కృష్ణ కృష్ణా..!

కంచే చేను మేస్తే  దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఉంది చంద్రబాబు పరిపాలన. కోట్ల విలువైన భూముల బాగోతం ఒక ఎత్తైతే, పర్యావరణానికి కూడా తూట్లు పొడవటం ఒక ఎత్తు. నదీతీర నాగరికతలు ఎంతగా సుందరంగా ఉన్నా, చివరకి చేటు తెస్తాయని చరిత్ర చెబుతోంది. చరిత్ర అంటేనే చిరాకు పడే బాబుకు ఆ విషయం గిట్టదు. కాని తన విలాసాలకోసం, తన వర్గం వారి అవసరాల కోసం రాష్ట్ర ప్రజల క్షేమాన్ని విస్మరించే హక్కు ఏ పాలకుడికీ ఉండదని చంద్రబాబు గుర్తుంచుకునే తీరాలి. ప్రకృతిని విధ్వంసం చేసే ఏ పనికీ పాలకులు సాయం చేయకూడదు. కాని చంద్రబాబు మాత్రం తానే స్వయంగా నదీ పరిరక్షణ చట్టాలకు తూట్లు పొడుస్తున్నాడు. దాంతో నదీ తీరంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని ప్రశ్నించే వీల్లేకుండా పోయింది. 

నదిలోనే సిఎమ్ నివాసం
నదీ పరిరక్షణ చట్టం ప్రకారం నదీ ప్రవాహానికి 500 మీటర్ల లోపు నిర్మాణాలు జరక్కూడదు. కాని స్వయంగా ఎపి సిఎమ్ చంద్రబాబు అలాంటి ఓ అక్రమ నిర్మాణంలోనే బస చేసి అక్రమార్కులకు ఆయనే అండగా ఉన్నారని తెలియజెప్పారు. ఇది అక్కడితో ఆగలేదు. తాను స్వయంగా నివాసం ఉండే భవంతిని కూడా కృష్ణా నదీ తీరానే నిర్మించుకుని పర్యావరణాన్ని, చట్టాన్ని తన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటానని తెలియజెప్పారు. ఇప్పుడు సిఎమ్ నివాసానికి దగ్గరలోనే ఐదుకోట్లు విలువచేసే మరో అత్యాధునిక భవంతి నిర్మాణం కూడా జరుగుతోంది. ఇంత బాహాటంగా నదీ తీరాన్ని ఆక్రమించుకుంటున్న చంద్రబాబు తాను ప్రకృతి ప్రేమికుడిననీ, నదీ రక్షకుడిననీ చెప్పుకోవడం చూస్తే అబద్ధాలకు పేటెంట్ రైట్ చంద్రబాబుకి ఇచ్చి తీరాలనిపిస్తుంది. 

కృష్ణా నదీ పరిరక్షణ కోసం యాత్ర చేపట్టిన డాక్టర్ రాజేంద్రసింగ్ విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ అక్రమ నిర్మాణాలను చూసి, సిఎమ్ ఇంకా ఆయన అండ చూసుకుని పంట భూములను, నదులను కాలుష్యం చేస్తున్న వారందరూ వెంటనే ఆ నిర్మాణాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. యాత్రలో భాగంగా పర్యటిస్తున్న ఆయన కాన్వాయిని టిడిపి అనుయాయులు వచ్చి అడ్డగించి, దాడికి పాల్పడ్డారు. చంద్రబాబు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎవ్వరినైనా అనుచరులతో, పార్టీ కార్యకర్తలతో దాడులు చేయిస్తారు. తర్వాత అపర భగీరథుడిని, ప్రకృతికి ముద్దు బిడ్డని అని పాఠాలు వల్లిస్తారు. 

నదులనూ స్వాహా చేస్తున్న కబ్జాకోరులు
ఇంతకాలం ఖాళీ భూములు, సర్కార్ భూములు, అటవీభూములు అంతెందుకు కొండలు, గుట్టలు వంటివి కబ్జా చేయడం చూసాం. కానీ నదినే కబ్జా చేయడం ఎక్కడా విని ఉండం. కానీ కృష్ణా నదిని మాత్రం పచ్చరాయుళ్లు దర్జాగా కబ్జా చేసుకుంటున్నారు. నీళ్లలో కొంత మేర వరకూ జెండాలు పాతి మరీ ఈ ప్రాంతం వరకూ మాదంటూ చెప్పుకుంటున్నారు. 150 కిమీ. మేర ఇలా నదిలో జెండాలు పాతి అక్రమార్కులు అడ్డంగా నదినే ఆక్రమించుకుంటున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం చూస్తేనే ఈ కబ్జారాయళ్లంతా ఎవరి తొత్తులో అర్థం అయిపోతుంది. కృష్ణా నదీ తీరంలో అద్భుత రాజధాని అనే పేరు కోసం చంద్రబాబు సహజ వాతావరణాన్ని, ఆంధ్రప్రదేశ్ కు వర ప్రదాయని అయిన కృష్ణా నదినీ నాశనం చేస్తున్నారు. భవిష్యత్ లో కృష్ణా నది కుంచించుకు పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  

ఈ అక్రమ కట్టడాల వ్యవహారంపై ప్రతిపక్ష వైయస్సార్సీపీ నిరంతరం ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఉంది.  ఇటీవల ఒకసారి మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బోటులో కృష్ణా నదిలోకి  వెళ్లి ఇన్ని అక్రమ నిర్మాణాలున్నాయా నాకు తెలియదే అంటూ..తమ  అమయకత్వం నాటకాన్ని జర్నలిస్టుల ముందే ప్రదర్శించాలనుకున్నారు. ఇన్నేళ్లుగా ఇక్కడే పుట్టిపెరిగిన మీకు అసలు వీటి గురించే తెలియదంటే నమ్మాలంటూ విలేఖరులు ముఖానే అడిగేసరికి, వీటన్నిటినీ తొలగిస్తాం అంటూ హడావిడి చేశారు. కాని ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు పడిందే లేదు. 

Back to Top