పోలీసు రాజ్యం

  • తెలుగుదేశం కార్యకర్తల్లా మారిన పోలీసులు
  • గిరిజనంపై అక్రమ కేసులు, అరెస్ట్ లు, బెదిరింపులు
  • కావాలనే వైయస్సార్‌సీపీ నాయకులపై కేసులు 
  • భగ్గుమంటున్ను ఆదివాసీలు
  • ప్రభుత్వం ప్రజల పక్షమా? పెట్టుబడిదారుల పక్షమా?
  • గ్రానైట్ తవ్వకాల అనుమతులు రద్దుచేసేవరకు పోరాడతాం
  • వైయస్సాసీపీ నేతల స్పష్టీకరణ
పార్వతీపురం : పార్వతీపురంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. అధికార పార్టీ నాయకుల అక్రమాలు, అవినీతిపై ప్రశ్నించినా, అడ్డగోలు అనుమతులను వ్యతిరేకించినా... అటువంటి వారిపై ఖాకీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఖాకీ యూనిఫామ్‌ వేసుకొని టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు తమదైన శైలిలో టీడీపీ దౌర్జన్యాన్ని వ్యతిరేకించిన వారిపై విరుచుకుపడుతున్నారు. దీనిలో భాగంగా  ఆదివారం వైయస్సార్‌ సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త అరెస్ట్, అడవుల్లో తిప్పడం, ఆ రాత్రంతా పోలీస్‌స్టేషన్లను మార్చి మార్చి హింసించడంతో పాటు ఐపీసీ సెక్షన్లను వేయడం తదితర సంఘటనలు పాఠకులకు తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఆయా గ్రానైట్‌ బాధిత గ్రామాల గిరిజనులకు భయం కల్పించేలా సాయుధులైన పోలీసు బలగాలను మొహరించడంతో పాటు దొరికిన వారిని దొరికినట్లు ఎత్తుకెళ్లడం జరుగుతున్నాయి. పోలీసు చర్యలతో బోడికొండ బాధిత గిరిజన గ్రామాలు భగ్గుమంటున్నాయి. 
 
 బాధిత గిరిజన గ్రామాల్లోకి వెళ్లి గిరిజనులను అరెస్ట్‌లు చేసేందుకు పోలీసులు సమాయత్తమవుతున్న తరుణంలో, అక్కడ గిరిజనులు కూడా బతుకులు పోగొట్టే గ్రానైట్‌ కంపెనీ వచ్చాక, ఇక చావో...రేవో తేల్చుకుంటామనే ధోరణిలో సన్నద్ధమవుతున్నారు.  దీంతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల పొలిమేరల్లోకి వెళ్లకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.  గిరిజనులకు ఆధారమైన నీటిని అడ్డుకుంటూ...చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై కనీస చర్యలకు ఉపక్రమించకుండా దానిని అడ్డుకున్న గిరిజనులు, పోరాట కమిటీ నాయకులపై  విరుచుకుపడడంపై గిరిజనులు మండిపడుతున్నారు. 

పార్వతీపురం టౌన్‌ : బోడికొండ, బడిదేవర కొండల వద్ద జరుగుతున్న ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలు పార్టీలు,  రైతు కూలీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. అటవీ హక్కులను తుంగలో తొక్కి చట్టాలను విస్మరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పాలకులు అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని, పోరాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పోలీసులు కావాలనే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణకు విరుద్దంగా అడ్డగోలు అనుమతులు ఇవ్వడమే కాకుండా పోరాడుతున్న వారిపై తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కేసులు బనాయించడం దారుణమన్నారు. 

గిరిజనుల పక్షాన పోరాడేవారిపై అక్రమ కేసులు బనాయించడం తగదని వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. గుండెనొప్పితో బాధపడుతూ పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్సార్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ను  పరామర్శించారు. ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ జి.నాగభూషణరావుతో మాట్లాడి ప్రసన్నకుమార్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బెల్లాన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పక్షమా లేక పెట్టుబడిదారుల పక్షమా చెప్పాలని డిమాండ్‌ చేశారు. గిరిజనుల పొట్టకొట్టేలా బోడికొండ, దేవరకొండలపై గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులివ్వడం విచారకరమన్నారు. కొండలు కనుమరుగైతే భూములకు సాగునీరు అందదని గిరిజనులు తిరగబడ్డారన్నారు. వారికి మద్దతిచ్చిన వైయస్సార్‌ సీపీ, వామపక్షాల నాయకులపై కేసులు పెట్టడం తగదన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అవసరమైతే జిల్లా, రాష్ట్ర నాయకత్వం బోడికొండ, బడిదేవర కొండవద్దకు వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఒక చిన్న సంఘటనలో అరెస్టుచేసిన వ్యక్తిని రెండు రోజుల పాటు ఎక్కడ దాచారో తెలపకుండా కనీసం ఆహారం కూడా పెట్టకుండా పోలీసులు హింసిస్తుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజాప్రతినిధులను ఉగ్రవాదుల్లా అర్ధరాత్రి వేల అడవుల్లో తిప్పడం ఏమటని ప్రశ్నించారు. పాలకులు కాంట్రాక్టర్లకు  కొమ్ముకాస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండడం విచారకరమన్నారు. బోడికొండ, బడిదేవర కొండల తవ్వకాల అనుమతులు రద్దు చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
 
 
Back to Top