ఆమదాలవలస 26 జూలై 2013:
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అభిమాన జన సంద్రమైంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి షర్మిల వారి అభిమానంతో తడిసి ముద్దయ్యారు. రోడ్ల నిండా జనం.. మేడలు, మిద్దెల నిండా జనం.. షాపులు, ఇళ్ల గుమ్మాల నిండా జనం.. ఇది గురువారం సాయంత్రం ఆమదాలవలసలో దృశ్యం. ఆత్మీయ అతిథిని ప్రత్యక్షంగా చూడాలని.. ఆమె చెప్పేది చెవులారా వినాలని తపించింది. గురువారం సాయంత్రం ఆ పట్టణం అభిమానవలసగా మారిపోయింది. మహానేత ముద్దుల తనయ షర్మిలమ్మ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం తమ గ్రామాల మీదుగా సాగినా.. అక్కడే ఆమెను చూసే అవకాశం లభించినా.. తనివి తీరని పల్లెజనం ఆమెనే అనుసరిస్తూ పట్టణానికి పోటెత్తారు. ఇతర గ్రామాలు.. పట్టణంలోని వీధులు.. ఇలా అన్ని దారులూ రైల్వేస్టేషన్ వైపు పరుగులు తీశాయి. పట్టణ ప్రధాన రహదారి ఈ చివరి నుంచి.. ఆ చివరి వరకు కిటకిటలాడింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు షర్మిలకు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం నుంచీ పాదయాత్ర సాగిన మార్గంలోని ప్రతి పల్లెను ఆత్మీయంగా పలకరించారు. కష్టాలు, సమస్యలు ఆరా తీశారు. పిల్లలు, వృద్ధులు, మహిళలను దగ్గరకు తీసుకొని ఆప్యాయత కురిపిస్తూ ముందుకు సాగారు.