వ్యవసాయంలో 10 వేల డ్రోన్లు

మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి:  వ్యవసాయంలో 10 వేల డ్రోన్లను ప్రవేశపెడుతున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడారు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు కేటాయింపులు జరిగాయన్నారు. మంచి బడ్జెట్‌ ప్రవేశపెడితే టీడీపీ వాళ్లకు కడుపు మంటగా ఉందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశామన్నారు. వ్యవసాయం, రైతుల సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

మంత్రి కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. 

సమాజంలోని అట్టడుగు వర్గాలు, పేదలు, రైతుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఎంత కమిట్ మెంటుతో ఉన్నారనేదానికి ఈరోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ తార్కాణం. రాబోయే కొత్త జిల్లాలతో కలిపి.. ప్రతి జిల్లాలో వైయ‌స్ఆర్ రైతు భవన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గ్రామాల నుంచి రైతులు పట్టణాలకు, నగరాలకు వచ్చినప్పుడు,  వారి సౌకర్యార్థం, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం, వసతి కోసం వైయ‌స్ఆర్ రైతు భవన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రైతుల సంక్షేమం కోసం సూక్ష్మ స్థాయిలో ఆలోచించి నిర్ణయాలు చేస్తున్న ప్రభుత్వం ఇది. 

పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీకి సాటి మరెవరూ రారు. రైతుల కోసం ఆర్బీకేలు ఏర్పాటు చేసి, ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చినా టీడీపీ నేతలకు కడుపు మంట ఎందుకు..? ఎరువుల కోసం ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నారని పసలేని విమర్శలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చొనే పరిస్థితి రాకూడదనే, ఆర్బీకేలకు వెళ్ళి రైతులు పేరు నమోదు చేసుకుంటే, వారికి  గ్రామాల్లోనే నేరుగా విత్తనాలు, పురుగు మందులను ఆర్బీకేల ద్వారా ఇస్తుంటే.. దానిపైనా విమర్శలు చేయడం విడ్డూరం. 

గత రెండేళ్లు కోవిడ్ వల్ల ఏ పనులూ జరగని పరిస్థితి ఉంది. ఇక నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు తప్పకుండా వేగవంతం అవుతాయి. జలయజ్ఞం అనేది మహానేత వైయస్ఆర్ ప్రారంభించినది, ఆయన బ్రాండ్ పథకం అది.  ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విధానాలకు కొనసాగిస్తూ, అంతకు మించి చేసి చూపిస్తాం. 

రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకూ దామాషా ప్రకారం నిధులు ఇస్తుంది. టిడిపి నేతల ఊహకి కూడా అందని విధంగా, రాష్ట్రంలో సంక్షేమ‌ పథకాలు అమలు చేస్తున్నాం. వీటిని చూసి, టిడిపి నేతలు తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పదివేల డ్రోన్లను ప్రవేశపెడుతున్నాం. గ్రామాలలో యువతకి డ్రోన్ల వినియోగంపై శిక్షణఇస్తాం.

 

Back to Top