే వైద్యం అందించారు. 43.36 లక్షల మందికి పరీక్షలు.. 41.96 కోట్ల మందుల పంపిణీ చేశారు. గ్రామాల్లో మంచానికే పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులతోపాటు అనారోగ్య బాధితులకు 104 వాహనాల సంచార వైద్య సేవలు (ఎంఎంయూ) వరంగా మారాయి. అవస్థలు పడుతూ ఎటూ వెళ్లాల్సిన అవసరం లేకుండా వీటి ద్వారా సొంతూరిలోనే మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.  రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి, గర్భిణిలకు 104 సేవలు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ప్రతి నెలా ఠంచన్‌గా ప్రతి గ్రామాన్ని 104 ఎంఎంయూలు సందర్శిస్తూ ప్రజలకు వైద్యం అందిస్తున్నాయి. గత సర్కారు హయాంలో మంచం పట్టిన ఈ వ్యవస్థకు జవసత్వాలు కల్పించి ప్రతి మండలానికి ఒక 104 చొప్పున మొత్తం 656 వాహనాలను సీఎం జగన్‌ ప్రభుత్వం గతేడాది జూలై 1 నుంచి అందుబాటులోకి తెచ్చింది. 

వైద్య సేవలు అందుతున్నాయి ఇలా
104 వాహనం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు గ్రామంలోనే ఉంటుంది. 104 వైద్యుడితో పాటు సంబంధిత పీహెచ్‌సీ వైద్యుడు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ అక్కడే అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం వరకూ గ్రామ సచివాలయం వద్ద రోగులకు వైద్య సేవలు అందిస్తారు.  అనంతరం నడవలేని వారు, మంచానికే పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఇతర రోగులకు ఇళ్ల వద్దకే వెళ్లి డాక్టర్లు సేవలు అందచేస్తారు. 104లో ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ప్రతి రోగి వివరాలను ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డులో పొందుపరుస్తారు. ఆ వివరాలను టెలీమెడిసిన్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు అనుసంధానించి భవిష్యత్‌లో తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టారు. రోగికి మెరుగైన వైద్య సేవలు అవసరం అయితే దగ్గరలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆసుపత్రులకు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. 
సంబంధిత రోగిని ఆసుపత్రికి తరలించే బాధ్యతను స్థానిక ఏఎన్‌ఎం నిర్వర్తిస్తుంది.

గ్రామ వికాసానికి కృషి చేసేలా ‘రైతు భరోసా కేంద్రాలు’

 విత్తనం నుంచి పంట విక్రయం దాకా అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా నిలిచి అమిత ఆదరణ పొందుతున్న రైతు భరోసా కేంద్రాలు గ్రామ వికాసానికి పూర్తి స్థాయిలో దోహదం చేసేలా సిద్ధమవుతున్నాయి. రైతులకే కాకుండా గ్రామం అంతటికీ అన్ని రకాలుగా భరోసా ఇచ్చేలా వీటిని తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్తగా 9,899 పాల సేకరణ కేంద్రాల భవన నిర్మాణాలకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి గ్రామంలో ఆర్బీకేలకు అనుబంధంగా పాలసేకరణ కేంద్రాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

భవనాల నిర్మాణం పూర్తి కాగానే వీటిని పొదుపు సంఘాల మహిళలకు అప్పగించనున్నారు. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఆర్బీకేల పరిధిలో పలు సదుపాయాలు కలిగిన మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లను యుద్దప్రాతిపదిక అందుబాటులోకి తేవాలని ఇటీవల సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. రూ.9,104 కోట్ల వ్యయంతో ఇవి ఏర్పాటు కానున్నాయి. ప్రధానంగా గోడౌన్లు, కోల్డ్‌ రూమ్‌లు, ఆక్వా మౌలిక సదుపాయాలు, పాల సేకరణ కేంద్రాలు.. బీఎంసీలు (బల్క్‌మిల్క్‌ సెంటర్లు), కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఈ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫారాలు, జనతా బజార్లు తదితరాలు మల్టీ పర్పస్‌ కేంద్రాల్లో ఏర్పాటవుతాయి. 

గోడౌన్లు, కోల్డు రూమ్‌లు...
రాష్ట్రంలో 10,641 ఆర్బీకేల పరిధిలో గ్రామస్థాయిలో ఒక్కొక్కటి రూ.30 లక్షల వ్యయంతో, 500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో కొత్తగా గోడౌన్లు ఏర్పాటవుతాయి. మంచి ధరల లభించే వరకు రైతులు వీటిల్లో పంటను నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు రూ.2,706 కోట్లను నాబార్డు సమకూర్చనుండగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పర్యవేక్షణలో వీటి నిర్మాణాలు కొనసాగుతాయి.

ఏపీలో పారిశ్రామిక విప్లవం
రాష్ట్రంలో పారిశ్రామిక విప్ల‌వం మొద‌లైంది.  కరోనాకు ఎదురొడ్డి రెండు భారీ పారిశ్రామిక పార్కులను వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అభివృద్ధి చేసింది. వైయ‌స్ఆర్‌ జిల్లా కొప్పర్తిలో .. 3,155 ఎకరాల్లో వైయ‌స్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు
(25 వేల కోట్ల భారీ పెట్టుబడులు, 75వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి). 
801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌
(10 వేల కోట్ల పెట్టుబడులు,25 వేల మందికి ఉపాధి ) 
వీటి ద్వారా రూ.35,000 కోట్ల పెట్టుబడులు.. లక్ష మందికి ఉపాధి 
ఈ నెల డిసెంబర్ 23న ప్రారంభించనున్న సీఎం
రూ.207 కోట్లతో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ యూనిట్‌  
డిక్సన్‌ కంపెనీలో ఉద్యోగాలకు నియామక పత్రాల జారీ
మరో 4 భారీ ఎలక్ట్రానిక్‌ కంపెనీల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూ.. మరో 18 చిన్న యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభం
తైవాన్, రష్యా, ఇండియా సెమీ కండక్టర్స్‌ అసోసియేషన్స్‌తో కొప్పర్తికి పెట్టుబడుల ఒప్పందం
23న బద్వేల్‌లో సెంచురీ ఫ్లైవుడ్‌కు, 24న పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ యూనిట్‌కు శంకుస్థాపన
వైయ‌స్సార్‌ జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ (ఎంఐహెచ్‌), 801 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌  క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ)లను ఈ నెల 23న సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
వైయ‌స్సార్‌ జగనన్న ఎంఐహెచ్‌ ద్వారా రూ.25,000 కోట్ల భారీ పెట్టుబడులు 75,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. 
వైయ‌స్సార్‌ ఈఎంసీ ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి కల్పించనుంది
గరువారం వైయ‌స్సార్‌ ఈఎంసీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. డిక్సన్‌ సంస్థకు తొలి దశలో అభివృద్ధి చేసిన నాలుగు షెడ్లను  అందించనున్నారు. కొప్పర్తి డిక్సన్‌ యూనిట్‌లో పని చేయడానికి తీసుకున్న ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తారు. 

కీలక ఒప్పందాలు
ఈఎంసీలో డిక్సన్‌ సంస్థ రూ.127 కోట్ల పెట్టుబడితో హెచ్‌ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్‌ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. డిక్సన్‌ రూ.80 కోట్ల పెట్టుబడితో ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్స్‌ తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్‌ ద్వారా మరో 1,100 మందికి ఉపాధి లభించనుంది. 
వీటితో పాటు ఫాక్స్‌కాన్, డీజీకార్న్, రెసల్యూట్, ఆస్ట్రమ్‌ వంటి పలు సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోనుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా తైవాన్‌కు చెందిన ప్రభుత్వ రంగ  ప్రమోషన్స్‌ ఏజెన్సీ, రష్యాకు చెందిన ఏజెన్సీ, మన దేశంలోని ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్‌ అసోసియేషన్స్‌ (ఐఈఎస్‌ఏ)లతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

వైయ‌స్సార్‌ జగనన్న ఎంఐహెచ్‌లో ఏర్పాటైన 18 ఫార్మా, సిమెంట్, పెయింట్స్‌ తయారీకి చెందిన యూనిట్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ 18 యూనిట్ల ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. 
వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్‌లో రూ.401 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిట్టి రైల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌కు ఎకరం రూ.10 లక్షలు చొప్పున 117.85 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ యూనిట్‌ ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభించనుంది.

రెండు భారీ యూనిట్లకు శంకుస్థాపన
రెండు పారిశ్రామిక పార్కుల ప్రారంభోత్సవంతో పాటు మరో రెండు భారీ యూనిట్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు. 

బద్వేల్‌ వద్ద రూ.956 కోట్ల పెట్టుబడితో సెంచురీ ప్లైబోర్డ్‌ ఇండియా లిమిటెడ్‌ యూనిట్‌ పనులకు డిసెంబర్‌ 23 ఉదయం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 

ఈ యూనిట్‌ ద్వారా 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతోపాటు రైతులకు ప్రయోజనం కలగనుంది. సుమారు 22,500 ఎకరాల్లో సాగు చేసిన రూ.315 కోట్ల విలువైన యూకలిప్టస్‌ చెట్లను ఈ సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేయనుంది. 
పులివెందులలో రూ.110 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ యూనిట్‌ పనులకు డిసెంబర్‌ 24న సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.  ఈ యూనిట్‌ ద్వారా 2,122 మందికి ఉపాధి లభించనుండగా అందులో అత్యధికంగా మహిళలకు అవకాశం రానుంది. 
 ఈ నెల డిసెంబర్ 23న ప్రారంభించే కంపెనీలివే..
స్వర్ణముఖి కాంక్రీట్స్, శ్రీ దుర్గా సిమెంట్స్, ఫిలెమన్‌ లైఫ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, అవన్ని ఆర్గానిక్స్, రాయలసీమ ఎన్విరాన్‌ కేర్, బీఎస్‌ ల్యాబొరేటరీస్, యునోటెక్‌ బిల్డింగ్‌ ప్రోడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీ గణేష్‌ శానిటేషన్, ఎస్‌ పెయింట్స్‌ మాన్యుఫాక్చరర్స్, అక్షర నోట్‌బుక్‌ అండ్‌ బైండింగ్‌ ఇండస్ట్రీ, ఆర్‌డీఎల్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్,  సుమిత్ర ల్యాబ్స్, మణి కెమ్‌ ఫార్మా, శ్రీ లక్ష్మి మేఘన ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌ఎన్‌ఆర్‌ ఫార్మా, శ్రీ లక్ష్మీ బయో ఆర్గానిక్స్, ఒబ్లి ఇండస్ట్రీస్, స్టార్‌ పేపర్‌ బోర్డ్స్‌.

ఏపీలో ఫ్లిప్‌కార్ట్‌ పెట్టుబడులు 
 ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కళ్యాణ్‌ కృష్ణమూర్తి నేతృత్వంలో సంస్థ బృందం ఈ నెల 16న ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైంది. ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో మరిన్ని పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో భాగస్వామి కావడానికి ఆసక్తి వ్యక్తం చేసింది
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు.  

బియ్యం ఎగుమతుల్లో దూసుకుపోతున్న ఏపీ
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బియ్యం ఎగుమ‌తుల్లో దూసుకుపోతోంది.  2019–20 లో  బియ్యం ఎగుమతులు రూ.1,902.65 కోట్లు 
2020–21లో రూ.5,790 కోట్ల విలువైన 22.09 లక్షల టన్నుల  బియ్యం ఎగుమతి. ఈ ఏడాది అక్టోబర్‌కే రూ. 4,131.86 కోట్ల విలువైన 16.38 లక్షల టన్నుల బియ్యం  ఎగుమతి చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బియ్యం ఎగుమతులు 30 లక్షల టన్నులు దాటుతాయని అంచనా . ప్రస్తుతం రాష్ట్ర ఎగుమతుల్లో 5 శాతం వాటాను కలిగి ఉన్న బియ్యం ..
ప్రపంచదేశాల డిమాండ్‌ను అందిపుచ్చుకున్న రాష్ట్రం . యాంకరేజ్‌ పోర్టుతో పాటు కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు నుంచి ఎగుమతికి అనుమతి పొందించింది. కాకినాడ నుంచి నెలకు సగటున 16 ఓడల ద్వారా ఎగుమతి . గతంలో 12 ఓడలకు మించి ఎగుమతి చేయలేని పరిస్థితి . 30 రోజుల నుంచి 20 రోజులకు తగ్గిన లోడింగ్‌ సమయం. ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా దేశాలకు రాష్ట్ర బియ్యం ఎక్కువగా ఎగుమతి అవుతోంది. గత ఆర్థిక సంవత్సరం మన దేశం నుంచి బియ్యం (నాన్‌ బాసుమతి) 177.2 లక్షల టన్నుల ఎగుమతి అయింది. అది ఈ ఏడాది 200 లక్షల టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 
రాష్ట్రం నుంచి అత్యధికంగా ఆఫ్రికా దేశాలైన గునియా (17%), కోట్‌ డివోరి (15%), సెనెగల్‌ (12%) దేశాలతో పాటు బంగ్లాదేశ్, ఇతర ఆసియా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

కొత్త ఏడాదిలో పింఛ‌న్ పెంపు
కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు వైయస్ జగన్‌ సర్కార్‌ కానుక  ఇవ్వ‌నుంది. 2022 జ‌న‌వ‌రి నుంచి వైయ‌స్ఆర్ పెన్ష‌న్ కానుక రూ.2500 అందించ‌నున్నారు. వైయ‌స్ఆర్ పెన్షన్ కానుక‌ రూ.2250 నుంచి రూ.2500కు పెంచ‌నున్నారు. జనవరి 1, 2022న అమలు కానుంది. జనవరి 1, 2022న అవ్వాతాతలు చేతిలో వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ రూ.2500 పెట్ట‌నుంది.  

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజున ఓటీఎస్ ప్రారంభం
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు డిసెంబ‌ర్ 21న‌  సంపూర్ణ గృహహక్కు పథకాన్ని సీఎం ప్రారంభించ‌నున్నారు. త‌ణుకులో ఏర్పాటు చేసిన ఓటీఎస్ అవగాహ‌న కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ల‌బ్ధిదారుల‌కు రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలు అంద‌జేస్తారు. ఏడాది మొత్తం అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు 16 లక్షలు కాగా ఓటీఎస్‌ ద్వారా 51 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల మేర భారీ బకాయిలను మాఫీ చేస్తోంది. క్లియర్‌ టైటిల్‌ ఇస్తోంది. ఆస్తిని అమ్ముకునేందుకు లేదా తమవారికి బహుమతిగా ఇవ్వడానికి పూర్తి హక్కులు కల్పిస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు కూడా అవకాశం దక్కుతుంది. ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తోంది. చాలావరకు ఈ ఇళ్లు ఉన్న చోట రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంది. అంత మొత్తంపై రిజిస్ట్రేషన్‌ ఉచితంగా చేస్తున్నాం. ఉచిత రిజిస్ట్రేషన్‌ వల్ల పేదలకు దాదాపు రూ.6 వేల కోట్ల మేర లబ్ధి కలుగుతోంది. ఇలా మొత్తం రూ.16 వేల కోట్ల దాకా పేదలకు ప్రయోజనం కలుగుతుంది.  
- డిసెంబర్‌ 28న ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద పొరపాటున మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ చేయ‌నున్నారు. ఇలా చెప్పింద‌ల్లా చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లాంటి నాయ‌కుడు త‌మ‌కు ముఖ్య‌మంత్రిగా ల‌భించినందుకు రాష్ట్ర ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు. నిండు నూరేళ్లు వ‌ర్ధిల్లాల‌ని మ‌న‌సారా దీవిస్తున్నారు. దేవుడి ద‌య‌, ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో ప్ర‌జారంజ‌క‌ పాల‌న కొన‌సాగాల‌ని ఆకాంక్షిస్తూ...
జ‌న‌నేత ..మీకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు..
  

Back to Top