పాదయాత్రలో షర్మిలపై ఉప్పొంగిన అభిమానం

విశాఖపట్నం 26 జూన్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వై.యస్.జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లాలో రెండో రోజుకు ప్రవేశించింది. పాదయాత్ర మార్గంలో ప్రజలు ఆమెకు నీరాజనాలు పట్టారు. శ్రీమతి షర్మిలను చూసేందుకు గంటల తరబడి రోడ్లమీద బారులు తీరి వేచి ఉన్నారు. పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు తమ ఆడబిడ్డను స్వాగతించి అక్కున  చేర్చుకున్నారు. వారందరినీ ఆత్మీయతతో పలకరించి, కష్టాలు తెలుసుకున్నారు. భవిష్యత్తు మనదేనని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. శ్రీమతి షర్మిల మంగళవారం ఉదయం 9గంటలకు నాతవరం మండలం శృంగవరంలో యాత్ర ప్రారంభించారు.

రాజన్న రాజ్యం వస్తుంది...
నాతవరం మండలం లింగంపేట, శృంగవరం, శరభవరం, తాండవ జంక్షన్, గాంధీనగరం, ఎర్రవరం, ములగపూడి, మెట్టపాలెం, బెన్నవరం గ్రామస్థులు శ్రీమతి షర్మిలకు తమ బాధలు చెప్పుకున్నారు. పింఛన్లు అందడం లేదనీ,  పంటకు గిట్టుబాటు ధర రావడం లేదనీ చెప్పారు.  రోడ్లు లేవని, కాలువలకు నీరు అందడం లేదని తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ‘త్వరలోనే జగనన్న సీఎం అవుతాడనీ, అప్పుడు రాజన్న రాజ్యం వస్తుంనీ,  అంతా మంచే జరుగుతుందనీ శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు. తన కోసం వచ్చిన వారి పేర్లు తెలుసుకుని మరీ పలకరించారు.

అవ్వా, తాత, అక్క అంటూ వారితో మమేకమయ్యారు. చిన్నారులను ముద్దాడారు. వికలాంగుల బాధలు విన్నారు. లింగంపేటకు చెందిన తన ఏడేళ్ల కొడుకు అభిరాం నడవలేకపోతున్నాడనీ, కేజీహెచ్‌లో చూపిస్తే సర్టిఫికెట్ కూడా ఇచ్చారనీ, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ వమ్ముల కుమారి అనే మహిళ శ్రీమతి షర్మిల వద్ద వాపోయారు.
ఎనబైయేళ్ళ కన్నయ్య తనకు పింఛను రావడం లేదని చెప్పగా ఆదుకుంటాం లే తాతా అంటూ హామీ ఇచ్చారు. తనకు అండగా ఎవరూ లేరని కె. అచ్చియ్యమ్మ, పింఛను రావడం లేదని లక్ష్మి, శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సాయం అందడం లేదని నూకాలమ్మ అనే మహిళలు వేదన వినిపించారు.

Back to Top