తెలుగుజాతి పట్ల రాక్షసబల్లి చంద్రబాబు

హైదరాబాద్, 30 డిసెంబర్ 2013:

గర్జన పేరిట సభలు పెట్టిన చంద్రబాబు నాయుడు గాండ్రింపులు మాని ఓడ్రింపులు పెడుతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. తుపాకి రాముడి మాదిరిగా మాట్లాడుతున్నారన్నారు. ఆయన వదిలేవి తూటాలు కాదు తుప్పరలే అని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అటు రామారావు పాలన గురించి, ఇటు రాజశేఖరరెడ్డి పాలన గురించి చెప్పే చంద్రబాబు తన తొమ్మిదేళ్ళ పాలన గురించి మాత్రం ఏనాడూ చెప్పరని గట్టు విమర్శించారు. తాను విభజన వాదా.. సమైక్య వాదా అనే విషయం మాత్రం చంద్రబాబు చెప్పరని ఎద్దేవా చేశారు. తెలుగువారిని ముక్కలు చేయడానికి పుట్టిన రాక్షసబల్లి అని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తన పాలనలో దారిద్ర్యం తొలిగిపోయిందని చెప్పారని, అయితే.. ఆయన ఏలుబడిలో అవినీతి ఎలా విచ్చలవిడిగా పెరిగిపోయిందో ఎకానమీ సర్వే స్పష్టంగా చెప్పిందని ఆయన తెలిపారు. బాబు హయాంలో పేదరికం తగ్గిందట.. అంటే అబద్ధాలను కూడా అందంగా చెబుతున్నారన్నారు. మన రాష్ట్రంలో 1993 - 94 లో 1,53,96,000 మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని ఎకానమీ సర్వే వెల్లడించిందన్నారు. 2004 -05లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 2,35,10,000 మందికి పెరిగిందని చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువకు రాష్ట్ర ప్రజలను ఇంత భారీగా దిగజార్చింది చంద్రబాబు నాయుడే అని గట్టు ఆరోపించారు.

హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని గర్వంగా చంద్రబాబు చెబుతుంటారని, అయితే.. పట్టణ ప్రాంతాల్లో ఆయన పాలన పదేళ్ళలో వ్యత్యాసాన్ని పరిశీలిస్తే.. 1993- 94లో 79 లక్షల మంది పేదలు ఉండేవారన్నారు. అధికారం నుంచి చంద్రబాబు దిగిపోయే నాటికి పేదల సంఖ్య కోటీ 80 లక్షలకు పెరిగిందన్నారు. అంటే పట్టణాల్లో 125 శాతం పేదల సంఖ్య పెరిగిందని గట్టు వివరించారు. పట్టణ పేదల సంఖ్యను మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కోటీ 80 లక్షల నుంచి కోటీ 27 లక్షలకు తగ్గించగలిగారని చెప్పారు. పేదరికాన్ని తగ్గించగలిగింది రాజశేఖరరెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు కాదన్నారు.

ఎన్టీరామారావు జెండాను, ఎజెండాను లాక్కొని పార్టీ నుంచి ఆయనను బయటకు వెళ్ళగొట్టిన చరిత్ర చంద్రబాబుది అని గట్టు తూర్పారపట్టారు. ఎన్టీఆర్ అధికారాన్ని గుంజుకుని ‌మరణానికి కారకుడైన చంద్రబాబు తాను ఆయన దగ్గర చిత్తశుద్ధితో పనిచేశానని ఇప్పుడు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు చెబుతున్న మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని గట్టు అన్నారు. టీడీపీ ఒక విచిత్రమైన డ్రామా కంపెనీ అని గట్టు అభివర్ణించారు.

నరేంద్ర మోడి, ఆమ్ ఆద్మీ పార్టీ పథకాలను ముందే అమలు చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని గట్టు సూటిగా ప్రశ్నించారు. అవినీతిపరుడైన చంద్రబాబును తెలుగు ప్రజలు రెండుసార్లు ఓడించి బయటికి వెళ్ళగొట్టారని అన్నారు. ప్రపంచంలో ఎవరు గెలిచినా సంబరాలు చేసుకోవడం చంద్రబాబుకు అలవాటైందని గట్టు రామచంద్రరావు విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top