విభజనలో సోనియా, బాబు ముద్దాయిలే

హైదరాబాద్, 15 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కేంద్రం దూకుడుగా నిర్ణయం తీసుకోవడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన లేఖ కారణంగానే కాంగ్రెస్‌కు ధైర్యం వచ్చిందన్నారు. తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకుండా తడబడ్డారని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు విభజనకు అనుకూలమో కాదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు నాయుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేకపాటి డిమాండ్‌ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే.. శ్రీ జగన్మోహన్‌రెడ్డి సిఎం అయిపోతారని, మీరు చేసిన ఐఎంజి లాంటి తప్పులన్నింటిపైనా విచారణ జరుగుతుందని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని అన్నారు.

ఎల్లప్పుడూ ప్రజలను మోసగించడం చంద్రబాబుకు సాగదన్నారు. ఒంటెత్తు పోకడలు పోతుంటే ప్రజలు జీర్ణించుకోరని, సహించబోరని కాంగ్రెస్‌ పార్టీని మేకపాటి హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు పూనుకోవడంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్‌ పార్టీ అంటే సోనియా గాంధీ, రెండవ ముద్దాయి చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మేకపాటి మాట్లాడారు.

'వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయం బలమైన కేంద్ర ప్రభుత్వం. బలమైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలన్నదే పార్టీ ధ్యేయం' అని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సుమారు దశాబ్ద కాలంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగమే నడుస్తోందన్నారు. అందువల్లే బలహీనమైన కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని అన్నారు. బహుశా అదే కారణంతో జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్‌, బిజెపిలు కూడా బలహీనమైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఉందన్నారు. అందుకే ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మూడు చిన్న రాష్ట్రాలను విభజించినా.. యుపిఎ 2 ప్రభుత్వం మన రాష్ట్రాన్ని విభజించాలని పూనుకున్నా కూడా బహుశా అదే కారణం కావచ్చేమో అన్నారు.

విదర్భ, బోడోలాండ్, గూర్ఖాలాండ్ లాంటి అనేక ప్రాంతాల్లో విభజన డిమాండ్ ఉందని మేకపాటి ప్రస్తావించారు. రాష్ట్రాన్ని మూడు నాలుగు రాష్ట్రాలుగా విభజించమని ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించిందని గుర్తుచేశారు. ఆ డిమాండ్లన్నింటిని పక్కన పెట్టి జూలై 30న కేవలం మన రాష్ట్రాన్ని మాత్రమే విభజించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అక్టోబర్‌ 3న టేబుల్‌ అజెండా అని పెట్టి కేబినెట్‌ కూడా ఆమోదించిందన్నారు.

దీనికంతటికీ ప్రధాన కారణం, మొదటి ముద్దాయి కాంగ్రెస్‌ పార్టీ అని, కాంగ్రెస్‌కు ఇలాంటి ధైర్యం రావడానికి మూల కారణం చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడమే అని మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు టిడిపి అనుకూలం అని 2008లో చంద్రబాబు లేఖ ఇచ్చారని, తరువాత విభజన చేసుకోవచ్చని పదేపదే చెప్పడంతో కేంద్రం ధైర్యంగా విభజన నిర్ణయం తీసుకుందన్నారు.

రాష్ట్ర విభజన నిర్ణయం సిడబ్ల్యుసి తీసుకున్న వెంటనే సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలివ్వండని చంద్రబాబు నాయుడు అడగడాన్ని మేకపాటి తప్పుపట్టారు. కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోమని సీమాంధ్ర ఎన్జీవోలు వెళ్ళి కోరినప్పుడు వెనక్కి తీసుకోనని కచ్చితంగా చంద్రబాబు చెప్పిన వైనాన్ని తీవ్రంగా ఖండించారు.

సీమాంధ్రలో వెల్లువెత్తిన సమైక్య ఉద్యమం తీరు, ఉధృతిని చూసిన చంద్రబాబు నాయుడు తాను బహుశా పొరపడ్డానేమో అనుకున్నారో లేక తెలంగాణలో ఎలాగూ మట్టికొట్టుకుపోయిన టీడిపి సీమాంధ్రలో కూడా దారుణం అయిపోతుందని భయపడ్డారో అని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్ళి నిరాహార దీక్ష చేశారని అన్నారు. అక్కడ సిఎన్ఎన్, ఐబిఎన్ లాంటి జాతీయ చానెళ్ళు వచ్చి మీరు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? అని అడిగితే దానికి ఇదమిత్ధమైన సమాధానం చెప్పలేక తడబడ్డారని అన్నారు. ప్రజలకు సమన్యాయం కావాలని పదేపదే చెప్పారన్నారు. విభజనకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా, సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమాన్ని అస్సలు పట్టించుకోకుండా సమన్యాయం అనడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. పైగా కేంద్రంలో కదలిక తెచ్చానని, సెగ తగిలించానని చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. టెన్‌ జన్‌పథ్‌ దగ్గర టిడిపి వాళ్ళు ధర్నాలు చేశారని చెప్పుకుంటున్నారని విమర్శించారు. మీరు చేయగలరా? అని మిగతా పార్టీలను ముఖ్యంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అడుగుతున్నారని అన్నారు.

చంద్రబాబు నాయుడి తీరులన్నీ చూస్తుంటే.. ఇప్పటికీ ఆయన రాష్ట్ర విభజనకు అనుకూలమా? కాదా? చెప్పాలని మేకపాటి డిమాండ్‌ చేశారు. నిజంగా చంద్రబాబునాయుడు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారా? అన్నారు. ఇప్పటికైనా తాను చేసిన పొరపాటును తెలుసుకుని కేంద్రానికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నాను.. ఈ విధంగా నిర్ణయం ఇస్తారని ఊహించలేకపోయాను.. కాబట్టి నా లేఖను వెనక్కి తీసుకుంటున్నాను అని ఆంధ్రప్రదేశ్‌ను యధాతథంగా ఉంచాలని ఇప్పటికైనా చెప్పవచ్చన్నారు.

చంద్రబాబు ఇలా చెప్పకుండా.. విభజన నిర్ణయం రాగానే టిడిపి ఎంపిలు రాజీనామా చేశామని చెప్పారని అన్నారు. లోక్‌సభ స్పీకర్‌ విడుదల చేసిన నోట్‌లో టిడిపికి చెందిన ఒక్క బందరు ఎం.పి. నారాయణరావు పేరు మాత్రమే స్పీకర్‌ ఫార్మాట్‌లో ఇచ్చారని స్పష్టం అయిందన్నారు. మిగతా 12 మందిలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి, తాను, కాంగ్రెస్‌ నుంచి 10 మంది కలిపి మొత్తం 13 మంది మాత్రమే ఫార్మాట్‌లో రాజీనామా లేఖలు ఇచ్చిన విషయం వెల్లడి అయిందన్నారు. కోర్టు ఆదేశాల కారణంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి రాలేకపోతున్నారని స్పీకర్‌ను కలిసినప్పుడు తాను చెప్పానన్నారు. శ్రీ జగన్‌ ఫోన్‌ నెంబర్‌ స్పీకర్‌కు ఇచ్చి స్వయంగా తెలుసుకోమని కోరానన్నారు.

కానీ, చంద్రబాబు చేస్తున్న నాటకమేంటి? టిడిపికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా రాజీనామాలు చేశామని చెప్పారని మేకపాటి అన్నారు. టిడిపి రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే కాకుండా సభ చైర్మన్‌ దగ్గరకు వెళ్ళి ఆమోదింపజేసుకున్నారని గుర్తుచేశారు. అయితే మిగతా టిడిపి సభ్యులెవరూ రాజీనామాలు ఇచ్చారా? ఇస్తే.. ఫార్మాట్‌లో ఇచ్చారా? అనేది తెలియని విషయం అన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలకు టిడిపి నాయకులు ఏ విధంగా మోసగించాలనుకుంటున్నారో తేటతెల్లం అవుతోందన్నారు. ఇప్పటికైనా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారా? లేదా? అని ఒక్కటే చంద్రబాబును తాను అడుగుతున్నానని మేకపాటి అన్నారు. లేదా రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉంటే.. వేరే మాటలు వద్దని సూచించారు. చంద్రబాబు ఒకలా, టిడిపి లోక్‌సభ సభ్యులు ఒకలా, రాజ్యసభ సభ్యలు మరోలా మాట్లాడడం వద్దన్నారు.

లోక్‌సభలో టిడిపి సభ్యులు ఆడిన నాటకాలన్నీ చూశామని మేకపాటి ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీ మాస్కు పెట్టుకుని ఒకాయన సభలోకి వెళ్ళిన వైనాన్ని ప్రస్తావించారు. ఒకాయన కొరడా దెబ్బలు కొట్టుకున్నారని, రాజ్యసభలో అయితే.. రకరకాల గలాభాలు చేశారన్నారు. సీమాంధ్రుల ఆందోళనను తెలుసుకున్న టిడిపి నాయకులు చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకువచ్చి సమైక్యాంధ్రకు కట్టుబడేలా చేయవచ్చు కదా అన్నారు. లేదా చంద్రబాబైనా స్వయంగా ఈ పని చేయవచ్చన్నారు. అలాంటిదేమీ చేయకుండా ఏవేవో నాటకాలాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కైపోయిందని ఆరోపించడం ఏమిటని నిలదీశారు. తెలంగాణలో టిఆర్ఎస్‌తో, సీమాంధ్రలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌తో కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కైపోయిందనడాన్ని మేకపాటి ఖండించారు.

నిజంగా సమైక్యాంధ్రను చంద్రబాబు కోరుకుంటే.. సమైక్యాంధ్రపై నమ్మకం ఉన్న వ్యక్తి అయితే.. అదే చెప్పవచ్చు కదా అని మేకపాటి అన్నారు. ఈ రాష్ట్రం చీలిపోవాలనుకుంటున్నారా? లేక సమైక్యంగా ఉంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది.. ఎమ్మార్‌, ఐఎంజి లాంటి గతంలో తాను చేసిన దురాగతాలన్నీ బయటకు వస్తాయి, నేరం రూఢి అవుతుందని చంద్రబాబు భయపడుతున్నారా? అని నిలదీశారు. సీమాంధ్రులు ఏమైనా, వారికి ఎన్ని అవస్థలు వచ్చినా పరవాలేదు.. తాను మాత్రం క్షేమంగా ఉండాలని, రాష్ట్రాన్ని విభజిస్తే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రస్తావనే లేకుండా పోతుంది.. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా తన జోలికి రాదని చంద్రబాబు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

రాజకీయాలంటే... కుట్రలు, కుతంత్రాలు కాదని, ఎల్లప్పుడూ ఎత్తుగడలతో ప్రజలను మభ్యపెట్టం కాదన్నారు. ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు ఇలాంటి నాటకాలతో సెల్ఫు గోల్సు కొట్టుకుంటున్నారని మేకపాటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిక్కచ్చిగా ఉంటే.. రాజకీయం వేరే విధంగా ఉండేదన్నారు.

Back to Top