ఇప్పుడు అదే ప్రశ్న తెలుగు నాట వినిపిస్తోంది. తెలుగు ప్రజలకు కష్టం వచ్చి పడింది. ఎవరితో చెప్పుకోవాలా అన్న దిగులు కలుగుతుంది. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవటం మాట అటుంచి కనీసం ఏమైందని పలకరించే దిక్కు లేకపోతే మాత్రం తప్పకుండా కళ్ల నీళ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు రైతు గుండె పగులుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు రాష్ట్రమంతా పర్యటించారు. రైతులెవరూ అప్పులు తిరిగి కట్టవద్దని, నెగ్గితే రుణాలన్నీ మాఫీ చేస్తామని పదే పదే చెప్పారు. బాబు వస్తారు, అన్ని అప్పులు రద్దయిపోతాయన్న ఆశతో రైతాంగం మూకుమ్మడి గా ఓట్లేసి గెలిపించారు. గెలుస్తూనే మొదటి పనిగా రైతుల రుణమాఫీ చేస్తామని ప్రమాణ స్వీకారం వేదికగా ప్రకటించారు. దీంతో తమ అప్పులన్నీ తీరిపోయినట్లుగా, కష్టాలన్నీ గట్టెక్కినట్లుగా రైతులు భావించారు.కానీ అసలు కష్టాలు అప్పటినుంచే మొదలయ్యాయి. రోజులు గడుస్తున్నాయి కానీ రుణ మాఫీ మీద స్పష్టత లేకపోయింది. సాఫ్టు వేర్లు రూపొందించారు, మళ్లీ మళ్లీ కాగితాలు పెట్టించారు. కానీ ప్రయోజనం లేదు. చంద్రబాబు అధికారం చేపట్టిన కొన్ని రోజులకు అంటే 2014, జూన్ 30వ తేదీన బ్యాంకర్ల సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ ఏడాది మార్చి 31 నాటికి రూ. 87,612 కోట్ల రూపాయల మేర వ్యవసాయ రుణాలు ఉన్నాయని బ్యాంకర్లు చంద్రబాబుకి నివేదించాయి. ఆ డబ్బులు ఏవో విడుదల చేస్తే రుణాలన్నీ రద్దు చేయటానికి వీలవుతుందని పరోక్షంగా వివరించాయి. కానీ చంద్రబాబు నుంచి ఎటువంటి సంకేతం అందలేదు.అప్పుడైనా ఎంత మేర రుణాలు మాఫీ అవుతాయి, లేదా ఎంత మేర ఇబ్బంది ఉంటుంది అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు అప్పులు తిరిగి కట్టలేదు. దీంతో తర్వాత సీజన్ లో అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించటం మొదలెట్టాయి. ఇటు అప్పు తీరిందో లేదో తెలియదు, తిరిగి కట్టాలో మానాలో అర్థం కాదు. పంట కు అప్పు దొరికే మార్గాలు మూసుకు పోయే పరిస్థితి. ఈలోగా నెలలు గడిచాయి. ఆరునెలల నాటికి అంటే సెప్టెంబర్ 30 నాటికి ఈ అప్పులు తడిసి మోపెడై రూ. 99, 555 కోట్లకు చేరుకొన్నాయి. వ్యవసాయ రుణాల విషయంలో పంట సమయానికి అప్పు తిరిగి కడితే వడ్డీ లేకుండా, లేదా నామమాత్రపు వడ్డీతో బ్యాంకులు కట్టించుకొంటాయి. కానీ, చంద్రబాబు మొత్తం అప్పులన్నీ రద్దు చేస్తారు కదా అని రైతులు ఊరుకొన్నారు. గడువు దాటగానే బ్యాంకులు అపరాధ రుసుముతో చక్ర వడ్డీలు విధించటం మొదలెట్టాయి. అప్పటి దాకా ఉచిత వడ్డీ లేదా పావలా వడ్డీ ఉండే రుణాలకు ఒక్కసారిగా 14శాతం దాకా వడ్డీ పడిపోయింది. అసలు, వడ్డీ కలిసి భారీ మొత్తంగా మారటం మొదలైంది. ఈ లోగా సమయం గడిచింది. ఇటు రుణమాఫీ కాకపోవటంతో వడ్డీల రూపంలో రైతులపై పడిన అదనపు భారం రూ. 13, 997 కోట్లకు చేరింది. మొత్తం మీద లక్ష కోట్లకు అటూ ఇటూగా మొత్తం అప్పులు పేరుకొని పోయినట్లుగా అర్థం అవుతోంది. అయితే ఈ రెండు బడ్జెట్ల లో కలిపి చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది మాత్రం కేవలం రూ. 6,840 కోట్లు. దీంతో నూటికి పది మందికి కూడా పూర్తిగా రుణాలు మాఫీ కాలేదన్న సంగతి స్పష్టంగా అర్థం అవుతుంది.ఒక వైపు రుణ మాఫీ కాకపోవటం, మరో వైపు బ్యాంకులు వడ్డీల మీద వడ్డీలు వేస్తుండటం, తిరిగి అప్పు దొరికే పరిస్థితి లేక వడ్డీవ్యాపారుల దగ్గరకు వెళితే చక్ర వడ్డీలు వసూలు చేయటంతో రైతన్న చక్ర బంధనంలో ఇరుక్కొని పోయారు. దీంతో కనిపించిన వారందరికీ గోడు వెళ్ల బోసుకొంటూనే ఉన్నారు. సరిగ్గా ఇంతటి నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు చివరకు హైదరాబాద్‌లోని పాలన కు గుండె కాయవంటి సచివాలయానికి తరలి వచ్చారు. రుణమాఫీ గురించి మొర పెట్టుకొందామని వస్తే చంద్రబాబు ప్రభుత్వం వాళ్లను చాలా సేపు బయటే ఆపేసింది. భద్రతాధికారులు ముప్పు తిప్పలు పెట్టాక, చివరకు సచివాలయంలోకి వదిలారు. మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ వాళ్లను కలవటానికి ఇష్ట పడలేదు. చివరకు ప్రణాళిక విభాగంలోని కాల్ సెంటర్ కు చేరుకొన్న రైతుల్ని అక్కడి ఉపాధ్యక్షుడు మాట్లాడి పంపించారు. అక్కడి వివరణ ప్రకారం రుణ మాఫీకి ఉన్న సవాలాక్ష చిక్కుల్లో తేలితేనే రుణ మాఫీ అవుతుంది. లేదంటే లేదు, కనీసం ఆ విషయం చెప్పటానికి రోజంతా పడిగాపులు పడాల్సి వచ్చింది. అంతకు మించి బాధ్యులైన మంత్రులు, నాయకులు పత్తా లేకుండా పోయారు. అవును మరి, ఇప్పుడు ఎన్నికలు లేవు కదా...!