ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం చేసిన ప్రకటన మేడిపండును గుర్తుకు తెస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోలాగే ఫీజులను పూర్తిగా భర్తీ చేయాలని విద్యార్థిలోకంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్నతీవ్ర ఆందోళనకు తలవొగ్గినట్టుగా ప్రభుత్వ ప్రకటన కనిపించింది.కానీ, వాస్తవాలను లోతుగా తరచిచూస్తే సర్కారు అసలు రంగు బయటపడుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు బీసీలకు ఏమాత్రం అనుకూలంగా లేవనేది తేటతెల్లమవుతుంది. అంతేనా, ఎస్సీ, ఎస్టీలకు కూడా కొత్తగా ఒరగబెట్టినదేమీ లేదని కూడా అర్థమవుతుంది.ప్రభుత్వ కాలేజీలు, గురుకులాల విద్యార్థులతోపాటు కార్పొరేట్ కాలేజీల్లో స్పాన్సర్‌షిప్ ద్వారా చదివిన వారికి ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి రీయింబర్స్‌మెంట్ ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందువల్ల వీరికి ఎటువంటి సమస్యా ఉండదు. పోతే, వివిధరకాల ఫీజులున్న 85 ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే వారి విషయంలోనే ప్రభుత్వ నిర్ణయం ప్రకంపనలు పుట్టిస్తోంది.. ఇక్కడ చేరే వారిలో, ఎంసెట్‌లో పదివేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే పూర్తి రీయింబర్స్‌మెంట్ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం గమనార్హం. గత కొద్ది సంవత్సరాల గణాంకాలు గమనిస్తే.. పరిస్థితి ఇట్టే తేటతెల్లమవుతుంది. ఫీజులు పెరిగిన 85 కాలేజీల్లో, పదివేల లోపు ర్యాంకుతో చేరుతున్న విద్యార్థులు 25 శాతం మంది కూడా ఉండడం లేదనేది ఆగణాంకాల సాక్షిగా నిర్ధారణైన వాస్తవం. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారుగా మూడువేల సీట్లున్నాయి. 10వేల లోపుగా ర్యాంకు వచ్చినవాళ్లలో చాలామంది వీటిలోనే చేరుతారు. వీరివల్ల ప్రభుత్వానికి పడే అదనపు భారం ఏదీ ఉండదు. వీరికి తోడు, 5వేల లోపు ర్యాంకర్లలో చాలామంది ఏఐఈఈఈ, ఐఐఐటీలలో చేరిపోతున్నారు. మిగిలినవారిలో ఎస్సీ, ఎస్టీలు మినహా.. బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులుండేది చాలా తక్కువనేది సాక్షాత్తు అధికారుల మాట. అంటే, ఈ 85 కాలేజీల్లో చేరేవారిలో 10వేల పైన ఉండే ర్యాంకర్లే అధికమనేది ఉన్నమాట. అందువల్ల, అధిక సంఖ్యలో ఉండే వీరందరినీ పూర్తి రీయింబర్స్మెంట్నుంచి తప్పించి, తద్వారా భారం దించుకుందామనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఆంక్షల ఎత్తు వేసిందని తేలిపోయింది. ఇక, ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వాళ్లకు పైన పేర్కొన్న 85 ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు వచ్చినా వారందరికీ కూడా ఫీజును పూర్తిగా భర్తీ చేస్తామనేది ముఖ్యమంత్రి ప్రకటనలోని మరో హామీ! ఈ 85 కాలేజీల్లో సుమారుగా 50 వేల సీట్లుంటాయి. కన్వీనర్ కోటాలో రీయింబర్స్‌మెంట్ పథకం కింద ఈ కళాశాలల్లో చేరేవారు పదిశాతానికి మించడం లేదని అంచనా. ఇక, ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదివి అత్యుత్తమ కాలేజీల్లో చేరేవారు కూడా ఐదారు శాతానికి మించడం లేదన్నది కూడా వాస్తవమే. ఇటువంటి వారికి మాత్రమే పూర్తి రీయింబర్స్‌మెంట్ అందనుంది. ఎస్సీ, ఎస్టీల అదనపు భారం ఏమీ లేదు ఇక ఎస్టీ, ఎస్సీలకైతే వారి ర్యాంకు ఏదైనా, వారు ఏకాలేజీలో చేరారన్నదానితో సంబంధం లేకుండా.. పూర్తి రీయింబర్స్ చేస్తామన్నది కూడా ముఖ్యమంత్రి చెప్పిన వాటిలో మరో ముఖ్యాంశం. వాస్తవాన్ని పరికిస్తే.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది చాలా తక్కువ. ఈ విద్యార్థులకు సంబంధించిన ఫీజు మొత్తంలో సుమారుగా 75% శాతం కేంద్రం నుండే నిధులు వస్తాయి. మిగిలిన దాన్ని కూడా ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల నుండి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, ఈ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒరగబెట్టింది ఏమీ లేదని స్పష్టమవుతోంది. మంచికాలేజీ చదువు ఇక అంతేనా..ఏతావాతా తేలిందేమంటే.. మంచి కాలేజీల్లో చదువుకోవాలనే బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థుల కలలు, ప్రభుత్వ కఠిన నిర్ణయంతో కల్లలయినట్టే. వారి ఆశలపై ఒక్కమారుగా నీళ్లు కుమ్మరించింది సర్కారు. ఫీజులు పెరిగిన కాలేజీల్లో సగం వరకు ఉన్నత ప్రమాణాలు కలిగినవేనని, విద్యాబోధన, వసతులు బాగుంటాయనేది ప్రభుత్వ అంచనా. ఇంతకు ముందటి విద్యాసంవత్సరాల్లో ఈ కాలేజీల్లో చేరినవారిలో 10వేలు దాటిన ర్యాంకర్లలో బీసీ విద్యార్థులు కూడా ఉన్నారు. సీబీఐటీ వంటి కాలేజీల్లో 25వేల ర్యాంకు వరకు కూడా సీట్లు లభించాయి. బాలికలకు ఇంతకన్న ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా మంచి కాలేజీల్లో సీట్టు వచ్చాయి. వీరందరికీ ప్రభుత్వమే ఇప్పటిదాకా పూర్తిగా ఫీజు చెల్లించేది. కాని తాజా నిర్ణయంతో ఇంతే ర్యాంకులు వచ్చిన వారెవరికీ కూడా ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వయినా రాదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో రూ.10వేల లోపు చెల్లించి చదువుకొన్న విద్యార్థులైతే పూర్తిగా నష్టపోతారు. ఇలా..ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదవాడికి ఉన్నత విద్యను ఉచితంగా అందించాలనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సదాశయానికి, ఆయన ప్రవేశపెట్టిన.. ఫీజును పూర్తిగా రీయింబర్స్‌చేసే పథకానికి తూట్లు పొడిచింది. పేద విద్యార్థుల ఆశలను అడియాశలు చేసింది.