అందరూ చదవాలి.... అందరూ ఎదగాలంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించే ప్రభుత్వం .... ఆచరణలో మాత్రం అడగడుగునా నిబంధనలు విధిస్తోంది. మీ ఇంట్లో గోడ ఉందా... గోడ మీద బల్లి ఉందా... అన్న చందంగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మీకో స్లాబు వేసిన ఇల్లుందా... ఇంట్లో కలర్ టీవీ ఉందా... లేకపోతే ద్విచక్ర వాహనం ఉందా అని ప్రశ్నిస్తోంది. ఒకవేళ స్లాబ్ వేసిన ఇల్లు, కలర్ టీవీ, ద్విచక్ర వాహనం ఉందా అయితే మీకు ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తించదంటూ కొత్త ఫిట్టింగ్ పెడుతోంది.అందరూ చదవాలి.... అందరూ ఎదగాలంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించే ప్రభుత్వం .... ఆచరణలో మాత్రం అడగడుగునా నిబంధనలు విధిస్తోంది. ఫలితంగా డబ్బుకు పేదవారేమో కానీ... చదువుకు కాదంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి పెద్దలు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చదువుకునేందుకు కాకుండా తాజాగా విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకే భయపడేలా ఎత్తుగడలు వేస్తోంది.ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఖజానాకు గుదిబండగా భావిస్తున్న కిరణ్ సర్కార్ ఎలాగైనా ఈ పథకాన్ని కొండెక్కించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేపట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే విద్యార్థుల కుటుంబాలను స్వయంగా తనిఖీ చేయాలన్న అధికారుల ప్రతిపాదనను మంత్రి వర్గ ఉప సంఘం ఆమోదించింది. ఇందుకోసమే ప్రత్యేకంగా జిల్లాకు నాలుగైదు బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బృంద సభ్యులు కాలేజీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల జాబితాను పరిశీలిస్తారు. అనుమానం ఉన్న వారి ఇళ్లకు వెళ్లి విచారిస్తారు.వీరితో పాటు సంక్షేమ శాఖ కమిషనర్లు, ముఖ్య కార్యదర్శులు కూడా క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారు. నిబంధనలకు విరుద్దంగా దరఖాస్తు చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తనిఖీల తర్వాతే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణే స్వయంగా చెప్పటం విశేషం.ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లలో జమయ్యే స్కాలర్ షిప్‌కు ప్రభుత్వం కొర్రీలు పెట్టింది. ఆధార్ కార్డు ఉంటేనే ఇకపై ఉపకార వేతనం వర్తిస్తుంది. వీటితో పాటు కళాశాలలో వేలిముద్రలు ఇవ్వాలి. ఈ వేలిముద్రలు ఆధార్ డేటాబేస్‌లో ఉన్న వేలిముద్రలు సరిపొలితేనే స్కాలర్ షిప్ అకౌంట్‌లో వచ్చి చేరుతుంది. అయితే తొలుత హైదరాబాద్, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో అమలు చేయనున్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క జిల్లాలో కూడా ఆధార్ పూర్తయినట్టు అధికారికంగా ప్రకటన జారీ కాలేదు. అంటే అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఆధార్ లేకపోతే అంతే సంగతులు అన్నమాట. దీంతో పాటు రెండేళ్లకు పైగా చదువుకు దూరంగా ఉన్న వారికి అనర్హులుగా ప్రకటించే ప్రతిపాదనకు కూడా ఒకే చెప్పినట్టు సమాచారం.ఇక ఫీజు రీయింబర్సుమెంట్‌పై 3 వేల 300 కోట్ల వరకు లోటు ఏర్పడే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 2011 -12 , 2012-13 సంవత్సరాలకు 6 వేల 760 కోట్లు అవసరం. ఇందులో ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 2వేల 650కోట్లు చెల్లించింది. 800 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించారు. ఇక మరో 3 వేల 300 కోట్లను ఎలా మేనేజ్ చేయాలా అనేదానిపై కసరత్తు చేస్తోంది. దానిలో భాగంగానే ఫీజు రీయింబర్సుమెంట్ను పథకం ప్రకారం అటకెక్కించేందుకు సర్కార్ పావులు కదుపుతోంది.<br/>