బాబు బాజా


బాబు బాజా మరోసారి మొదలైంది. బీజేపీయేతర పార్టీల భేటీలో చంద్రబాబే కీలకం అంటూ పచ్చ ఛానెళ్లు బాకాలూదుతున్నాయి. సోమవారం జరుగుతున్న సమావేశానికి సమన్వయ కర్త చంద్రబాబే అంటూ హోరెత్తిస్తున్నాయి. నిజానికి ఈ భేటీ ఎంతో ముందగా షెడ్యూల్ లో ఉన్నదే. కానీ చంద్రబాబు భజన మీడియా మాత్రం అంతా బాబే అంటూ తెగ భరతనాట్యం ఆడేస్తోంది. 
సమావేశం వెనుక...
ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల ముందు రోజు ఏర్పాటు చేసిన ఈ కీలక సమావేశంలో కూటమి భవిష్యకార్యాచరణ గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ కూటమిలోని కొన్ని పార్టీలకు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో ప్రత్యక్ష పోటీ ఉంది. దిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు ఎపి, తెలంగాణాల్లోనూ కాంగ్రెస్ ప్రత్యర్థ పార్టీయే. కానీ తెలంగాణాలో కాంగ్రెస్తో కలిసి పొత్తు ఎన్నికలకు వెళ్లిన టిడిపి రాబోయే ఎపి ఎన్నికల్లోనూ అదే పొత్తును కంటిన్యూ చేయనుందని వార్తలు వస్తున్నాయ్. ఎపిలో సైతం కాంగ్రెస్ మాకు ప్రత్యర్థి కాదు అని స్వయంగా చంద్రబాబే ప్రకటించాడు కూడా. ఇక రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీజేపీపై ఎక్కుపెట్టుకునేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకోవడం ఈ సమావేశంలో కీలక అజెండాగా కనిపిస్తోంది.
బాబు పాత్ర ఏమిటి?
ఎపీలో టిడిపి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉన్నట్టు చంద్రబాబు సర్వేల్లో తేటతెల్లం అయ్యింది. ప్రత్యేక హోదా సెంటిమెంటును సపోర్టు చేసినట్టు చంద్రబాబు చివరి నిమిషంలో ఆడిన డ్రామా రక్తి కట్టలేదు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ప్రభుత్వం, ప్రభుత్వాధినేత, ఆ పార్టీ నేతలను కాపాడుకునేందుకు చంద్రబాబుకు మరో జాతీయ పార్టీతో, బీజేపీ వైరిపక్షంతో చేతులు కలప తప్పని పరిస్థితి. తెలంగాణా ఫలితాలు అనుకూలంగా ఉండవని తెలిసినా, రాబోయే ఎపి ఎలక్షన్లలో కాంగ్రెస్ తో ప్రత్యేక హోదా హామీనీ తెరపైకి తెచ్చి తెలుగు ప్రజలకు మరోసారి కుచ్చుటోపీ పెట్టించేందుకే చంద్రబాబు పావులు కదుపుతున్నాడు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలన్న నిర్ణయాలకోసమే దిల్లీలో మహాకూటమి సమావేశం అవుతోంది. హోదా అంశంలో హామీ ఇచ్చేలా, ప్రచారంలో కలిసి పాల్గొనేలా, టిడిపి వ్యతిరేక ప్రాంతాలను కాంగ్రెస్ కు కేటాయించేలా చంద్రబాబు వ్యూహాలు సాగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకంటే ముందే ఈ ఒప్పందాలు జరిగిపోవడం మిగిలిన అన్ని పార్టీలకంటే టీడీపీకి చాలా కీలకం. చంద్రబాబు తో చేయికలిపినందుకు హస్తానికి తెలంగాణాలో రిక్తహస్తం ఎదురైతే ఆ ఫలితాలు ఎపి ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వేగంగా పొత్తు పార్టీలతో లెక్కలు సరి చూసుకోవడానికి చంద్రబాబు ఆత్ర పడటం కనిపిస్తోంది. 
స్వలాభం కోసం, రాజకీయ ప్రయోజనాలకోసం బాబు పడే తాపత్రయానికి ప్రజాస్వామ్య విలువల ముసుగు తొడగడం ఎల్లో మీడియాకు అలవాటే. అదే తీరుగా నేడు దిల్లోలో జరుగుతున్న భాజాపేతర  14 పార్టీల సమావేశాన్ని కూడా చంద్రబాబు ఖాతాలో వేసి, అంతా బాబే అంటూ బాజాలు మోగిస్తున్న వీర తెదాపా విధేయ వర్గానికి రేపటి తెలంగాణాతో పాటు ఇతర రాష్ట్రాల ఫలితాలు షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయ్. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top