పిఆర్‌ కిరణ్‌ మృతికి వైయస్‌ఆర్‌సిపి సంతాపం

హైదరాబాద్‌, 26 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌సిపి కోశాధికారి, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత మాజీ కార్యదర్శి పి.ఆర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి మృతికి పార్టీ తీవ్ర సంతాపం ప్రకటించింది. అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి మృతి వ్యక్తిగతంగా తనకు, పార్టీకి తీరని లోటు అని వైయస్‌ఆర్‌సిపి సలహాదారు డిఎ సోమయాజులు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.‌ నిరుపేదల అభ్యున్నతి కోసం కిరణ్ కుమార్‌రెడ్డి నిరంతరం కృషిచేశారని ఆయన నివాళులు అర్పించారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి కిరణ్‌ కుమార్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా మంచి సేవలు అందించారని ఈ సందర్భంగా సోమయాజులు గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎంకు వివిధ సమస్యలపై వచ్చే అర్జీలు స్వీకరించడం, వాటిని క్రోడికరించడంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎనలేని కృషిచేసినట్లు తెలిపారు.  కిరణ్‌ కుమార్‌రెడ్డి సేకరించిన సమాచారమే నిరుపేదలకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు అందించే ఆరోగ్య భద్రత పథకం రూపకల్పనకు దోహదం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆయన సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఏదైనా చేయాలని నిర్ణయించారని, దేశవిదేశాల్లోనూ విశేష ప్రసంశలు పొందిన ఈ సంక్షేమ పథకం అమలు‌ బాధ్యతను కిరణ్‌ కుమార్ స్వయంగా తన భుజస్కంధాలపై వేసుకున్నారని సోమయాజులు గుర్తు చేశారు.
 
సమాజం అభివృద్ధి కోసం విశేష సేవలు అందించిన కిరణ్‌ కుమార్‌రెడ్డి పార్థివదేహాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చి తుది నివాళులు అర్పించినట్లు సోమయాజులు ఆ ప్రకటనలో తెలిపారు.‌ పి.ఆర్. కిరణ్‌ కుమార్‌రెడ్డి దయార్ద్ర హృదయుడని, ఆయన చేసే ప్రతి పనిలోనూ మానవకోణాన్ని చూసేవారని నివాళులు అర్పించారు.

Back to Top