జగనన్న ఎప్పుడు వస్తాడమ్మా...!

నల్లగొండ : 'జననేత జగనన్న ఎప్పుడు బయటకు వస్తాడమ్మా అంటూ పలకరింపులు.. మా రాజన్న పోయాక బతుకులు కష్టమైపోయాయంటూ వృద్ధుల ఆవేదన.. ఈ ప్రభుత్వం పింఛన్లు తీసేసిందని.. రేషన్‌కార్డు ఇవ్వడంలేదని బాధలు వెళ్లబోసుకున్న జనం ఒక పక్కన.. శ్రీమతి షర్మిలపై ప్రేమాభిమానాలు కురిపిస్తూ హార్దికంగా స్వాగతం పలుకుతున్న అభిమానజనం మరో వైపు... గడచిన ఆరు రోజులుగా నల్గొండ జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ఉత్సాహంగా మును ముందుకు సాగిపోతోంది. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో శ్రీమతి షర్మిల స్థానిక ప్రజలతో కలివిడిగా కలిసిపోతున్నారు. వారి బాధలు ఓపిగ్గా వింటున్నారు. వారికి కొండంత ధైర్యాన్నిస్తున్నారు. యాత్ర సాగుతున్న గ్రామాల్లో ఆమెకు అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతున్నారు.

బుధవారం ఉదయం‌ నల్గొండ నియోజకవర్గంలోని కనగల్ నుంచి‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర మొదలైంది. అక్కడి నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని హాలియా మండలం రామడుగు సమీపం ‌వరకూ కొనసాగింది. బుధవారంనాడు ఆమె నడచిన 15.8 కిలోమీటర్ల పొడవునా పలువురు తమ సమస్యలు నివేదిస్తూ ఎదురొచ్చారు.  శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికి బత్తాయి తోటను నరుక్కున్న యజమాని వచ్చి తన వెతలు చెప్పుకున్నాడు. అయిదారేళ్లు పెంచిన తోటలను, నీళ్లు లేక కన్నీళ్లు వస్తుండగా నరికేస్తున్నామని గోడు చెప్పుకున్నాడు. బత్తాయి తోటలు పెంచేందుకు తాము ఎంత కష్టపడుతున్నదీ చెప్పుకున్నాడు.

సుమారు 20 నిమిషాల పాటు బత్తాయి రైతు చెప్పిన సమస్యలను శ్రీమతి షర్మిల ఓపికగా విన్నారు. జగనన్న విడుదలై త్వరలోనే రాజన్న రాజ్యం తెస్తారని, మీ కష్టాలు తీరుస్తారని భరోసా ఇచ్చారు. రూ.3 వేల కోట్లతో జగనన్న ఏర్పాటు చేసే ప్రత్యేక నిధి రైతుల కన్నీళ్లు తుడుస్తుందని ఓదార్చారు.

‌కనగల్ మండల సరిహద్దులోని గౌరారం రచ్చబండలోనూ ప్రజలు తమ‌ పడుతున్న అవస్థల గురించి చెప్పుకున్నారు. మహిళా రుణాలు, పావలా వడ్డీ, వంట గ్యాసు లాంటి పలు సమస్యలు వివరించారు. అభయహస్తం లబ్ధిదారుల వయస్సు తగ్గించి ఇబ్బంది పెడుతున్నారని, సమభావన సంఘాల్లో అన్ని కులాల మహిళలు ఉన్నా, కేవలం ఎస్సీ వర్గానికే పింఛన్ ‌పథకం వర్తింపజేస్తున్నారని చెప్పారు. జగనన్న స్థాపించే రాజన్న రాజ్యంలో మీ కష్టాలన్నీ తీరుతాయని శ్రీమతి షర్మిల వారికి హామీ ఇవ్వడంతో రచ్చబండలో పాల్గొన్న ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ప్రజల సమస్యలపై గళమెత్తాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కయిన తీరుపై శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. కేవలం చంద్రబాబు తీరువల్లే రాష్ట్రంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఇపుడు అబద్ధపు మాటలతో జనం ముందుకే వస్తున్నారని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలని, వాటిని నమ్మొద్దని కోరారు. గ్రామాలు, రైతులను పట్టిపీడిస్తున్న కరెంటు సమస్యపైనా పలువురు శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. ఒక్క బల్బు వాడుతున్న తమకు రూ.300 వరకూ బిల్లు వస్తోందని కొందరు గృహిణులు గోడు వెళ్లబోసుకున్నారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో‌ షర్మిలకు ఘనస్వాగతం:
మధ్యాహ్నం భోజన విరామం తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం మారేపల్లికి శ్రీమతి షర్మిల పాదయాత్ర చేరింది. గ్రామ సరిహద్దుల్లోనే నియోజకవర్గ నాయకులు మల్లు రవీందర్‌రెడ్డి, విరిగినేని అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో ఎదురేగి శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. అన్నారం క్రాస్ రోడ్డు మీదుగా, యాచారం చేరుకు‌న్న శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తనకు తల్లిదండ్రులు లేరని ఆవేదన చెందిన ఓ విద్యార్థినిని చదివిస్తామని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. మరో వికలాంగ యువకునికి ‌మూడు చక్రాల సైకిల్ ఇస్తామని అభయమిచ్చారు.
Back to Top