హైదరాబాద్, 19 డిసెంబర్ 2012: రోజుకు 12 విద్యుత్ కోతలతో మన రాష్ట్రం ఇప్పుడు దేదీప్యంగా వెలిగిపోతోందా? అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతోందా? అని నిలదీశారు. కన్నీళ్ళు చూసి జాలిపడి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుందని, అథోగతి పాలైపోతుందని మంగళవారం విశాఖపట్నం ఇందిరమ్మ బాటలో కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తూర్పారపట్టింది. నాగార్జునసాగర్ నుంచి నీళ్ళు అందని పరిస్థితిలో అన్నదాతలు అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పత్తి కొనలేని స్థితిలో సిసిఐ ఉందని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా రాష్ట్రంలోని ప్రతి వర్గమూ కిరణ్ ప్రభుత్వం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొటున్న విషయాన్ని ఎత్తి చూపింది. కిరణ్ కుమార్‌రెడ్డి వద్దకు వచ్చిన ఫైళ్ళు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోతున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇక ఇలాంటి పాలనలో రాష్ట్రం అథోగతి పాలు కాలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలా భావిస్తారని నిలదీసింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కిరణ్ వల్లే రాష్ట్రం అథోగతి పాలైదంని అంబటి నిప్పులు చెరిగారు.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎం.పి. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు, ఎస్టీలు, బిసిల కోసం పోరాడి జైలులోకి వెళ్లలేదన్నకిరణ్ రెడ్డి వ్యాఖ్యలను రాంబాబు ఖండించారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసినప్పుడు తాను బాధపడ్డానంటూ కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాంబాబు ప్రస్తావించారు. కాని, శ్రీ జగన్ అరెస్టు చేసిన అనంతరం సిబిఐ తేలుస్తున్న విషయాలు చూశాక ఆయనకు ఈ శిక్ష సమంజసమే అని భావిస్తున్నానన్న కిరణ్ మాటలను అంబటి తీవ్రంగా ఖండించారు. శ్రీ జగన్ అరెస్టుతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటూ కిరణ్ చెప్పిన అబద్ధాలను ఆయన ఎద్దేవా చేశారు. సిబిఐ విచారణ మేరకు, కోర్టు ఆదేశాల ప్రకారమే శ్రీ జగన్ అరెస్టు చేశారన్న కిరణ్ మాటలను తప్పుపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే తాను శ్రీ జగన్‌పై హైకోర్టులో పిటిషన్ వేసినట్లు శంకర్రావు చెప్పిన విషయాన్ని అంబటి గుర్తుచేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఎందుకు జైలులో పెట్టారో కిరణ్ కుమార్‌రెడ్డికి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. అన్యాయం చేసో, అక్రమం చేసో శ్రీ జగన్ జైలుకు వెళ్ళలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీని కాదని బయటికి వచ్చినందుకే ఆయనను జైలుకు పంపించిన విషయం తెలియదా అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని వైయస్‌ఆర్‌సిపి చిత్తుచిత్తుగా ఓడిస్తున్నందుకే కుట్ర చేసి శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జైలులో పెట్టించిందని అంబటి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కడపలో నిలబడి లక్షా 90 వేల మెజారిటీ తెచ్చుకున్న శ్రీ జగన్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పోటీ చేస్తే 5,40,000 మెజారిటీ సాధించినందుకే జైలుకు వెళ్ళారని అన్నారు.
తక్కువ సీట్లతో కిరణ్ రికార్డు సృష్టించనున్నారు:ఈ రాష్ట్ర ప్రజలంతా శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ఓటు వేయాలని నిర్ణయించుకున్న విషయం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలుసన్నారు. అందుకే నక్కజిత్తులన్నీ ఉపయోగించి శ్రీ జగన్‌ను ఏదో విధంగా అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఆరోపించారు. గతంలో 1996లో ఎన్నికలు జరిగితే కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నాయకత్వంలోను, వరంగల్‌కు చెందిన కమాలుద్దీన్ అహ్మద్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత తక్కువగా 26 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎన్నికలు జరిగితే ఆ రికార్డును బద్దలు కొట్టి కేవలం 26 సీట్ల నుంచి 16 సీట్లకే పరిమితం అవుతుందని అంబటి జోస్యం చెప్పారు. కాకమ్మ కథలు చెప్పడం మానుకొని వాస్తవాలు తెలుసుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డికి అంబటి సలహా ఇచ్చారు.
నష్టాల హెరిటేజ్‌కు నిధుల కోసమే ఎఫ్‌డిఐలను ఆహ్వానించిన చంద్రబాబు:నష్టాల్లో కూరుకుపోయిన సొంత హెరిటేజ్ సంస్థకు నిధులు సమకూర్చుకునేందుకే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు ఆహ్వానం చెప్పారని అంబటి దుయ్యబట్టారు. ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా గైర్హాజరైన సుజనా చౌదరి రాజీనామాను చంద్రబాబు తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ ఆరోపణ చేశారు. సొంత సంస్థ కోసమే తమ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులను చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తున్న ఎఫ్‌డిఐలకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా చంద్రబాబు కూడా లాభపడుతున్నారన్నారు. ఎఫ్‌డిఐలకు మార్గం సుగమం చేసే క్రమంలో చంద్రబాబు ఆదేశాల మేరకే ముగ్గురు టిడిపి రాజ్యసభ సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరైన విషయం బట్టబయలైందన్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయిన విషయాన్ని అనేక సందర్భాల్లో తమ పార్టీ బహిర్గతం చేస్తూనే ఉన్నవిషయాన్ని అంబటి ప్రస్తావించారు.
శ్రీమతి షర్మిల మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగిందని, వైద్యుల సలహా మేరకు ఆరు వారాల విశ్రాంతి అనంతరం ఆమె ఎక్కడ పాదయాత్రకు బ్రేక్ వచ్చిందో అక్కడి నుంచే మళ్ళీ ప్రారంభిస్తారని ఒక విలేకరి ప్రశ్నకు అంబటి సమాధానం చెప్పారు. తెలంగాణ విషయమై ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంపై పార్టీలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, నిర్ణయం తీసుకున్న తరువాత మీడియాకు వెల్లడిస్తామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. హింస వైయస్‌ఆర్‌సిపి విధానం కాదన్నారు. శాంతియుతంగానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాలన్నది తమ పార్టీ అభిమతం అన్నారు. వైయస్‌ఆర్‌సిపి దాడులు చేయదని, ప్రోత్సహించదని మరో విలేకరికి అంబటి సమాధానం చెప్పారు. తనను అరెస్టు చేసినప్పుడు కూడా తమ పార్టీ అధినేత శ్రీ జగన్ హింసావాదం వద్దని శ్రేణులను ఆదేశించిన వైనాన్ని గుర్తుచేశారు. కాగా, దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌పై మంత్రి సి. రామచంద్రయ్య చేసిన అవినీతి ఆరోపణలను అంబటి ఖండించారు. కాంగ్రెస్ పార్టీని నోటికి వచ్చినట్లు విమర్శించి, చివరికి అదే పార్టీలో చేరి మంత్రిగా అఘోరిస్తున్న రామచంద్రయ్యకు వైయస్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు.