రోడ్డుపై కూర్చొని.. మహిళలతో మాట్లాడి...

కడప: యాత్ర మార్గంలో వైయస్ షర్మిల రోడ్డుపైనే కూర్చుని మహిళలతో ముచ్చటించారు. నందిపల్లి సమీపంలో మహిళలు భారీ సంఖ్యలో ఎదురేగి రోడ్డుపైనే కూర్చున్నారు. షర్మిల వారితో పాటు కూర్చుని మాట్లాడు.   వృద్దురాలు లేచి ‘‘నాకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆరోగ్యశ్రీ కిందికి రాదట’’ అని చెప్పింది. ‘ఈ ప్రభుత్వానికి ప్రాణాలంటేనే లెక్కలేదు. 108నే ఆపేశారు. జగనన్న రాగానే ప్రతి పేదవాడి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు’’ అంటూ షర్మిల ఆమెకు భరోసానిచ్చారు. నందిపల్లి సమీపంలో పులివెందుల జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ.. ‘‘ఒక్క ప్లేస్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి. ఈ కళాశాల వైఎస్ మానస పుత్రికగా పేరుగాంచింది. అలాంటిది అభివృద్ధికి నోచుకోకుండా పోయింది..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీ తరపున పోరాడుతాం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడతాం’’ అని షర్మిల వారికి హామీనిచ్చారు. తాళ్లపల్లి సమీపంలోని వేరుశనగ రైతుల వద్దకు వెళ్లిన షర్మిల వారి గోడు విని చలించిపోయారు. ‘‘కౌలు రైతులకు రుణాలు రావు. పంట నష్టపోతే పరిహారం అందదు. కనీసం ఎంత నష్టం వచ్చిందో కనుక్కునేందుకు అధికారులు రారు.. ఇలాంటి ప్రభుత్వం మనకు వద్దు. వైఎస్ ఉంటే ఈ నష్టాన్ని భర్తీ చేసేవారు’’ అని అన్నారు.

వైఎస్ వల్లే బతికిబట్టకట్టా..

దుగ్గన్నగారిపల్లి వద్ద నర్సింహారెడ్డి అనే విద్యార్థి షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఫస్టియర్ చదువుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాలు పోయే పరిస్థితి. కానీ 108 వల్ల సకాలంలో ఆసుపత్రికి చేరుకున్నా. చాలా ఖర్చయింది. సీఎం రిలీఫ్‌ఫండ్ కింద ఆ ఖర్చులన్నీ వైయస్ భరించారు. వైఎస్ వల్లే బతికిబట్టకట్టా’’ అని చెప్పారు.

రైతులపై కేసులు పెట్టిన ఘనత బాబుది..

పాదయాత్ర రాత్రికి వేములకు చేరుకుంది. అక్కడ భారీ జన సమూహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. తాను చూసిన వేరుశనగ రైతుల కష్టాలపై ఆవేదన చె ందానని, ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా, జగనన్నపై కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి తనతోపాటు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబు సీఎం అయితే ఇక ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భయపడుతున్నారు. కరెంటు చార్జీలు పెంచొద్దంటే రైతులను కాల్చిచంపిన ఘనత బాబుది. రైతు కుటుంబాలను పరామర్శించకుండా పోలీసులను పరామర్శించిన ఘనత ఆయనది. కరెంటు చార్జీల వసూళ్ల పేరుతో కేసులు పెట్టి రైతులను జైలులో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపినట్టుగానే.. ఇప్పుడు క రెంటు కూడా ఇవ్వకుండా చార్జీలు భారీగా పెంచిన ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపాలి..’’ అని పిలుపునిచ్చారు. వేముల సమీపంలో ఏర్పాటు చేసిన బస స్థలానికి రాత్రి 7.50కి షర్మిల చేరుకున్నారు. రెండోరోజు మొత్తం 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

షర్మిలతో పాటు నడచిన విజయమ్మ..

వైయస్ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు  విజయమ్మ రెండోరోజు కూడా పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మధ్యాహ్న విరామ సమయానికి కొద్దిగా ముందు పాదయాత్ర నుంచి పక్కకు వచ్చిన విజయమ్మ.. తిరిగి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30 వరకు పాదయాత్రలో నడిచారు. ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఆరోగ్యం దెబ్బతింటుందని, కారులో రావాలని సూచించగా వేముల వరకు కారులో వచ్చారు. వేముల బహిరంగ సభలో విజయమ్మ కూడా పాల్గొన్నారు.

Back to Top