తాడేపల్లి: తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటుచేసే స్థోమత ప్రభుత్వానికి లేదా అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సీఎం చంద్రబాబుని నిలదీశారు. అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే చంద్రబాబు, ఏడాదిన్నరలో రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడని.. కానీ అమరజీవి విగ్రహ ఏర్పాటుకు మాత్రం చందాలు వసూలు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా డీపీఆర్ కోసమే రూ. 11 కోట్లు చేసిన ప్రభుత్వానికి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయడం భారమైపోయిందా అని ప్రశ్నించారు. రామోజీ సంస్మరణ సభల కోసం ఖర్చు చేయడంలో లేని ఇబ్బంది పొట్టిశ్రీరాములు విగ్రహం ఏర్పాటుచేయడానికి వచ్చిందా అని మండిపడ్డారు. ఆయన ప్రపంచంలో ఉన్న యావత్ తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తే ఆర్యవైశ్యుల నుంచి చందాలు వసూలు చేసి విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ విధానాలను మాజీ సీఎం వైయస్ జగన్ ఖండించారని, వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పొట్టి శ్రీరాములుగారి గుర్తుగా నవంబర్ 1న నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మార్చిన చంద్రబాబుకి, ఆయన విగ్రహానికి పూలమాల వేసే అర్హత లేదని వైయస్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. 2019లో వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించేలా జీవో ఇచ్చి ఐదేళ్లపాటు కొనసాగిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆపేయడం దారుణమన్నారు. తెలుగుజాతి ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మరువలేమని, వైయస్ జగన్ నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయన చిత్రపటం వద్ద దీపాలు వెలగించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పుత్తా శివశంకర్‌రెడ్డి, కొండా రాజీవ్ గాంధీ, వివిధ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే... ● అమరజీవి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం - వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శ్రీపొట్టి శ్రీరాములు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన త్యాగం రూపంలో తెలుగు జాతి ఉన్నంతకాలం నిలిచే ఉంటారు. తెలుగు ప్రజలంతా ఒక్కటిగా కలిసుండాలన్న ఆయన ఆశయాలను గత ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ హయాంలో మాజీ సీఎం వైయస్ జగన్ గారు తన పాలన ద్వారా చేసి చూపించారు. కులమతాలకు అతీతంగా అందర్నీ ఒక్కటిగా చూసి అవకాశాలు, సంక్షేమం అందించి అండగా నిలిచారు. ఆ మహనీయుని ఆశయాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ● చందాలు వసూలు చేసి విగ్రహం పెట్టుకోవాలా? - మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలుగు ప్రజలంతా ఒక్కటిగా కలిసుండాలనే సంకల్పంతో శ్రీపొట్టి శ్రీరాములు గారు నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే, చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో ఆ త్యాగానికి విలువ లేకుండా చేశాడు. ఆయన త్యాగానికి గుర్తుగా నవంబర్ 1ని ఆంధ్రప్రేదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఎన్నోదశాబ్దాలుగా నిర్వహిస్తుంటే, చంద్రబాబు దాన్ని కూడా మార్చేసి ఆయన్ను అవమానించాడు. వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక తిరిగి నవంబర్ 1ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా గుర్తిస్తూ జీవో ఇచ్చి అధికారంలో ఉన్న ఐదేళ్లూ కొనసాగించారు. కానీ 2024 కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ దాన్ని మార్చేశారు. ఇలా పదే పదే అమరజీవి ఆశయాలను, త్యాగాన్ని తృణప్రాయంగా తీసేస్తూ ఆయన్ను అవమానిస్తున్న చంద్రబాబు, ఆయనకు విగ్రహం పెడతానని కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పేరుతో డీపీఆర్ చేయడానికే కూటమి ప్రభుత్వం రూ. 11 కోట్లు ఖర్చు చేసింది. కానీ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్వాగం చేసిన అమరజీవి విగ్రహం ఏర్పాటు చేయాలంటే చందాలు వసూలు చేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు. ఏడాదిన్నరలో రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు, పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటును ప్రభుత్వానికి భారంగా భావిస్తున్నాడు. ఆయన విగ్రహం పెట్టే స్థోమత కూటమి ప్రభుత్వానికి లేదా? ఆయన తెలుగు ప్రజలందరి ఐక్యత కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే, ఆర్యవైశ్యుల కోసమే ప్రాణ త్యాగం చేసినట్టు వారిని పిలిచి మీటింగ్‌లు పెట్టించి చందాలు అడగడం సిగ్గుచేటు. ఆ మహనీయుని త్యాగాన్ని రోడ్డుపాలు చేశారు. ఇలాంటి చంద్రబాబుకి పొట్టి శ్రీరాములుగారి విగ్రహానికి పూల మాలవేసే అర్హత కూడా లేదు. నెల్లూరు జిల్లాకు శ్రీపొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి మాజీ సీఎం వైయస్ జగన్ ఆయన్ను గౌరవిస్తే, అమరావతి కోసం రూ. లక్ష కోట్లు వెచ్చిస్తామంటున్న చంద్రబాబు మాత్రం విగ్రహం ఏర్పాటు కోసం చందాలు వసూలు చేసుకోమంటునడం ఆయన్ను అవమానించడమే. ప్రభుత్వం ద్వారా చేయాల్సిన కార్యక్రమాలను చందాలు వసూలు చేసి చేయడాన్ని వైయస్ జగన్ గారు ఖండిస్తున్నారు. ఇలాంటి వాటిని వైయస్ఆర్‌సీపీతీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ● పొట్టి శ్రీరాములుని చంద్రబాబు అవమానిస్తున్నారు వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలుగు మాట్లాడే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తన ప్రాణాలను సైతం అర్పించిన పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఎప్పటికీ మరువలేము. అలాంటి మనిషికి నివాళులు అర్పించడం తెలుగు ప్రజల విధి. చంద్రబాబు నేతృత్వంలోని గత తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పటి కూటమి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని పూర్తిగా విస్మరించి ఆయన్ను అవమానిస్తోంది. తెలుగు జాతి మొత్తం కలిసుండాలని ఆ మహనీయుడు ప్రాణత్యాగం చేస్తే, సీఎం చంద్రబాబు మాత్రం పదవీ వ్యామోహంతో రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ప్రాంతీయ, కుల, మత విబేధాలు రెచ్చగొట్టి విభజనకు ఉసిగొల్పడం సిగ్గుచేటు. 2019లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆంధ్రులు ఎక్కడున్నా గొప్పగా ఎదగాలని వైయస్ జగన్ గారు ఎంతగానో తపించి ప్రోత్సహించారు.