హైదరాబాద్ : ఫిరాయింపు దారులపై అనర్హత వేటు వేయాలన్న పిటీషన్ ను స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించటం మీద వైయస్సార్సీపీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక కారణాలతో 13 అనర్హత పిటిషన్లను చెల్లవని చెప్పడం సరి కాదని ఆ పార్టీ అభిప్రాయపడింది. ప్రకటన సారాంశం ఇలా ఉంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యేలు పార్టీని వీడి పచ్చ కండువాలు కప్పుకొన్నారు. అంతే కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలు 13 మంది ఎక్కడా కూడా తాము టీడీపీలో చేరలేదని చెప్పలేదు. పై పెచ్చు, తెలుగుదేశం పార్టీకి చెందిన అన్ని కార్యక్రమాలకు హాజరు అవుతూనే ఉన్నారు. టీడీపీ లో చేరినట్లు రహస్యంగా కాకుండా బహిరంగంగానే ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్రంలో చట్టపరమైన పరిపాలన సాగుతున్నట్లయితే,ఆ 13 మంది మీద స్పీకర్ అనర్హత వేటు వేయాలి. వాస్తవానికి అనర్హతకు సంబంధించి వైయస్సార్సీపీ వేసిన పిటీషన్ ఈ నెల 8న సుప్రీంకోర్టు ముందుకు రానుంది. దీంతో స్పీకర్ హడావుడిగా ఈ పిటీషన్ ను తోసిపుచ్చినట్లు ప్రకటించేశారు. అంటే దీన్ని బట్టి వచ్చే విచారణ తేదీ నాటికి గౌరవనీయ స్పీకర్ ముందు ఎటువంటి పెండింగ్ పిటీషన్లు లేవని చెప్పి తప్పించుకొనేందుకు వీలవుతుంది. గౌరవ స్పీకర్ పాక్షిక జ్యూడిషియల్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి మాదిరిగా వ్యవహరించాల్సి ఉంటుందని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. రాజ్యాంంలోని పదో షెడ్యూల్ ప్రకారంఅనర్హత పిటీషన్ లను విచారణ చేసేటప్పుడు న్యాయ వ్యవస్థ మాదిరిగా నియమ నిబంధనల్ని అనుసరించాలి. వాస్తవానికి తన నిర్ణయం వెలువరించే ముందు స్పీకర్ కనీసం పిటీషనర్లను తన ఛాంబర్ కు పిలిపించి, తదనుగుణంగా అవకాశం ఇప్పించి, తర్వాత తన నిర్ణయాన్ని వెలువరిస్తే బాగుండేది. కానీ, స్పీకర్ అలా చేయలేదు. అందుచేత స్పీకర్ వెలువరించిన నిర్ణయం ప్రతుల్ని పరిశీలించాక పార్టీ తన తదుపరి నిర్ణయాన్ని వెలువరిస్తుందని పత్రికా ప్రకటనలో వైయస్సార్సీపీ తెలిపింది. <br/>