ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ డేటా లీక్


ప్రజ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారానికి ఆయువుప‌ట్టు ఆధార్. అలాంటి ఆధార్ నెంబ‌ర్ త‌న విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోతోందా అనిపించేలా ప‌లు సంఘ‌ట‌న‌లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల‌న్నిటికీ ఆధార్ త‌ప్ప‌నిస‌రి అయ్యింది. బ్యాంకు ఖాతాల అనుసంధానంతో ప్రజ‌ల ఆర్థిక స‌మాచారం అంతా ఆధార్ తో ముడిప‌డి ఉంటోంది. ప‌థ‌కాలు, రుణాలు, గుర్తింపులు ఇలా ప్రజ‌ల జీవితాల‌కు అత్య‌వ‌సంరం అంటూ ప్రతిచోటా ప్రత్యక్షం అయ్యిన ఆధార్ ఇప్పుడు స్వార్థ ప్రయోజ‌నాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా లీక్ అయిపోవ‌డం చూస్తే ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్రేమో అనిపించ‌క‌మాన‌దు.

 దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైన ఆధార్ లీక్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఎపిలో కూడా త‌న ఉనికిని చూపించింది. మాట్లాడితే టెక్నాల‌జీ గురించి మాట్లాడే చంద్రబాబు ప్రభుత్వం ప్రజ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని కాపాడ‌టంలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యింద‌న‌డానికి ఇదో ఖ‌చ్చిత‌మైన సాక్ష్యం.భ‌ద్రతా వ్య‌వ‌హారాల్లో డొల్ల‌త‌నానికి ఇది రుజువుగా నిలిచింది.  
యూ ఐ డి ఎ ఐ త‌మ డేటా బేస్ ప‌ర‌మ భ‌ద్రంగా ఉంద‌ని ప్రక‌టించింది. కానీ ఖాతాదారుల వివ‌రాలు వెబ్సైట్లో ప్రత్య‌క్షం కావ‌డం గురించి ప్రశ్నిస్తే తెల్ల‌ముఖం వేస్తోంది.  ప్రజ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సేక‌రించే యు ఐ డి ఎ ఐ ఆ స‌మాచారం అంతా భ‌ద్రంగానే ఉంద‌ని సుప్రీంకు ఇటీవ‌లే వెల్ల‌డించింది. కానీ వాస్త‌వం అందుకు విరుద్ధంగా ఉంది. 

ఆధార్ స‌మాచారం దొంగ‌ల‌పాలు

వ్యాపార, రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ప్రజ‌ల స‌మాచారాన్ని హ్యాక్ చేయిస్తున్న హైటెక్ కాలం ఇది. ఈ హ్యాకింగ్ కు అనువుగా మ‌న డేటాకూడా అత్యంత పేల‌వ‌మైన భ‌ద్రతా వ‌ల‌యంలో ఉంద‌ని తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రజ‌ల ఆధార్ నెంబ‌ర్ కు అనుసంధానంగా వారి అక్కౌంట్, ఆదాయం, కులం, మ‌తం, ప్రాంతం వంటి పూర్తి స‌మాచారాన్ని సేక‌రిస్తున్నాయి. ఆయా విభాగాల కోసం సేక‌రించే ఈ డేటా అంతా ఓపెన్ గా వెబ్ సైట్లో పెట్టేస్తున్నారు. దీనివ‌ల్ల ఓ ప్రాంతానికి చెందిన జ‌నాభా లో ఎంద‌రు ఏ కుల, మ‌తాల‌కు చెందిన వారు, ఎటువంటి ఆర్థిక ప‌రిస్థితి క‌లిగి ఉన్నారు అనే రికార్డు అంతా ప్రస్ఫుటంగా క‌నిపిస్తోంది. అంటే ఆధార్ తో పాటు అన్ని వివ‌రాల‌నూ బైట‌పెట్టి డేటా దుర్వినియోగం చేసే అవ‌కాశం చేజేతులా ప్రభుత్వ సంస్థ‌లే క‌ల్పిస్తున్నాయ‌న్న‌మాట‌.  

ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేష‌న్ నిర్వాకం

1.3 ల‌క్ష‌ల మంది ఖాతాల‌ను, వారి స‌మ‌గ్ర స‌మాచారాన్ని వెబ్ సైట్ లో బాహాటంగా పెట్టింది ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేష‌న్. ఈ సైట్ లో ద‌ళితులు అని సెర్చ్ ఇంజ‌న్ లో టైప్ చేస్తే వంద‌లాది మంది వ్య‌క్తిగ‌త స‌మాచారం వెల్లువ‌లా వ‌చ్చిప‌డుతోంది. ముస్లింలు అని టైప్ చేస్తే కొన్ని ప్రాంతాల్లోని ముస్లింల ఆధార్, వారి వివ‌రాల‌న్నీ బ‌హిర్గ‌తం అవుతున్నాయి. ఆధార్ నెంబ‌ర్ ను కుల‌మ‌తాల‌కు సంబంధిచి డేటా బేస్ గా చూడ‌టం లేద‌ని ప్రభుత్వాలు చెబుతున్న మాట వ‌ట్టిదే అని ఆధార్ లీకుల‌న్నీ తెలియ‌జేస్తున్నాయి. వాటి ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల ల‌బ్దిదారుల ఎంపిక జ‌రుగుతోంద‌ని ప్రజ‌లే ఆరోపిస్తున్నారు. 29 విభాగాల నుంచి వ‌చ్చిన స‌మాచారాన్ని క్రోడీక‌రించ‌డానికి ఎపి హౌసింగ్ కార్పొరేష‌న్ ఆధార్ నెంబ‌ర్ ను ఉప‌యోగించుకుంది. అంటే ఒక్క ఆధార్ నెంబ‌ర్ ద్వారా ప్రజ‌ల అన్ని విధాల స‌మాచారం ఒక్క‌చోట పోగుప‌డి హ్యాక‌ర్ల‌కు సుల‌భంగా స‌మాచారాన్ని అందిస్తున్నాయ‌న్న‌మాట‌. 

ప్రజ‌ల స‌మాచార భ‌ద్రత‌పై నిర్ల‌క్ష్యం

ప్రభుత్వ సంస్థ‌ల ప్రామాణిక‌త లేని విధానాలు, భ‌ద్రత, గోప్య‌త‌కు హామీ ఇవ్వ‌డంలో బాధ్య‌తా రాహిత్యం క‌నిపిస్తోంది. అది మ‌న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్త ఎక్కువే ఉంది. . ప్రభుత్వ విభాగాల అక్రమ ప‌ద్ధ‌తుల వ‌ల్ల‌నే భారీగా డేటా లీక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఎన్.ఆర్.ఇ.జి.ఎ పోర్ట‌ల్, చంద్రన్న బీమా ప‌థ‌కానికి సంబంధించిన ఆన్ లైన్ డాష్ బోర్డ్ ద్వారా గ‌తంలోనూ కొన్ని ల‌క్ష‌ల ఆధార్ స‌మాచారాలు బ‌హిర్గతం అయ్యాయి. రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప‌లు ప్రభుత్వ విభాగాల‌కు చెందిన సైట్ల‌లో ల‌బ్దిదారుల ఆధార్, మొబైల్ నెంబ‌ర్, బ్యాంకు ఖాతాల వివ‌రాలు బ‌హిర్గ‌త‌మైతే క‌ఠిన శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని మునుపు కేంద్రం హెచ్చ‌రించింది. డేటా లీక్ కార‌కుల‌కు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంద‌ని కూడా తేల్చి చెప్పింది. మ‌రి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముంచిందే కాకుండా, చివ‌ర‌కు ప్రజ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని కూడా అంగ‌ట్లో పెట్టేసిన చంద్రబాబును, ఆయ‌న ప్రభుత్వాన్ని కేంద్రం దోషిగా నిల‌బెట్టి, ఎలాంటి శిక్ష వేస్తుందో చూడాలి.  

తాజా వీడియోలు

Back to Top