ఉన్న ఇల్లు అలికిపెట్టమంటే ఉన్నదంతా ఊడ్చిపెట్టాడంట ఓ ప్రబుద్ధుడు. అనుభవజ్ఞడు, రాజధానిని కడతానన్నాడు, అభివృద్ధి చేస్తా అన్నాడు అని ఓట్లేస్తే రాజధాని భూములు తాకట్టుపెట్టి అప్పులు పుట్టిస్తా అంటున్నాడు చంద్రబాబు. అమరావతి అభివృద్ధి ప్రాధికారక సంస్థ పేరు పెట్టుకుని అప్పనంగా భూములు తనఖా పెట్టేస్తా అంటున్నాడు. బాండ్ల పేరు చెప్పి వేల కోట్లు తెచ్చిన అప్పు చాలక, ఉన్న భూములు కూడా కుదువ పెట్టి అప్పుల కుప్పలు పేరుస్తా అంటున్నాడు. రాజధాని మౌలికవసతుల ప్రాజెక్టులకు సొమ్ములు తక్కువయ్యాయట. అందుకే రాజధానికోసమంటూ రైతులిచ్చిన భూములను తాకట్టు పెట్టి అప్పులు తెస్తారట. ఇందుకోసం సిఆర్ డిఎ కు అనుమతి కూడా ఇస్తూ జివో ఇచ్చేసింది చంద్రబాబు సర్కార్.
రాజధాని అంటే అప్పులు తెచ్చిపెట్టే ఆస్తా?? అది చంద్రబాబుకు రైతులు రాసిచ్చిన పట్టానా? అసలు మౌలిక వసతుల పేరు చెప్పి చంద్రబాబు ఇంతకాలం చేసిన అభివృద్ధి ఏమిటి? తఆత్కాలికం అంటూ కట్టిన రెండు భవంతులకూ కోట్లు తగలేసాడు. తీరా చూస్తే అవి తూతూమంత్రంలా, తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నాయి. కనకదుర్గ వారధి అని పనులు మొదలెట్టి ఇన్నేళ్లైనా అతీగతీ లేదు. ఓ ఫ్లై ఓవర్ లేదు, మంచి రోడ్డు లేదు. మురుగు నీటి సదుపాయం లేదు. మొన్న పడ్డ వర్షానికి విజయవాడ నుంచి అమరావతి దాకా అంతా చెరవైపోయింది. సచివాలయంలోకి కూడా కాళ్లుతడిసేలా నీళ్లు చేరాయి. ఇంకే మౌలిక వసతులు కల్పించాలని వేల కోట్ల అప్పులు తెస్తున్నారు?
రాజధాని కోసం వేలాది ఎకరాలు ఎందుకు అంటే, పరిపాలనా భవనాలు, ఉద్యోగుల ఇళ్లు, ఆఫీసులు, హోటళ్లు, హాస్పటళ్లు, స్కూళ్లు, సినిమాహాళ్లు, పార్కులు, ప్రదర్శనశాలలు ఇలా అన్నీ ఉన్న రాజధాని కడతానని చెప్పి రాజధాని భూసమీకరణ మొదలెట్టాడు చంద్రబాబు. తీరా నాలుగేళ్లు గడిచాక బాబు చెప్పినవేవీ కట్టలేదు. కేంద్రం ఇచ్చిన సొమ్ములు గుటకాయస్వాహా అయ్యాయి. రాష్ట్ర ఆదాయం హాంఫట్ అయిపోయింది. అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగాయి. రాజధాని కోసం అని చెప్పి రైతులను బలవంతం చేసి భయపెట్టి తీసుకున్న భూములు నేడు రియల్టర్ల పాలు కాబోతున్నాయి.
రాజధాని ప్రాధికార సంస్థ ఇప్పటికే బాండ్ల పేరుతో రెండువేల కోట్ల అప్పు చేసింది. ఇప్పుడు బాంకులకు భూములు తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు తెస్తారట. దీనికి వడ్డీ కూడా చెల్లించాలి. పైగా వాణిజ్య బాంకులు ఇచ్చే అప్పులు కనీసం 18 శాతానికి మించిన వడ్డీతోనే ఉంటాయి. ప్రభుత్వం తీసుకునే అప్పులేవైనా 8శాతానికి మించరాదన్న నిబంధనలు తుంగలో తొక్కి చంద్రబాబు ఈ అప్పులు చేస్తున్నారు. సిఆర్ డిఎ తీసుకునే ఈ పదివేల కోట్లకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందట. ఈ సంస్థ కనుక అప్పులు చెల్లించలేని పక్షంలో, ప్రభుత్వమే బాంకులకు రుణాన్ని కట్టాలి. లేదంటే రాజధాని భూములను సదరు బాంకులు జప్తు చేసుకుంటాయి.
అన్నంపెట్టే రైతును మోసం చేసి, నమ్మి ఓట్లేసిన ప్రజలకు పంగనామం పెట్టి, ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తూ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ చేస్తున్న చంద్రబాబు భాగోతాలకు ఇది పరాకాష్ట. ఎలాగూ రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశాలు శూన్యంగా కనిపిస్తున్నాయి కనుక వీలైనంతా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఖజానాకు గండి కొట్టి రాబోయే ప్రభుత్వాలకు అప్పుల తిప్పలను నెత్తిన వేయాలన్న చంద్రబాబు పంతం ఇది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పుగా తెచ్చిన సొమ్ములను కూడా సొంత జేబు సంస్థల, బినామీలకు చెదిందిన సంస్థలకు కాంట్రాక్టు పద్ధతిన పనులు కట్టబెట్టి కమీషన్లు దండుకునే వ్యవహారం ఇదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇటు రుణ భారంతో రాష్ట్రం నాశనం కావడం, అటు రానున్న ప్రభుత్వం లోటుబడ్జెట్, అప్పుల భారంతో సతమతం కావడం...ఇదీ చంద్రబాబు స్కీమ్ అంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన రాజకీయవేత్తలు.