అమరావతి : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా టాప్ 5 రాష్ట్రాల సరసన చోటు సాధించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అధిగమించిన రాష్ట్రాల కోవలో నిలిచింది. దేశంలో అత్యధిక అక్రిడిటేషన్ కలిగిన జిల్లా, సబ్ డివిజన్ ఆసుపత్రులు ఏపీలోనే ఉన్నట్లు వెల్లడైంది. వ్యాధి నిరోధకత, టీకాల పంపిణీకి సంబంధించి రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ప్రసూతి సేవలు కూడా గణనీయంగా మెరుగయ్యాయి. రాష్ట్రాల ఆరోగ్య సూచీ నాలుగో ఎడిషన్ 2019–20ను ‘ఆరోగ్యకరమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతదేశం’ పేరుతో నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్‌కాంత్, అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేష్ సర్వాల్, ప్రపంచ బ్యాంక్ సీనియర్ హెల్త్ స్పెషలిస్ట్ షీనా చబ్రా సంయుక్తంగా దీన్ని విడుదల చేశారు. రాష్ట్రాల్లో ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి 24 అంశాల్లో అధ్యయనం నిర్వహించి నివేదికను రూపొందించారు. ఏపీ మరింత మెరుగ్గా.. అన్ని అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గతంలో ఉన్న 68.88 సోర్క్‌ను మెరుగు పరుచుకుని ఈదఫా 69.95 స్కోర్‌తో పెద్ద రాష్ట్రాల విభాగంలో ఏపీ 4వ ర్యాంక్ సాధించింది. తొలి మూడు ర్యాంకులు కేరళ, తమిళనాడు, తెలంగాణ (69.96 స్కోరు) దక్కించుకున్నాయి. ఆరోగ్య సూచీల కేటాయింపు 2017లో ప్రారంభమైంది. నాలుగు దఫాలుగా పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈసారి కేరళ 82.20 స్కోరు సాధించగా యూపీ 30.57 స్కోరు దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ 19వ ర్యాంక్‌తో చివరిలో నిలిచింది. నాలుగు అంశాల్లో సుస్థిర లక్ష్య సాధన శిశు మరణాలు, ఐదేళ్లలోపు మరణాల రేటు, ప్రసూతి మరణాల నిష్పత్తి, లింగ నిష్పత్తి.. ఈ నాలుగు అంశాల్లో రాష్ట్రం సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించింది. ఏపీలో లక్ష జననాలకు 70 కంటే తక్కువ మాతృ మరణాలు ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో 53.7 శాతం జిల్లా, సబ్ డివిజన్ ఆస్పత్రులకు అక్రిడిటేషన్ ఉన్నట్లు తేలింది. దేశంలో ఐదు రాష్ట్రాలు మాత్రమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించగా అందులో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. వ్యాధి నిరోధకత, టీకాల పంపిణీకి సంబంధించి 98.87 శాతంతో దేశంలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఆపరేషన్ థియేటర్లలో ప్రసూతి సమయంలో సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలు, కాన్పు జరిగిన మహిళలకు అందిస్తున్న సేవలు, మందులు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇచ్చే గుర్తింపు గతంలో ఒక్క జిల్లా ఆసుపత్రికి కూడా లభించకపోగా ప్రస్తుతం 7.96 శాతం ఆసుపత్రులకు ఉన్నట్లు వెల్లడైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల అందుబాటు 2019–20తో పోలిస్తే 2020–21లో 6.4 శాతం వృద్ధి చెందింది. 1145 పీహెచ్‌సీలలో ఇద్దరు వైద్యుల విధానం, 650 మంది మెడికల్ ఆఫీసర్‌ల నియామకం, సుమారు 3 వేల సిబ్బంది నియామకం, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధిలో 11 వేలకు పైగా పోస్టుల భర్తీ, మరో 4,142 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండటం ఇందుకు దోహదపడింది. కొత్తగా 3,483 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.