భజన చేసే విధము ఇదియండి....!

కాంగ్రెస్ పార్టీలో భజనపరులకు కొదవలేదు.  అవకాశాన్ని దొరకబుచ్చుకుని మరీ భజన చేసేస్తారు. భజన చేసే విధము తెలియండి.. కిరణ్ కుమారుడి భజన చేసి పదవి పొందండి.. పోటీపడి మరి పొగిడేశారు. 
భజన చేయడంలో కాంగ్రెస్ నేతలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముఖ్యనేతను ప్రశంసలతో ముంచెత్తారు.  నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా వీరి వ్యవహార శైలి ఉంది.  ఎవరేమనుకున్నా, ఎంత ఎద్దేవా చేసినా పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంటామని మరోసారి నిరూపించుకున్నారు. కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'ఇందిరమ్మ బాట' దీనికి వేదికైంది. ఆకాశమే హద్దుగా స్తుతి దండకం అందుకున్నారు.  తామేం తక్కువ తినలేదని టీడీపీ నేతలు కూడా పనిలో పనిగా సీఎంను స్తుతించడం కొసమెరుపు. భజన పర్వంలోనూ మ్యాచ్ ఫిక్సంగ్ కొనసాగించారు. ఉమ్మడిగా రాజకీయాలు చేయడంలోనే కాకుండా ప్రశంసల్లోనూ పచ్చ పార్టీ నేతలు పోటీ పడ్డారు. దీంతో కృష్ణా జిల్లాలో నిర్వహించిన ఇందిరమ్మ కాస్తా సీఎం భజన బాటగా రూపాంతరం చెందింది.

అపర కర్ణుడు, భగీరథుడు, మిస్టర్ క్లీన్.. అంటూ అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆకాశానికెత్తేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అయితే ఒక అడుగు ముందుకేసి అత్యుత్సాహంతో కిరణ్ ను గొర్రెల కాపరితో పోల్చారు. రాష్ట్రం విపత్కర స్థితిలో ఉన్న దశలో సీఎం బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్ రెడ్డి అనతికాలంలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారని, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నారని ప్రశంసించి పులకించిపోయారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, మైలవరం నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూసిన అప్పసాని సందీప్‌లు కూడా ముఖ్యనేతలపై తమ వీరాభామాన్ని జనం సాక్షిగా చాటుకున్నారు. సీఎం తమ ప్రాంతానికి రావడమే ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టంగా పేర్కొన్నారు. పదేపదే సీఎంను మిస్టర్ క్లీన్ అంటూ వ్యాఖ్యానించారు. పనిలో పనిగా తమ ఎంపీ లగడపాటిపైనా ప్రశంసలు కురిపించారు. ఎంపీగారి వల్ల నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిపోయిందన్నారు. లగడపాటి తన సొంత భూములు ఇచ్చి పారిశ్రామికీకరణకు దోహదపడ్డారంటూ గొప్పలు పోయారు. అప్పసాని సందీప్ అదనంగా మంత్రి పార్థసారథి భజన చేశారు.

అధికార పార్టీతో అంటకాగుతూ అప్పుడప్పుడు ఫైర్ అవుతున్నట్టు కలరింగ్ ఇచ్చే తెలుగు తమ్ముళ్లు కూడా ముఖ్యమంత్రి భజనలో మునిగితేలారు. టీడీపీకి చెందిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు సీఎంను అపర కర్ణునిగా కొనియాడారు. సీఎం చేతికి ఎముకే లేదని, సుతిమెత్తగా ఉంటుందని, ఉదారంగా నిధులు విడుదల చేస్తారని అన్నారు. అంతేకాదు, సీఎం తండ్రి అమర్నాథరెడ్డి కూడా ఇదే తరహాలో వ్యవహరించేవారని గుర్తు చేశారు. నిత్యం అధికార పార్టీపై కారాలు, మిరియాలు నూరే టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ కూడా ముఖ్యమంత్రిని అపర భగీరథుడంటూ అభివర్ణించడం అవాక్కయ్యే అంశం. టీడీపీకే చెందిన కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అయితే ముందురోజు ఆసక్తికర ప్రకటన చేశారు. కొల్లేరు సమస్యను పరిష్కరిస్తే తాను కాంగ్రెస్‌కు ఓటు వేయడమే కాకుండా, నియోజకవర్గంలో ఆ పార్టీ గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించి టీడీపీలో కలకలం రేపారు. దీంతో త్వరలోనే జయమంగళ బాబుగారి పార్టీకి మంగళం పాడేస్తారన్న ఊగాహానాలు వెల్లువెత్తాయి.

అధికార, విపక్ష నేతలు అసలు విషయాలను పక్కనపెట్టి నల్లారివారికి బాకా ఊదడంతో సభకు వచ్చిన జనం అవాక్కయ్యారు. తమ సమస్యలకు పరిష్కారం చూపుతారని వస్తే.. కిరణ్ నామస్మరణతో విసిగించారని వాపోయారు. ఏం గొప్ప కార్యాలు చేశారని సీఎంను పొగడ్తల్లో ముంచెత్తారో తెలియక జనం తికమకపడ్డారు. ఇంకా ఇదే ప్రశ్న అడిగితే అమాయకులకు ఘనత వహించిన నేతలు పిచ్చెక్కిస్తారనడంలో సందేహం లేదు. కరెంట్ కోతతో కుల్లబొస్తున్నారు. ఫీజుల పథకానికి కోత పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించారు. సర్దుబాటు చార్జీలతో షాకిస్తున్నారు. ప్రచార్భాటంతో తనవికాని పథకాలను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో గొప్ప పనులు చేస్తూ ముందుంది మంచికాలం అంటూ ఊరిస్తున్న ముఖ్యనేతను మాటవరకు కూడా పొగడొద్దంటారా అంటూ కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేసినా చేయొచ్చు. కాబట్టి ప్రజలరా కాంగీయులను ప్రశ్నిస్తే పోయేది మీ మతే. చేతనయితే మీరు బాకా ఊదండి, చేతకాకపోతే బాకా భరించండి.

Back to Top