<strong>హైదరాబాద్, 27 నవంబర్ 2012:</strong> వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోందని పార్టీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దన్ తెలిపారు. దానికి ముఖ్యకారణం ఆనాడు మహానేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విధానం, ప్రభుత్వం తీరును నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి దానికి వత్తాసు పలుకుతుండడమే అని అభివర్ణించారు. చంద్రబాబు పట్ల ప్రజల్లో విశ్వాసం పూర్తిగా పోయిందన్నారు. చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న వేగం కంటే వంద రెట్ల వేగంగా ఆయన వద్ద ఉన్న నాయకులు ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తే మునిగిపోతున్న పడవలా ఉందన్నారు.<br/>జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలన వస్తుందన్న ధీమా ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా వ్యక్తం చేస్తున్నారని జనార్ధన్ అన్నారు. అదే క్రమంలో 30 ఏళ్ళుగా కాంగ్రెస్‌పార్టీలో ఉన్న కూకట్‌పల్లికి చెందిన వడ్డేపల్లి నర్సింగరావు బుధవారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జనార్ధన్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం మూసాపేట ట్రక్ పార్కింగ్ స్థలంలో పెద్ద సభ నిర్వహించి నర్సింగరావు, ఆయనతో పాటు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలిపారు.