అమరావతి: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య రక్షణ లక్ష్యంగా వైయస్ జగన్ ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడం, ప్రాథమిక పరీక్షలతో ఆరోగ్య సమస్యలను గుర్తించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు, పీహెచ్‌సీ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ద్వారా చికిత్సలు, మందులను ఉచితంగా అందించబోతోంది. ఎవరైనా రోగులకు అవసరమైతే ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి వైద్య చికిత్సలు చేయించనుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఆరోగ్య సమస్యలకు ‘స్పెషల్’ చికిత్స.. ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ కరపత్రాన్ని పంపిణీ చేసి.. సేవలను వివరిస్తారు. ఈనెల 16 నుంచి వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, వైఎస్సార్ అర్బన్ క్లీనిక్‌ల పరిధిలోని గృహాలను ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌ఓలు) సందర్శిస్తారు. ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. ఆ ఫలితాలను డాక్టర్లకు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నంబర్లు ఇస్తారు. ఈనెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతిరోజూ.. ప్రతి మండలంలోనూ ఏదో ఒక వైయస్ఆర్ విలేజ్ క్లీనిక్‌తో పాటు ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైయస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 342 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలందిస్తారు. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొంటారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేస్తారు. విజయవంతం చేద్దాం: సీఎస్ జవహర్‌రెడ్డి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు అవసరమైన శిక్షణ, ప్రచార సామగ్రి, టెస్టింగ్ కిట్లు, మందులు తదితరాలను అందజేయాలని సూచించారు. ఇంటింటి సర్వే సమయంలో సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు, క్షయ, కుష్టు, సంక్రమించని, సంక్రమించే వ్యాధులు, గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్, మలేరియా, డెంగీ తదితరాలతో బాధపడుతున్నవారిపై దృష్టి పెట్టాలన్నారు. శిశువులు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేయాలని సూచించారు. సమావేశంలో ఉన్నతాధికారులు కృష్ణబాబు, ప్రవీణ్ ప్రకాశ్, జయలక్ష్మి, కోటేశ్వరరావు, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ సేవలు: మంత్రి రజిని రాష్ట్ర ప్రజలకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం రక్షగా నిలవబోతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఇప్పటికే విప్లవాత్మక సంస్కరణలతో ప్రజారోగ్యానికి అండగా నిలిచిన సీఎం వైయస్ జగన్ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మంగళగిరిలోని వైద్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నెల రోజుల పాటు రాష్ట్రమంతా వైద్య శిబిరాలు నిర్వహించి.. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందిస్తామని తెలిపారు. స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యమందిస్తామన్నారు. ఈ వైద్య శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.120 కోట్ల మేర ఖర్చు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్, ఎంపీడీవో, పీహెచ్‌సీ వైద్యాధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ ఆరోగ్య అధికారి, యూపీహెచ్‌సీ వైద్యాధికారులు ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పారు. సమీక్షలో ఉన్నతాధికారులు ఎం.టి.కృష్ణబాబు, నివాస్, మురళీధర్‌రెడ్డి, హరేంధిరప్రసాద్, డాక్టర్ వెంకటేశ్వర్, డాక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిలకలూరిపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవోలకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ గురించి ఆమె దిశానిర్దేశం చేశారు.