రెండు పార్టీలు రాష్ట్రాన్ని మోసగించాయి

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌
 

జాతీయ రాజకీయాల్లో మాది తటస్థ వైఖరి 
 
ప్రత్యేక హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోలేకపోయింది

ఇండియా టుడే కాంక్లేవ్‌లో వైఎస్‌ జగన్‌

 న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాలకు సంబంధించినంతవరకు రెండు పార్టీలు (కాంగ్రెస్‌, బీజేపీ) రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదాను అత్యంత ముఖ్యమని, వాటిని నెరవేర్చే పార్టీకే ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇండియా టుడే 18వ ఎడిషన్‌ కాంక్లేవ్‌లో భాగంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ రాహుల్‌ కన్వల్‌తో వైయ‌స్‌ జగన్‌ ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ప్రజలకు ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని వైయ‌స్‌ జగన్‌ తప్పుబట్టారు.

పార్లమెంటు ద్వారాలు మూసి.. విభజనను వ్యతిరేకిస్తున్న ఎంపీలను సస్పెండ్‌ చేసి లోక్‌సభలో విభజన బిల్లును ఆమోదించారని, రాజ్యసభలో అన్ని పార్టీలు విభజనకు మద్దతు తెలిపి.. అందుకు పరిహారంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నామని ప్రకటించాయని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేసిన ప్రాంతమే రాజధాని హైదరాబాద్‌ను తీసుకుపోయిందని, ఈ పరిస్థితిలో రాజధాని లేక, పెద్ద నగరాలు లేక ఏపీ యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. అందుకే ఏపీలో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, హోటళ్లు, పెద్ద పెద్ద ప్రైవేటు ఆస్పత్రులు రావాలంటే.. ప్రత్యేక హోదా కచ్చితంగా ఉండాల్సిందేనని, పన్ను రాయితీలు, జీఎస్ రాయితీలు ఉంటేనే ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకువస్తాయని, అప్పుడు ఏపీలోని విద్యార్థులు, యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండబోదని వైయ‌స్‌ జగన్‌ వివరించారు.

 

 

Back to Top