వరుణుడు తోడుగా షర్మిల అడుగులు

శ్రీకాకుళం :

రాజన్న తనయ, ఆత్మీయ అతిథి రాకతో శ్రీకాకుళం సరిహద్దు పరవశించింది. వరుణుడు కరిగి అందరినీ పులకింపచేశాడు. అభిమాన మేఘమై జోరువానగా కురిశాడు. జననేత జగనన్న సోదరి వెంట తరంగమై నడిచివచ్చాడు. ఆదివారంనాటి శ్రీమతి షర్మిల పాదయాత్ర ఆద్యంతం వర్షపు జల్లులతో పలకరించాడు. జిల్లా పోలిమేర కడకెల్ల వద్దకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. గంటల తరబడి వేచి చూశారు. దారిపొడవునా నీరాజనాలు పలికారు. గుమ్మడికాయల్లో దీపం వెలిగించి దిష్టి తీశారు. చెక్కు చెదరని ఆదరణతో అక్కున చేర్చుకున్నారు. శ్రీమతి షర్మిల ఆత్మీయ పలకరింపుతో అందరూ ఆనందం తరంగితులయ్యారు. శ్రీమతి షర్మిల శ్రీకాకుళం జిల్లాకు వచ్చీ రాగానే వరుణదేవుడిని వెంట తీసుకు వచ్చారు. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా భారీ వర్షాల కోసం ముఖం వాసి చూస్తున్న రైతన్నల్లో సంతోషాన్ని నింపారు.

ఆశయం ముందు కష్టనష్టాలు లెక్కే కాదని శ్రీమతి షర్మిల రుజువు చేశారు. తడిచి ముద్దవుతున్నా జోరువానలోనే నడిచారు. ఒకవైపు తడుస్తూ, మరోవైపు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తడిచి ముద్దయినా లెక్కచేయకుండా మహిళలు, యువకులు, వైయస్ఆర్ కాంగ్రె‌స్ అభిమానులు‌ ఆమె అడుగులో అడుగేసి పాదయాత్రలో పాల్గొన్నారు. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా 216 రోజు ఆదివారం శ్రీకాకుళం జిల్లా కడకెల్లలో ప్రవేశించారు. జనం జయ జ్వయ ధ్వానాల మధ్య స్వాగతం పలికారు.

శ్రీకాకుళం సరిహద్దుల్లో శ్రీమతి షర్మిల అడుగు పెట్టగానే కడకెల్ల మహిళలు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. శివారు గ్రామంలో ఉన్న తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, సమస్యలు పరిష్కరించడం లేదని, మౌలిక వసతులు, రహదారులు లేవని విన్నవించుకున్నారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామంటూ తమ కార్యసిద్ధి గురించి వివరించారు. దీంతో వారికి షర్మిల అభినందనలు తెలిపారు. రానున్న జగనన్న ప్రభుత్వంలో ప్రజల సమష్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. అనంతరం కడకెల్లలోనే 216 మంది మహిళలు బూడిద గుమ్మడికాయలపై కర్పూర జ్యోతి వెలిగించి దిష్టి తీయడంతో పాటు సాదరంగా స్వాగతం పలికారు.

అక్కడి నుంచి వానలోనే సాగిన శ్రీమతి షర్మిల దారిపొడవునా మహిళలను, యువకులను, వృద్ధులను పలకరించారు. అవ్వా... క్షేమమా? పింఛన్లు అందుతున్నాయా? అంటూ ఆత్మీయంగా పలకరించారు. అక్కున చేర్చుకుని, కరచాలనం చేసి నడిమికెల్ల, విక్రమపురం మీదుగా సుమారు 5.2 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాత్రి బస ప్రాంతమైన నడుకూరు వద్దకు చేరుకున్నారు.

నీలాకాశం నిండా మేఘమాలికలు :
ప్రకృతి కరుణించింది. జనత పులకించింది. తుంపర్లు జల్లులయ్యాయి.. జల్లులు వానగా మారాయి.. వాన జోరువాన అయ్యింది. తామేం తక్కువ కాదన్నట్లు ఒకరు ఇద్దరయ్యారు.. ఇద్దరు పదుగురయ్యారు.. అలా వందలు.. వేలాదిగా జన తరంగం జోరువానకు పోటీగా వెల్లువెత్తింది. విజయనగరం - శ్రీకాకుళం జిల్లాల సరిహద్దులోని ఓ చిన్ని గ్రామం కడకెల్ల వద్ద ఆదివారం ఆవిష్కృతమైన అద్భుత దృశ్యం. జిల్లా సరిహద్దుల్లో తొలి అడుగు మోపిన మహానేత ముద్దుల తనయ శ్రీమతి షర్మిలకు వర్షం.. జనం పోటాపోటీగా స్వాగతం పలికారు. వాన జల్లులు ఆమెను ఆప్యాయంగా అభిషేకిస్తే.. పల్లెపడుచులు అంతకంటే మురిపెంగా గుమ్మడికాయలతో కర్పూర హారతులిచ్చారు. జిల్లాలో మరో ప్రజాప్రస్థానానికి ఘనమైన ప్రారంభాన్నిచ్చారు. వాన జోరెక్కినా జనహోరు ఏమాత్రం తగ్గలేదు. శ్రీమతి షర్మిల అడుగులో అడుగేస్తూ.. వడివడిగా మజిలీకి చేర్చారు.

- జగన్ బాబును చూశాం...‌ షర్మిలమ్మను చూద్దామంటూ మహిళలు అన్నిచోట్ల ఆసక్తిగా చర్చించుకున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు అంధవరపు సూరిబాబు సమకూర్చిన బూడిద గుమ్మడికాయలతో మహిళలు శ్రీమతి షర్మిలను స్వాగతించడం అందరినీ ఆకట్టుకుంది.

- అన్ని కూడళ్ల వద్ద నిండువానలో తడుస్తూ శ్రీమతి షర్మిలను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వేచి చూశారు. విక్రమపురం వద్ద వాహనం ఎక్కి శ్రీమతి షర్మిల అభివాదం చేసినప్పుడు ప్రజలంతా జయహో జగన్ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి.

- వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక‌ మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం‌ శ్రీమతి షర్మిల వెంట హుషారుగా నిడిచారు.

- వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్ జెండా మాదిరిగా రూపొందించిన టీ‌ షర్టులు ధరించిన యువకులు పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Back to Top