తుపాను, వరద బాధితులను తక్షణం ఆదుకోండి

హైదరాబాద్‌, 10 నవంబర్‌ 2012: రాష్ట్రంలో ఇటీవల నీలం తుపాను తాకిడికి ఆస్తులు, పంటలు కోల్పోయిన బాధితులను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ప్రధానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై‌యస్ విజయమ్మ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని ఆ ‌లేఖలో విజయమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖలో 12 డిమాండ్లను ఆమె ప్రధాని ముందుంచారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖను శనివారం మధ్యాహ్నమే ప్రధానికి ఫ్యాక్సు చేసినట్లు జూపూడి చెప్పారు. నీలం తుపాను నష్టాన్ని స్వయంగా వివరించేందుకు విజయమ్మ ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు.‌ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరాబు శనివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.

నీలం తుపానుకు భారీగా నష్టపోయిన నాలుగు జిల్లాల్లో విజయమ్మ పర్యటించారని, పంట, ఆస్తి నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించారని, బాధితులతో స్వయంగా మాట్లాడి వారి అవస్థలను తెలుసుకున్నారని జూపూడి తెలిపారు. దరిమిలా శుక్రవారం జరిగిన వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలక మండలి సమావేశంలో విజయమ్మ ప్రస్తావించిన విషయాలు హృదయాన్ని ద్రవింపజేసేవిగా ఉన్నాయన్నారు. తుపాను కారణంగా సంభవించిన వరద ప్రాంతాల్లో ఎక్కడా పారిశుధ్యం నిర్వహించలేదని, మంచినీరు గాని, వసతి గాని, దుస్తులు వంటి కనీస సౌకర్యాలు కూడా బాధితులకు అందుబాటులో లేవని చెప్పారన్నారు.

నీలం తుపాను వల్ల వేలాది మంది బాధితులుగా మారిన వైనం, వారిని పట్టించుకోని ప్రభుత్వం, ఏదేదో మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు బాధ్యతా రాహిత్యం లాంటి 12 అంశాలతో ఈ లేఖలో విజయమ్మ ప్రస్తావించినట్లు జూపూడి తెలిపారు. ఈ అంశాలపై సవివరంగా వివరించేందుకు అవకాశం ఉన్నప్పుడు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇస్తే ఢిల్లీ వెళ్ళేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

నరకాసురుడు చంద్రబాబు :
అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణాల మాఫీపై చేస్తానంటూ చెబుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జూపూడి నరకాసురుడితో పోల్చారు. నరకాసురుడు లాంటి చంద్రబాబు అధికారంలోకి రావద్దని ప్రజలు అంటున్నారని అన్నారు. రుణాలు మాఫీ చేయాలంటే చంద్రబాబు ముందుగా ముఖ్యమంత్రి కావాలని, ఆపైన ప్రధానితో సంప్రతించాలన్నారు. అయితే, బాబుకు అధికారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఇలా ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు రుణాలను చంద్రబాబు ఏ విధంగా మాఫీ చేస్తారని నిలదీశారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌ సంతకం ఫోర్జరీ చేసి రుణాలు మాఫీ చేస్తారా అని ఎద్దేవా చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచుతామంటూ చంద్రబాబు మరో హామీ ఇస్తున్నారని, అయితే, మెస్‌ చార్జీలు పెంచమన్న వారిని నిర్దాక్షిణ్యంగా చావబాదించిన బాబును ఎవరూ విశ్వసించడంలేదన్నారు.

చంద్రబాబు నాయుడు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు పాదయాత్రలో వెళ్ళగానే వెనకటి జిల్లా నుంచి టిడిపి నాయకులు వైయస్‌ఆర్‌సిపిలో చేరుతుండడాన్ని జూపూడి గుర్తు చేశారు. చివరికి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు కూడా జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు మిగలని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 'నీవు నమ్మదగిన వాడివి కాదు' అని చంద్రబాబు వీపు మీద, పొట్ట మీద బ్యానర్లు అతికించాలని జూపూడి వ్యాఖ్యానించారు.

జగన్‌ను జైలులో పెట్టినా, బెయిల్‌ రానివ్వకుండా చేసినా ఆయన వదిలి బాణం షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజల నుంచి అచంచలమైన స్పందన లభిస్తోందన్నారు. అబద్ధాల చంద్రబాబు పాదయాత్రలో జనం లేక వెలవెలపోతున్నదని వ్యాఖ్యానించారు. బాబు చెప్పే అబద్ధాలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. టిడిపిని, చంద్రబాబును ప్రజలు ఎంతమాత్రం నమ్మబోరన్నారు. చంద్రబాబుది భస్మాసుర హస్తమని జూపూడి అభివర్ణించారు.

అసమర్థ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమని షర్మిల డిమాండ్‌ చేస్తే, 'పిల్ల కాకికి ఏం తెలుసు రాజకీయం' అని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని జూపూడి తప్పు పట్టారు. ప్రజల కష్ట నష్టాలు, బాధలు తెలిసిన వైయస్ కుటుంబం నుంచి వచ్చిన ‌షర్మిలకు రాజకీయాలు తెలియవనుకోవడం పొరపాటు అన్నారు. అసమర్థ ప్రభుత్వం అని పాదయాత్రలో తిడుతున్న చంద్రబాబు దానిపై అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని జూపూడి నిలదీశారు. అధికారంలోకి వస్తే అది చేస్తా, ఇది చేస్తా అంటూ అబద్ధాలు చెప్పడం చంద్రబాబు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

ప్రధానికి విజయమ్మ రాసిన లేఖలోని అంశాలివి:
- తుపాను కారణంగా పూర్తిగా నష్టపోయిన ప్రాంతాల్లో పంటరుణాలు, వడ్డీలను పూర్తిగా మాఫీ చేయాలి. తుపాను బాధిత ప్రాంతాల్లో తదుపరి పంటలు వేసుకునేందుకు కౌలు రైతులు సహా రైతులందరికి కొత్త రుణాలు మంజూరు చేయాలి.
- వరద పీడిత ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాలను మరో ఆరు నెలల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా రీ షెడ్యూల్‌ చేయాలి. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల్లో అత్యధికులు తాము తీసుకున్నరుణాలను వ్యవసాయంపై పెట్టుబడిగా పెట్టినందున ఈ సౌకర్యం కల్పించాలి.
- వచ్చే రబీ సీజన్‌కు సంబంధించి 75 శాతం సబ్సిడీపై ప్రభుత్వమే విత్తనాలు సరఫరా చేయాలి.
- అర్హులైన రైతులందరికీ కనీసం 25 శాతం బీమా సౌకర్యం కల్పించాలి.
- తుపాను, వరదల కారణంగా పాక్షికంగా దెబ్బతిన్న, రంగు మారిన ధాన్యాన్ని, పత్తి, చెరకు, గోధుమ పంటలను, హార్టీ కల్చర్ ‌ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
- కేంద్ర ప్రకృతి వైపరీత్యాల నిధి చైర్మన్‌ భూపేంద్ర హుడా చేసిన సిఫార్సుల మేరకు పంటలు పూర్తిగా నష్టపోయిన రాష్ట్రంలోని కౌలు రైతులు సహా రైతులందరికీ ఎకరానికి 10 వేల రూపాయలకు తక్కువ కాకుండా ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి చెల్లించాలి.
- నీలం తుపాను, వరదల కారణంగా మరణించిన అందరి కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలి.
- దెబ్బతిన్న ఇళ్ళను ప్రభుత్వమే పూనుకుని ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. ఎఐవై పథకం కింద గాని, మరే పథకం కింద అయినా గాని ప్రభుత్వమే ఇళ్ళు దెబ్బ తిన్న వారికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి.
- పశువులు, కోళ్ళు నష్టపోయిన వారికి సరైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి.
- తుపాను, వరద బాధిత ప్రాంతాల్లోని పనులు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ కూలీలకు ప్రభుత్వం బియ్యం, తాత్కాలిక పరిహారాన్ని తక్షణమే అందజేయాలి.
- వరద పీడిత ప్రాంతాల్లో దెబ్బతిన్న చేనేత కార్మికులు, మత్యకారులు, ఇతర వృత్తుల వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలి.
- వరదల కారణంగా పొలాల్లో వేసిన ఇసుక మేటలను తొలగించడానికి గ్రామీణ ఉపాధి పథకం కింద ప్రభుత్వమే పనులు చేపట్టాలి. 
Back to Top