జల్సా నాయుడు

– పేద రాష్ట్రానికి ధనిక ముఖ్యమంత్రి 
– సొంత అవసరాలకు రూ. 100 కోట్లకుపైగా ఖర్చు 
– నిరుద్యోగ భృతి బకాయి రూ. 1.15 లక్షల కోట్లు 
– ఓట్లు కురిపించిన పథకాలకే బాబు తూట్లు 

గెలవాలంటే ప్రజలను నమ్మించాలి.. సీఎం అంటే జల్సాలు చేయాలి.. ఇదీ చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం. రాష్ట్రం మొత్తం చంద్రబాబు తన అత్తగారి సొత్తులా ఫీలై ప్రజాధనాన్ని విపరీతంగా కొల్లగొడుతున్నాడు. ఆయన సొంత ఖర్చులకు జనం సొమ్మును నీళ్లలా ఖర్చు చేసుకుంటాడు. అదే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రతిపక్షాలు అడిగితే మాత్రం మనది పేద రాష్ట్రం ప్రజలు సర్దుకుపోవాలి.. ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఉచిత సలహాలిస్తాడు. ఇది బాబు లూటీ కమ్ చీటింగ్ ఫార్ములా 

‘నిరుద్యోగ భృతి’తో ఓట్లేయించుకుని..
బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు. ప్రతి వర్గాన్ని ప్రభావితం చేసేందుకు చంద్రబాబు అబద్ధపు హామీలతో ప్రజలను బురిడీ కొట్టించాడు. అధికారంలోకి వచ్చాక ఓట్లు గుమ్మరించిన ఆ హామీలను గాలికొదిలేశాడు. ముఖ్యంగా రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ.. నిరుద్యోగ భృతి హామీలు చంద్రబాబు ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాన కారణమయ్యాయి. అమలుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నాడని ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ అప్పుడే చెప్పారు. అది నిజం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిచి మూడేళ్లయింది. బేషరుతుగా రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అంత అత్యాశ పనికిరాదని జనాన్ని చీదరించుకుని మాట్లాడాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన మనిషి పది వేలు రుణంగా ఇస్తానని.. అది కూడా మూడు విడతలుగా ఇస్తానని సిగ్గు లేకుండా మాటతప్పాడు. ప్రతి ఇంటికీ రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఒక్కరికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. 

ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికే 33 నెలలు గడిచింది. రాష్ట్రంలోని 1.75 కోట్ల కుటుంబాలకు నెలకు 2 వేల వంతున 33 నెలలకుగాను లక్షా 15 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. నిజానికి చంద్రబాబు నిరుద్యోగభృతి హామీ ఇవ్వకపోయుంటే గెలిచి అవకాశం దాదాపు ఉండకపోయేది. ఏ హామీలతోనైతే ఓట్లేయించుకుని గెలిచి గద్దెనెక్కాడో.. ఆ ఓట్లేసిన వారిని మాత్రం నిండా ముంచేశాడు. ఏరు దాటక ముందు ఓడ మల్లన.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు.. ఎన్నికల హామీలు నెరవేర్చలేదే అని ప్రశ్నించిన వాళ్లపై దాడులకు తెగబడుతున్నారు.  రుణమాఫీ విషయంలో కోటయ్య కమిటీని అడ్డం పెట్టుకుని ఎలాగైతే రైతులకు అన్యాయం చేశావో... ఇప్పుడు నిరుద్యోగులను కూడా మోసం చేయవద్దని వైయస్‌ జగన్‌ ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోనైనా హామీ నెరవేర్చాలాని తాజాగా మరోసారి ముఖ్యమంత్రికి వైయస్‌ జగన్‌ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల మందు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీని నెరవేర్చాలని కూడ డిమాండ్‌ చేశారు. 

బాబు ఆడంబరాలకు పేదరికం అడ్డురాలా
గెలిచిన క్షణం నుంచి ఏపీ పేద రాష్ట్రం అని ఊదరగొడుతున్న చంద్రబాబు తన అవసరాలకొచ్చే సరికి ఏ మాత్రం సర్దుకోవడం లేదు. పైగా ఒక రూపాయి ఖర్చుతో పోయేదాన్ని కూడా పది రూపాయలు పెట్టి మరీ జల్సాలకు మరిగాడు. జనం సొమ్మును ఖర్చు చేయడంలో ఏమాత్రం వెనకాడటం లేదు. దావోస్‌ సద్సుకు ఆహ్వానం లేకపోయినా రూ. 6.5 కోట్లు పెట్టి  స్టాల్స్ కొంటాడు. సొంత డబ్బా కొట్టుకోవడానికి రూ. 14 కోట్లతో మహిళా పార్లమెంట్‌ సదస్సు నిర్వహిస్తాడు. కాకపోతే ఇందులో స్థానిక మహిళా ప్రతినిధులను అనుమతించరు. భాగస్వామ్య సదస్సుల పేరిట కోట్లు ఖర్చు చేస్తాడు. పెట్టుబడుల కోసమంటూ దేశాలన్నీ ప్రత్యేక విమానాల్లోనే తిరిగొస్తాడు. అయినా ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. ఒక్క కంపెనీ నెలకొల్పనూ లేదు. ఆనాడు వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా పెట్టుబడుల కోసం ఏ దేశమూ పర్యటించలేదు. ఎక్కడ భాగస్వామ్య సదస్సు నిర్వహించలేదు. కానీ ఎక్కడా కూడా నిధుల కొరత లేదు. అభివృద్ధి ఆగలేదు.. ఉద్యోగాల కోసం యువత ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు. అదో స్వర్ణయుగంగా నడిచింది. 

క్యాంపు కార్యాలయాలకు రూ. 80 కోట్లు 
బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఐదు క్యాంపు కార్యాలయాలు మార్చాడు. తొలుత హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహాన్ని క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దారు. దానికి రూ. 15 కోట్లు ఖర్చు చేశాడు. ఆ తర్వాత జూబ్లిహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 24, 65లలో క్యాంపు కార్యాలయాలుకు రూ. 5 కోట్లు ఖర్చు చేశాడు. బాబుకు మదీనాగూడలో ఓ ఫాంహౌస్‌ ఉంది. ప్రభుత్వం దీన్ని క్యాంపు కార్యాలయంగా గుర్తించి మరమ్మతుల కోసం 3.5 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత 2015 జూన్‌ 8న విజయవాడలో మరో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి రూ. 21 కోట్లు ఇరిగేషన్‌ శాఖ నిధులు కేటాయించారు. ఆర్టీసీ శాఖ నిధుల నుంచి రూ. 5.50 కోట్లతో అధునాతన బస్సు కొనుగోలు చేశారు. విజయవాడ సమీపంలోని లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను నివాసం, క్యాంపు కార్యాలయంగా మార్చి దానికి రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. 

ఉండవల్లిలో హెలిప్యాడ్‌కు రూ. 95.90లక్షలు
ఉండవల్లిలో హెలీప్యాడ్‌ నిర్మాణానికి 95.90 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. కాగా ఇప్పటికే వెలగపూడిలో రూ. 10 లక్షలతో హెలీప్యాడ్‌ నిర్మించారు. విజయవాడలో జరిగే కార్యక్రమాలకు చంద్రబాబు సచివాలయం నుంచి హెలిక్యాఫ్టర్‌లోనే వెళ్తుంటారు. చంద్రబాబు నివాసం ఉండే ఇంటి నుంచి వెలగపూడి సచివాలయం వరకు ఆరు కిలోమీటర్ల లోపే ఉంటుంది. మళ్లీ ఉండవళ్లి క్యాంపు కార్యాలయం వద్ద వీవీఐపీల కోసం హెలీప్యాడ్, ఇతర అవసరాల కోసం ఇప్పుడు రూ. 95.90 లక్షలు కేటాయించారు. 
Back to Top