అరుదైన వ్యాధితో బాధపడుతున్న 16ఏళ్ల బాషాకు సీఎం వైయ‌స్ జగన్ భరోసా

ప‌ల్నాడు జిల్లా: 16 ఏళ్ల షేక్‌ హుస్సేన్ బాషా ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం కొమ్మలపాడు గ్రామ వాసి. తండ్రి బేల్దారీ పని, తల్లి కూలీ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఏడాది క్రితం చెంప వాపుతో మొదలైన వ్యాధి (ఒసిఫైయింగ్ ఫైబ్రోమా) వారాల వ్యవధిలోనే మహమ్మారిలా మారింది. ఏదో వాపు అయి ఉంటుందనుకున్న బాషా తల్లితండ్రులు డాక్టర్‌కు చూపించగా వారు ఆపరేషన్ చేసి కణితి తొలగించారు. ఆపరేషన్‌ కోసం పదిలక్షలు ఖర్చు అయ్యాయి. ఇల్లు అమ్ముకుని మరీ కొడుకు ఆపరేషన్ చేయించారు బాషా తల్లితండ్రులు. కానీ ఆరు మాసాల వ్యవధిలోనే ఆ వాపు మరింతగా పెరిగిపోయి ఎడమ చెంప, తలవెనుక భాగానికి విస్తరించింది. కొద్ది నెలల క్రితమే బాషా తండ్రి కూడా లివర్ ఆపరేషన్ జరిగింది. ఒక పక్క కొడుకు కదలలేని స్థితిలో, భర్త అనారోగ్య స్థితిలో ఉండటంతో బాషా తల్లి వాళ్లని చూసుకుంటూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇంట్లో పెద్ద కొడుకు సంపాదనమీదే ఇంటిల్లిపాదీ ఆధారపడి ఉంది. అప్పులపాలై, కొడుకు ఆపరేషన్‌కు ఏ దారీ లేక సీఎం వైయ‌స్‌ జగన్‌ సహాయం అర్థిస్తూ మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చారు బాషా కుటుంబం. జగనన్నే మమ్మల్ని ఆదుకుంటాడని నమ్ముతున్నాం అంటున్నారు. వారి పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి బాషాకు సహాయం చేయాల్సిందిగా ఆరోగ్యశ్రీ అధికారులకు సూచించారు.
 

Back to Top