వర్షంలోనూ సాగుతున్న ప్రజా సంకల్పం

పుడమిని ప్రేమించే మనిషికి ప్రకృతి గొడుగౌతుంది. అందుకే నాడు రాజన్న నేడు ఆయన బిడ్డ ఈ ఇద్దరికకీ మండే ఎండైనా, కురిసే వానైనా వారి అడుగులకు ఆటంకం కాలేకపోయాయి. శ్రమజీవుల కష్టాలను పంచుకోవాలనుకునే మనుషులు కనుకే వారి చెమట చుక్కలకు నేల చల్లబడుతోంది. ఆ అడుగుల సవ్వడికే పుడమి పులకరిస్తోంది. ఆరు మాసాలుగా ఆ నాయకుడు నడుస్తున్నాడు. అడుగు అడుగులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. రోజు రోజుకూ ఆ నడక కొత్త దారులు వెతుకుతోంది. అలుపులేదు. అలసట లేదు. ఆత్మీయంగా పిలిచే పిలుపులో ఇసుమంతైనా విసుగనేది లేదు. అందుకే ఆయన ప్రజా సంకల్పయాత్ర  ఓ జైత్ర యాత్ర. 

పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర అటు భానుడి భగభగలను చూసింది. ఇటు భీకర వర్షాన్నీ చూసింది. అంతేనా అల్లరి మూకల చిల్లర పనులను చూసింది. ఒకడు ఆ నాయకుడు నడిచిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేస్తానన్నాడు. ప్రజలంతా ఆ పని చేసిన వాళ్లను శుంఠలన్నారు. ఆ నీళ్లను నెత్తినైనా చల్లుకోమని బుద్ధి చెప్పారు. మరొకడు ఆ యువనేత నడిచే దారిలో తేనెతుట్టెను కొట్టి తేనెటీగలను ఉసిగొల్పాడు. అయినా ప్రతిపక్ష నేత తన నడకను ఆపలేదు. కుట్రలతో, కుతంత్రాలు, కేసులు, జైళ్లు...ఇన్ని ముళ్ల కంచెలు దాటిన వ్యక్తికి తేనెటీగల దండుకు దడుస్తాడా? అరచేతులైనా అడ్డుపెట్టుకోకుండా ఆ యోధుడు ముందుకే సాగాడు.  విమర్శల వడగళ్లవానను ఎదుర్కొన్నవాడు, కక్ష సాధింపుల తుఫాన్లకు ఎదురెళ్లినవాడు, సమస్యల నడిసంద్రంలో ఒంటరిగా ఈదినవాడు...వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వెన్నుపోటు పొడిచిన సొంత పార్టీ నేతలను కూడా పరుషంగా ఒక్కమాట అనని వ్యక్తిత్వం అతడిది. రాజకీయాలంటే భవిష్యత్ తరాలు ఛీ అనకూడదనే కోరిక అతనిది. అందుకే ప్రజల్లో నాయకుడిపై ఉండాల్సిన నమ్మకాన్ని అతడు పోగు చేస్తున్నాడు. ఒక్కడే వేయి మంది నాయకులు అందించే ధైర్యాన్ని ప్రజల్లో పెంచుకొస్తున్నాడు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర భారీ వర్షంలోనూ కొనసాగుతోంది. ఆయనే కాదు ఆయన వెంట జన సందోహం కూడా అదే హోరు వానలో జోరుగా నడక సాగిస్తోంది. ప్రజల కోసం ఓ నాయకుడు ఎండవానలను లెక్క చేయకుండా  పాదయాత్ర చేస్తుంటే, ఆ నాయకునికి వెన్నుదన్నుగా అదే ప్రజలు తమ పాదం కదుపుతున్న అపూర్వ ఘటనకు తెలుగు రాష్ట్రమే వేదికైంది. వర్షం సాక్షిగా ఓ మహా ప్రజాభిమానం ఆవిష్కృతం అయ్యింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top