'సహకార సంఘాలను నిర్వీర్యం చేయొద్దు'

హైదరాబాద్‌, 18 డిసెంబర్‌ 2012: రైతులకు మాత్రమే సంబంధం ఉన్న సహకార సంఘాలను రాజకీయాలతో నిర్వీర్యం చేయవద్దని ముఖ్యమంత్రికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. నీలం తుపాను నష్టం అంచానాల్లో, సహకార సంఘాల సభ్యత్వ నమోదులో జరుగుతున్న అక్రమాలు, పాడి రైతుల పొట్ట కొట్టే యత్నాలను విరమించుకోవాలని కోరింది. రైతు సమస్యలపై వైయస్‌ఆర్‌ఆర్‌ సిపి రైతు విభాగం సిఎంకు రాసిన లేఖను మంగళవారంనాడు పత్రికలకు విడుదల చేసింది. వ్యవసాయం, రైతులపై ఏమాత్రం అవగాహన లేకుండానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అన్నదాతలు ఎలా అన్యాయమైపోతారనే అంశంపై కొన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఆ లేఖలో తీసుకువచ్చింది.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు గాను 18 బ్యాంకులు దివాళా తీశాయని, ప్రాథమిక సహకార సంఘాలు మూసివేసే పరిస్థితి ఉందని వైయస్‌ఆర్‌సిపి రైతు విభాగం సిఎంకు రాసిన లేఖలో గుర్తుచేసింది. వైద్యనాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు రూ. 1,800 కోట్ల సహాయం అందించి ప్రాథమిక సంఘాలను, తద్వారా బ్యాంకులను ఆదుకున్న విషయాన్నికూడా  పేర్కొంది. కాలం తీరిస బోర్డులు, ప్రత్యేక అధికారుల అధీనంలో బ్యాంకుల పాలన ఉండకూడదన్నది వైద్యనాథన్‌ కమిటీ సిఫారసులలో ప్రధానమైనదని ప్రస్తావించింది.

అయితే, ప్రస్తుత ప్రభుత్వం కాలం తీరిన బోర్డులనే పొడిగిస్తూ, ఎట్టకేలకు ఎన్నిక ప్రక్రియను ప్రకటించిందనీ, అయితే, ఈ ఎన్నికలు ఎంతవరకూ సజావుగా నిర్వహిస్తారో అనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సిపి రైతు విభాగం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను ప్రకటించి, కొత్త సభ్యత్వ నమోదు అర్హతను మార్చివేసిన ప్రభుత్వం మొత్తం సహకార వ్యవస్థ ఆలోచననే నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించింది. ఇంతకు ముందు ఎవరైనా సహకార సంఘంలో సభ్యత్వం తీసుకోవాలంటే ఆ వ్యక్తి నివాసం గాని, అతని భూమి గాని రెండింటిలో ఏదో ఒకటి సొసైటీ పరిధిలో ఉంటే చాలు. కాని, మార్చిన విధానం ప్రకారం  ఆ వ్యక్తి నివాసం, భూమి రెండూ కూడా సొసైటీ పరిధిలో ఉండాలి. ఇది చాలా అర్థరహితమైన ఆలోచన అని వైయస్‌ఆర్‌సిపి రైతు విభాగం కన్వీనర్‌ ఎం.వి.ఎస్‌. నాగిరెడ్డి విమర్శించారు.

'నీలం' నష్టం అంచనాలు తక్కువ చేసిన వైనం:
వ్యవసాయానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ పెంచినట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇటీవలి నీలం తుపాను వల్ల నష్టపోయిన మొత్తం భూముల కన్నా తక్కువ హెక్టార్లను అంచనాల్లో చూపించి రైతులకు అన్యాయం చేసిందని నాగిరెడ్డి ఆరోపించారు. హెక్టారుకు రూ. 6 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తే 100 హెక్టార్లకు రూ. 6 లక్షలు అవుతుందన్నారు. అయితే, అదే నష్టాన్ని 10 హెక్టార్లకు కుదించి రూ. 10 వేలకు సబ్సిడీ పెంచినప్పటికీ రైతులకు వచ్చే మొత్తం కేవలం లక్ష రూపాయలే అవుతుందని ఆయన వివరణ ఇచ్చారు. ఇలా నష్టపోయిన పరిధి మొత్తాన్ని తగ్గించడం ద్వారా రైతన్నకు అన్యాయం చేసిన వైనాన్ని వెల్లడించారు.

నవంబర్‌ 1,2,3,4 తేదీల్లో ఎడతెరిపి లేని అధిక వర్షాల కారణంగా వరి, పత్తి పంటలు తడిసి, రంగుమారి, మొలకెత్తి నష్టపోయారని నాగిరెడ్డి తెలిపారు. మెట్ట పంటలు మిర్చి, కూరగాయలు, మొక్కజొన్న మొదళ్ళలో నీరు నిలిచి మొక్కలు చనిపోయి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. పత్తిపంట విషయంలోనూ ఇలాగే అన్యాయం జరిగిందన్నారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కేవలం 13,446 హెక్టార్లలో మాత్రమే పత్తిపంట నష్టపోయినట్లు అంచనాలు వేయడంపై నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రైతులను అన్యాయం చేయడమే రైతు ప్రభుత్వ విధానమా? అని ప్రశ్నించారు. పత్తి మద్దతు ధర విషయంలో కూడా ప్రభుత్వం అన్యాయమే చేస్తోందన్నారు.

పాడి పరిశ్రమకూ అన్యాయమే:
పంటలు వేసి అన్ని విధాలా నష్టపోయిన రైతన్నను మరింత కృంగదీసేలా ఈ ప్రభుత్వం పాడి విధానం ఉందని వైయస్‌ఆర్‌సిపి రైతు విభాగం సిఎం దృష్టికి తీసుకువచ్చింది. పంటలు నష్టపోయిన రైతాంగం పచ్చడి మెతుకులైనా తింటున్నారంటే అది పాడి ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే అని పేర్కొంది. లీటరు పాల సేకరణ ధర రూ. 15కు తగ్గించివేసి హెరిటేజ్‌ సంస్థ రైతులకు ఒకవైపున అన్యాయం చేస్తోంటే ప్రభుత్వం మిల్కు హాలిడే ప్రకటించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. రైతుల పొట్ట కొట్టి, వారిని ఆర్థికంగా కుంగదీసి ప్రైవేటు డెయిరీలకు ప్రత్యేకంగా హెరిటేజ్‌ డెయిరీ కొమ్ము కాయడం ఎక్కడి న్యాయమో ఆలోచించాలని సిఎంకు సూచించింది.

ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం డిమాండ్‌ చేసింది.

తాజా వీడియోలు

Back to Top