అర'చేతి'లోనే తెలంగాణ..

మళ్లీ తెలంగాణ ఉద్యమం.. ఈ మాట ఢిల్లీ పెద్దల చెవికి సోకినపుడల్లా.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేయడానికి సత్వర చర్యలు తీసుకొంటున్నట్టుగా హడావిడి ప్రారంభమవుతుంది. సమస్యను తీవ్రంగా పరిశీలిస్తున్నామని, కొద్దిరోజుల్లోనే సానుకూల నిర్ణయం ప్రకటిస్తామనే మాట ప్రచారమైపోతుంది. అర'చేతి'లో తెలంగాణను చూపించే ప్రక్రియ మళ్లీ మళ్లీ మొదలైపోతుంది.

ఇక రాష్ట్రంలోని వీధిస్థాయి వరకు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా క్షణం ఆలస్యం చేయకుండా ఇదే పల్లవి అందుకుంటారు. ఇదిగో.. మరి కొద్దిరోజులే.. ప్రత్యేక రాష్ట్రం వచ్చేప్తోంది.. మామాట నమ్మండి. కేంద్రం, కాంగ్రెస్­ అధిష్ఠానం త్వరలో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తాయి.. అంటూ నమ్మించే ప్రయత్నాల్లో పడిపోవడం గత మూడేళ్లుగా మరీ మామూలైపోయింది.

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, మళ్లీ ఉద్యమం బాట పట్టాలని యోచిస్తుండడంతో కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తిరిగి కదలిక మొదలైంది. కాంగ్రెసీయులు మళ్లీ తమ పాత టెక్నిక్­ ప్రయోగం మొదలెట్టారు.

వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలను చూసి జాలిపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ప్రజానీకం, వాళ్ల మాటలను నమ్మడం మానేసి చాలా కాలమైంది. తెలంగాణ ఉద్యమ సారథి, ఇదే మాట పలుమార్లు చెపుతూ వస్తున్నా.. ఉద్యమ సారథిగా ఆయన పరిస్థితి వేరు. ఎవరు చెప్పినా.. కేంద్రప్రభుత్వమే, ముఖ్యంగా పాలక యూపీఏలోని ప్రధాన పక్షమైన కాంగ్రెస్ తలచుకొంటేనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే.

వాస్తవం ఇదైతే, నోరు నవ్వుతుంటే.. నొసలు వెక్కిరించిన చందాన.. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. ఓ పక్క తెలంగాణ ఖాయమన్నహామీలు గుప్పిస్తూనే.. అంతలోనే.. అదంతా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నేతలు ఏకాభిప్రాయానికి వస్తేనే సాధ్యమని, దేశంలోని మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా సానుకూలంగా స్పందించాల్సి ఉంటుందనీ సన్నాయినొక్కులు నొక్కుతుంటారు.

ఈ సారికూడా జరిగిందిదే...

టీఆర్­ఎస్­ మళ్లీ రంగంలోకి దిగుతోందన్న మాట తెలిసినవెంటనే.. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తయిన (సెప్టెంబర్­ 6) అనంతరం, సెప్టెంబర్­ రెండో వారంలో దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలెడతామంటూ తాజాగా పాత 'లీక్­ టెక్నిక్­' ప్రయోగించింది.

అయితే, కాంగ్రెస్­పాతపాటకు శ్రోతలే కరవయ్యారు. ఇదేమాటను వినివినీ విసుగెత్తిన జనం.. అలాగా.. అనుకుంటూ నవ్వుకుంటున్నారు.

తెలంగాణ సమస్యకు పరిష్కారం సాధిద్దామన్న నిజాయతీ కేంద్రానికి వాస్తంగా ఉన్నట్టయితే.. ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణపై రాజ్యససభలో ప్రతిపక్ష బీజీపీ ప్రతిపాదించిన అనధికార తీర్మానం విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఉండేది. కాని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని తేటతెల్లంచేస్తున్నాయి. ఈ విషయంలో ఏకాభిప్రాయ సాధన తప్పనిసరి అంటూ ఆయన చెప్పిన మాట.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నట్టుగా.. పరిస్థితిలో మార్పు శూన్యం. కేంద్రం వైఖరిలో అంతకన్న తేడా అసలే లేదు, కాంగ్రెస్­ మార్కు తాత్సారం తప్ప అంతకన్నవిశేషమేమీ లేదన్న సంగతి అర్థమైపోతుంది.

" ఆంధ్రప్రదేశ్­లోని వివిధ రాజకీయ పక్షాలతో చర్చల ప్రక్రియ సాగుతోంది. ఈ చర్చల దృష్ట్యా తగు నిర్ణయం తీసుకోడం జరుగుతుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను, శాంతిభద్రతల పరిస్థితిని కేంద్రం చాలా సునిశితంగా గమనిస్తోంది" అంటూ రాజ్యసభలో సాగిన జితేంద్ర సింగ్­ ప్రకటనలో కొత్తదనం కోసం వెతకడం అత్యాశే అవుతుంది. పైగా ఈ ప్రకటన కొత్తదేమీ కాదు. ఎనిమిది నెలల కిందట సార్క్­ సమావేశాలు ముగించుకొని మాల్దీవులనుంచి తిరిగివస్తూ ప్రధానమంత్రి మన్మోహన్­సింగ్­ మీడియాతో చెప్పిన మాటనే జితేంద్ర మళ్లీ వల్లించారు, అంతే..

వాస్తవానికి వస్తే..తెలంగాణ­ విషయంలో ఇతర ప్రాంతాల ప్రజానీకం సానుకూలంగా లేకపోవడంతో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నఈ డిమాండ్­ను కేంద్రం పరిష్కరించే అవకాశం కనిపించడం లేదు. ఆమాటే జితేంద్ర సింగ్­ నోట మళ్లీ వెల్లడైంది.

అయినా, తెలంగాణ కాంగ్రెస్­ నేతలు పాతపాటే మళ్లీ పాడుతున్నారు.

కానీ, ముఖ్యమంత్రి కిరణ్­కుమార్­ రెడ్డి మాటలు పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. తనకు అటువంటి సూచనలేవీ కేంద్రంనుంచి అందలేదని ఆయన తేల్చిపారేశారు. నిజానికి, రాష్ట్రంలో ప్రభుత్వ, పార్టీ నాయకత్వం మార్పు తాజా హడావుడికి సంబంధించిన ఇటీవలి ఢిల్లీ యాత్రల సందర్భంగా, కాంగ్రెస్­ అధిష్ఠానం అజెండాలో తెలంగాణ అంశమూ ఉందని వినిపించింది. కానీ, అసలా విషయమే ప్రస్తావనకు రాలేదని తేలిపోయింది. అంటే.. మళ్లీ అదే ఆట, అదే పాటతో మరికొంత కాలం కథాకళి..

  

Back to Top