<img style="width:419px;height:420px;margin:5px;float:right" src="/filemanager/php/../files/sharmila1.jpg"><br>వేముల(వైఎస్సార్ జిల్లా): ‘నాలుగేళ్ల క్రితం నా బిడ్డకు మెదడులో గడ్డ ఉండటంతో తలతిరిగి పడిపోయేవాడు.. వైయస్ దయవల్ల మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డుతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించాం. రోగం నయం కాకపోవడంతో మళ్లీ ఆ ఆసుపత్రికి వెళితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు రద్దయిందంటూ వైద్యం చేయనంటున్నారు. ఇప్పుడు అక్కడ ఆపరేషన్ చేయాలంటే వేలకు వేలు అడుగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే పరిస్థితే లేదు. వైయస్ ఉండి ఉంటే మాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు’ అంటూ వేల్పుల గ్రామానికి చెందిన సుశీలమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. వేల్పుల కాలనీలోని సుశీలమ్మ ఇంటికి షర్మిల వెళ్లినప్పుడు ఆమె తన సమస్యలను విన్నవించారు. రోడ్డు ప్రమాదంలో తన కాలు దెబ్బతిన్నప్పుడు కూడా తాను వైయస్ దయతో తిరుపతి వెళ్లి వైద్యం చేయించుకున్నానని తెలిపారు. ఈ ప్రభుత్వం తమ ఆరోగ్యశ్రీ కార్డును రద్దు చేయడంతోపాటు అన్నింటి ధరలూ పెంచేసిందన్నారు. కాలనీలో నీళ్లు రావట్లేదని, కరెంటు ఉండట్లేదని చెప్పారు. త్వరలో మంచి కాలం వస్తుందని, జగనన్న ముఖ్యమంత్రి అయితే సమస్యలన్నీ తీరుతాయని షర్మిల భరోసా ఇచ్చారు. కాలనీలో నీటి విషయంపై స్పందించిన ఎమ్మెల్యే వై.యస్.విజయమ్మ.. ఎమ్మెల్యే కోటా నిధులతో కాలనీలో బోరువేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని మహిళలకు హామీ ఇచ్చారు.