సోదాలు కంచికేనా??


 చంద్రబాబు గారి బినామీలొక్కక్కరి
పేర్లూ తెరపైకొస్తున్నాయి. తెలుగుదేశం ఆర్థిక స్తంభాల కూసాలు కదులుతున్నాయి. కప్పెట్టిన అక్రమాల
కలుగుల్లోంచి అవినీతి పందికొక్కుల తలలు బయటపడుతున్నాయ్. ఐటి, ఈడీ, సీబీఐ, డీఆర్ఐ లు కలిసికట్టుగా
అవినీతి సామ్రాజ్యపు మూలాలలను వెతుకుతున్నాయ్. ఈ దర్యాప్తు చంద్రబాబు వరకూ చేరుతుందా? ఒకప్పుడు ముఖ్యమంత్రిగా
ఉన్న జయలలితను కోర్టు మెట్లెక్కించి అట్నుంచటే జైలు ఊచల వెనక్కు పంపిన పట్టుదల  చివరి వరకూ కొనసాగుతుందా???అనుమానమే...

మరి ఈ ఐటిదాడులు, ఈడీ సోదాలు ఏం సాధించనున్నాయ్...గతంలో నంద్యాలలో జరిగిన
ఉప ఎన్నికలో చంద్రబాబు కుమ్మరించిన కోట్ల సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి అడుగు పెట్టిన
క్షణం నుంచీ ఆబగా కూడబెట్టిన ఆత్రపు సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి గెలిచేందుకు
వ్యూహాలు రచిస్తున్నాడు చంద్రబాబు. బాబుగారికి ఎనిమిది దిక్కులా ఆర్థిక ప్రయోజనాలు కల్గించే
వ్యాపార, వ్యవహార, న్యాయ, రౌడీ వర్గాలు కమ్మగా కొమ్ముకాస్తున్నాయ్. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ధనబలం తన ప్రతాపాన్ని
చూపించి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇది గుర్తించే కేంద్రం తన పాచికలను విసిరింది. ఆర్థికంగా బాబును బలపరిచే
బినామీలపైకి విల్లు ఎక్కుపెట్టింది.

సుజనా చౌదరి, సిఎమ్.రమేష్, రేవంత్ రెడ్డి, మంత్రి నారాయణ వంటి
ఫైనాన్షియల్ ఎలిఫెంట్లను కట్టడి చేయడం ద్వారా చంద్రబాబుకు చెక్ పెట్టాలన్నదే కేంద్రం
ఆలోచన కావచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటకలో శివకుమార్ ను కంట్రోల్ చేసి కాంగ్రెస్ ఎన్నికల
ఖర్చుకు కామా పెట్టించినట్టు, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఆర్థిక బల ప్రదర్శనకు
అవకాశం లేకుండా చేసే వ్యూహంలో భాగమే ఇదంతా అంటున్నారు. బాబు ఫైనాన్స్ నెట్వర్క్
సామాన్యమైనది కాదు. దాన్ని నిలువరించకపోతే రానున్న ఎన్నికల్లో ధనబలమే తన బలాన్ని చూపుతుందని రాష్ట్ర
పరిస్థితి తెలిసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్న మాట. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ టిడిపి కూటమి ఎన్నికలకు
చంద్రబాబు భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమని చెప్పాడు. గత కర్ణాటక ఎన్నికల్లోనూ
కాంగ్రెస్ కు బాబు ఆర్థికంగానూ, ప్రచారపరంగానూ సాయం అందించాడు కూడా.

బాబుగారి బినామీల ఆస్తిపాస్తుల
కొండలను తవ్వుతారని తెలిసే కొంత కాలం నుంచీ చంద్రబాబు నాపై దాడులు చేస్తారు, తమ్ముళ్లూ సిద్ధంగా
ఉండండి...భయపడకండీ అంటూ ముందు నుంచే అందరికీ హెచ్చరికలు జారీచేసాడు. అసలే న్యాయవ్యవస్థ నుంచి
దర్యాప్తు సంస్థల వరకూ అన్నింటా బాబుగారి నిఘా వ్యవస్థలుగా పనిచేసే నమ్మకమైన బంట్లు
ఉన్నారయ్యె. జగన్ మోహన్ రెడ్డిపై కోర్టులో సాగుతున్న కేసుల గురించి అందరికంటే ముందే బాబుకు, ఆయనదైన మీడియాకూ ముందే
వార్తలు చేరిపోయే సౌలభ్యం ఉంది. కనుక కేంద్రం కదలికలు ఆమాత్రం ముందుగా ఆయనకు తెలియడంలో
ఆశ్చర్యపోయేదేం లేదు. ఈ సోదాలను సాకుగా చూపి చంద్రబాబు మరోసారి సెంటిమెంట్
డ్రామా, కుట్రలు చేస్తున్నారంటూ ఏడుస్తూ సింపతీ డ్రామకు తెరతీస్తున్నాడు. కేంద్రం కక్ష కట్టిందని
ఆక్రందనలు వినిపిస్తున్నాడు. అసలివి రాష్ట్రంపై జరిగే దాడులంటూ కథను కొత్తమలుపు
తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. లోకేష్ వంటి అతితెలివి మంత్రి ఇంకాస్త ముందుకెళ్లి
హోదా అడిగామని, కడప ఉక్కు అడిగామనే ఐటి దాడులు అంటూ తన అమాయకత్వాన్ని బైట పెట్టుకుంటున్నాడు. నిజానికి అక్రమాలు ఉంటే, చేస్తే అప్పుడు ఈ ఐటి
సోదాల గురించి, ఈడీ ఆరాల గురించి భయపడాలి. ఏమీ లేనప్పుడు తెలుగుదేశం అధినేతకు, ఆ ప్రభుత్వానికి దాన్ని
పట్టుకు వేళ్లాడుతున్న ఈ మంత్రిసామంతులకు ఇంత జడుపెందుకు? అంటే అవినీతి డొంక కదులుతోందని
అర్థమైంది. అందరి జాతకాలు బట్టబయలౌతాయన్న భయం మొదలైంది. అయితే ఇది అసలు మూలం
వరకూ చేరడం ప్రధానం. కానీ రాజకీయ చదరంగంలో అవసరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.  రాజధాని భూములు, భూ రిజిస్టర్లో మతలబులు, కబ్జాలు, కోటానుకోట్ల అంచనాల
పెంపులు, చెల్లింపులు, కమీషన్లు, కాంట్రాక్టులు వీటిపై లోతుగా దర్యాప్తు సాగుతుందా? అవినీతి కుంభస్థలాన్ని
కొట్టి అసలు ద్రోహులను, ఆర్థిక ఉగ్రవాదులను, అధికారం అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచిన ముఖ్యమంత్రి
అండ్ బృందాన్ని పట్టి, బోనులో నిలబెట్టే దాకా ఈ కథ సాగుతుందా? లేక నట్టనడి మధ్యలో
చంద్రబాబు కేసుల్లో స్టేల మాదిరిగా కథ కంచికి చేరిపోతుందా??

Back to Top