జస్టిస్‌ చిన్నపరెడ్డి మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్, 13 ఏప్రిల్‌ 2013: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఒంటెత్తుపల్లి చిన్నపరెడ్డి మృతి పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. మద్రాసు, లండన్‌ నగరాలలో న్యాయ విద్య అభ్యసించిన చిన్నపరెడ్డి రెండు దశాబ్దాలుగా హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయమూర్తిగా ఎనలేని సేవలు అందించారని ఆమె కొనియాడారు. చిన్న వయస్సులోనే సర్వోన్నత న్యాయస్థానంలో బాధ్యతలు చేపట్టిన చిన్నపరెడ్డి సామాజిక స్పృహ గల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు.

దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలను పేద, అట్టడుగు వర్గాల చేరువకు తీసుకువెళ్ళడంలో ఆయన చేసిన విశేష కృషి ప్రశంసనీయం అన్నారు. సామాజిక, ఆర్థిక కోణాలలో పరిశీలించి న్యాయస్థానాలు స్పందించాలని భావించిన జస్టిస్‌ కృష్ణయ్యర్‌, జస్టిస్‌ భగవతి కోవకు చెందిన వ్యక్తి  చిన్నపరెడ్డి అని శ్రీమతి విజయమ్మ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. జస్టిస్‌ చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులకు శ్రీమతి విజయమ్మ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగువారందరూ గర్వించదగిన న్యాయకోవిదుడు చిన్నపరెడ్డి మరణం తీరని లోటు అని శ్రీమతి విజయమ్మ నివాళులు అర్పించారు.
Back to Top