హైదరాబాద్, 5 మార్చి 2013: రాష్ట్రంలో అసాధారణ రీతిలో కరెంటు కోతలు విధించడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కరెంటు లేకపోవడానికి గ్యాస్ లేదని, బొగ్గు లేదని, నీళ్ళు లేవని ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదని ఆయన నిప్పులు చెరిగారు. నిజానికి రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందన్నారు.
విద్యుత్ సమస్యలపై ఉద్యమం చేసి, ఉచిత విద్యుత్ ఇస్తామని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హామీ ఇవ్వడం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గట్టు తెలిపారు. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు, శ్రీమతి విజయమ్మ బహిరంగ సభలకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేకే బ్రదర్ అనిల్ కుమార్‌పై టిడిపి, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని, చంద్రబాబుకు బినామీగా మారిన బిజెపి అధికార ప్రతినిధి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ 'కారుకూతలు' కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అసలైన ఎండాకాలం ముందు ఉన్నప్పటికీ ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ కోతలు పెంచడాన్ని గట్టు రామచంద్రరావు తప్పు పట్టారు. విద్యుత్ కోతలు వ్యవసాయం, పరిశ్రమలు, విద్యా వ్యవస్థ ఇతర రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో రెండు గంటలే అని ప్రభుత్వం చెప్పినా నాలుగు గంటలు, జిల్లా కేంద్రాల్లో నాలుగు గంటలు అన్నా 8 గంటలు విద్యుత్‌కోతలు అమలవుతున్నాయన్నారు. గ్రామాల్లో పగటిపూట ఉండదని ప్రభుత్వం చెప్పినా రాత్రిళ్ళు కూడా కరెంటు ఉండడంలేదన్నారు. తీవ్రమైన విద్యుత్ కొరత ముంచుకు వస్తుందన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు. అయినా ముందుచూపు లేకపోయిందని ఆరోపించారు. విద్యుత్ చార్జీలు పెంచే విషయంలో మాత్రం ముందుచూపు ప్రదర్శించిందని విమర్శించారు. ఇంత చేతగాని ప్రభుత్వం మరొకటి లేదన్నారు.
సన్నకారు రైతులపై సాధింపులు :మెట్ట పంటలు వేయొద్దని కిరణ్ ప్రభుత్వం ఉచిత సలహా ఇవ్వడాన్ని గట్టు తప్పు పట్టారు. సన్నకారు, చిన్నకారు రైతులు, బలహీన వర్గాల వారే ఎక్కువగా మెట్ట పంటలు పండిస్తారని అన్నారు. అంటే వారిని పంటలు వేయొద్దని ప్రభుత్వం సాధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక రాష్ట్రంలో ఇప్పుడు 25 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంక్షోభం కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 1,80,000 పరిశ్రమలు మూతపడి, 50 లక్షల మంది కార్మికులు వీధిన పడిన వైనాన్ని గట్టు గుర్తుచేశారు.
మన రాష్ట్రంలో దొరికే గ్యాస్‌ను మన అవసరాలకు తీసుకోవడానికి రిలయన్సుపై ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రభుత్వాన్ని గట్టు రామచంద్రరావు నిలదీశారు. చీకటి ప్రభుత్వాన్ని ఏలిన టిడిపి, ఇప్పుడు చీకటి రాజ్యాన్ని తీసుకువస్తున్న కిరణ్ కుమార్‌రెడ్డి ఒకరికి ఒకరు వారసులుగా మిగిలారని విమర్శించారు. మహానేత వైయస్ఆర్ మాదిరిగా కాకుండా చంద్రబాబు నాటి చీకటి రోజులను కిరణ్ కుమార్ రెడ్డి తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు.
విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలను ఈ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తున్నా ప్రధాన ప్రతిపక్షం పోరాటాలు చేయడంలేదని గట్టు విమర్శించారు. కరెంటు సంక్షోభం తీవ్రమైనా మరో ప్రతిపక్షమైన బిజెపి నోరు విప్పదన్నారు. చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారో చెప్పరని, ఇకపై తానేం చేస్తారో చెప్పరని, ఎంతసేపూ మహానేత వైయస్‌ను, వైయస్ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
బాబు బినామీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్: :టిడిపి స్ర్కిప్టునే బిజెపి అధికార ప్రతినిధి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ చదువుతున్నారని గట్టు ఎద్దేవా చేశారు. చంద్రబాబు బినామీగా ప్రభాకర్ మారారని ఆరోపించారు. ప్రభాకర్ 'కారుకూతలు' మానుకోవాలని ఆయన హితవు పలికారు. శ్రీమతి షర్మిల కారు నెంబర్ సరిగా చూడకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రజా సమస్యల కన్నా బిజెపికి వైయస్ కుటుంబంపై విమర్శలు చేయడమే ముఖ్యమా అని ప్రశ్నించారు. బ్రదర్ అనిల్‌పై ప్రభాకర్ చేస్తున్నవన్నీ రాజకీయ ఆరోపణలే అన్నారు. ప్రభాకర్ చెప్పిన 12 సంస్థల్లో ఏ ఒక్కదానిలో అయినా బ్రదర్ అనిల్ కుమార్ పెట్టుబడులు ఉన్నట్లు రుజువు చేయాలని గట్టు సవాల్ చేశారు. లోక్‌సభలో బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ మాటలు ప్రభాకర్ చెవికి ఎక్కలేదా? అని నిలదీశారు. వైయస్ జగన్మోహన్రెడ్డిపై పెట్టిన కేసులన్నీ అక్రమం అని, అవన్నీ రాజకీయ కుట్రలో భాగమే అని సుష్మా స్వరాజ్ పేర్కొన్న వైనాన్ని గట్టు ఉటంకించారు.